చైన్నె సెంట్రల్‌ నుంచి అరక్కోణానికి కొత్త ఏసీ ఎలక్ట్రిక్‌ రైలు | - | Sakshi
Sakshi News home page

చైన్నె సెంట్రల్‌ నుంచి అరక్కోణానికి కొత్త ఏసీ ఎలక్ట్రిక్‌ రైలు

Sep 4 2026 2:06 AM | Updated on Sep 4 2026 2:06 AM

కొరుక్కుపేట: చైన్నె బీచ్‌ స్టేషన్‌ నుండి చెంగల్పట్టు వరకు ఒక ఏసీ ఎలక్ట్రిక్‌ రైలును నడుపుతున్నారు. పూర్తిగా ఏసీ సౌకర్యం ఉన్న ఈ రైలుకు తొలిదశలో ప్రయాణికుల నుండి పెద్దగా ఆదరణ లభించలేదు. కానీ ఇప్పుడు ప్రజలు ఏసీ రైలులో ప్రయాణించడానికి ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు పనికి వెళ్లడానికి, పని తర్వాత ఇంటికి తిరిగి రావడానికి ఈ రైలు ప్రత్యేకంగా సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో రెండో ఎలక్ట్రిక్‌ ఏసీ రైళ్లను దక్షిణ రైల్వేకు అప్పగించారు. ఈ రైలును ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. సెంట్రల్‌ నుండి అరక్కోణం వరకు ఒక కొత్త ఏసీ ఎలక్ట్రిక్‌ రైలును నడపడానికి ప్రణాళిక రూపొందించారు. ఇందుకు సంబంధించిన టైమ్‌టేబుల్‌ను తయారు చేసి రైల్వే స్టేషన్‌కు పంపించారు. ఈ రైలును తిరువళ్లూరు, అవడి, తిరునిన్రావూర్‌, అంబత్తూరు మీదుగా అరక్కోణానికి మళ్లిస్తున్నారు. కాగా ఈ ఏసీ ఎలక్ట్రిక్‌ రైలు వారం రోజుల్లో ప్రజలకు అందుబాటులోకి వస్తుందని అధికారులు తెలిపారు.

దక్షిణ భారత సైనిక దళాల జీఓసీగా ఉల్హాస్‌ కిర్పేకర్‌

చైన్నెలో బాధ్యతల స్వీకరణ

సాక్షి, చైన్నె: భారత సైన్యానికి చెందిన దక్షిణ్‌ భారత్‌ ఏరియా జనరల్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌గా లెఫ్టినెంట్‌ జనరల్‌ ఉల్హాస్‌ కిర్పేకర్‌ బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన చైన్నెలోని విక్టరీ వార్‌ మెమోరియల్‌ వద్ద పుష్పగుచ్ఛం ఉంచి దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు నివాళులర్పించారు.

మిలిటరీ ప్రస్థానం

డిసెంబర్‌ 1989లో భారత ఆర్మీలో నియమితులైన ఈయన, రెండవ తరం సిగ్నల్స్‌ అధికారి. నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ, డిఫెన్స్‌ సర్వీసెస్‌ స్టాఫ్‌ కాలేజ్‌ , నేషనల్‌ డిఫెన్స్‌ కాలేజ్‌పూర్వ విద్యార్థి కూడా. ఐఐటీ కాన్పూర్‌ నుండి కంప్యూటర్‌ సైన్స్‌లో ఎం.టెక్‌ , అలాగే అమెరికాలోని నావల్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ స్కూల్‌ నుండి ఇన్ఫర్మేషన్‌ వార్‌ఫేర్‌లో ఎం.ఎస్‌ డిగ్రీ పూర్తి చేశారు. తూర్పు సరిహద్దు ప్రాంతాలలో మౌంటెన్‌ డివిజన్‌ సిగ్నల్‌ రెజిమెంట్‌ , ప్రత్యేక నిఘా విభాగాలకు నాయకత్వం వహించారు. లడఖ్‌ రీజియన్‌లో కారూప్స్‌ హెడ్‌క్వార్టర్స్‌ వద్ద చీఫ్‌ సిగ్నల్‌ ఆఫీసర్‌గా, ఈస్టర్న్‌ కమాండ్‌ చీఫ్‌ సిగ్నల్‌ ఆఫీసర్‌గా, ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌లో కీలకమైన డైరెక్టర్‌ జనరల్‌ హోదాలో అనేక సేవలు అందించారు. విశిష్ట సేవలకు గుర్తింపుగా ఆయన 2023 జనవరి 26న సేనా మెడల్‌, 2025 జనవరి 26న అతివిశిష్ట సేవా మెడల్‌ పురస్కారాలను అందుకున్నారు. డిసెంబర్‌ 1, 2024న కార్‌ప్స్‌ ఆఫ్‌ సిగ్నల్స్‌కు 72వ కల్నల్‌ కమాండెంట్‌గా నియమితులయ్యారు.

కొత్త బాధ్యతలు

దక్షిణ భారత ఏరియా జీఓసీగా బాధ్యతలు స్వీకరించిన కిర్పేకర్‌, ఈ ప్రాంతంలో ఆర్మీకి సంబంధించిన నిర్వహణ, పరిపాలన , మాజీ సైనికుల (వెటరన్స్‌) సంక్షేమ కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు. అలాగే పౌర పరిపాలన విభాగాలతో , పెరుగుతున్న డిఫెన్స్‌ పరిశ్రమలతో ఆర్మీ సంబంధాలను మరింత బలోపేతం చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement