జల్లికట్టు వివాదంపై సీఎం మౌనమేల! | - | Sakshi
Sakshi News home page

జల్లికట్టు వివాదంపై సీఎం మౌనమేల!

Sep 4 2026 2:06 AM | Updated on Sep 4 2026 2:06 AM

● మాజీ మంత్రి ఆర్‌.పి.ఉదయ్‌కుమార్‌ ● మదురైలో నిరసన

సాక్షి, చైన్నె: తమిళ సాంప్రదాయ క్రీడ జల్లికట్టుపై అసెంబ్లీలో చోళవందాన్‌ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పటికీ, దానిపై సీఎం విజయ్‌ మౌనం వహించడంపై అన్నాడీఎంకే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై సీఎం సమ్మతి ఉందేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నాడీఎంకే సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి ఆర్‌బీ ఉదయ్‌కుమార్‌ ఆరోపించారు.

అలంగానల్లూర్‌ వద్ద నిరసన

జల్లికట్టు క్రీడ యువతను నాశనం చేస్తుందని చోళవందన్‌ టీవీకే ఎమ్మెల్యే కరుప్పయ్య చేసిన వ్యాఖ్యలను, దీనిపై టీవీకే ప్రభుత్వ తీరును నిరసిస్తూ మదురై జిల్లా అలంగానల్లూర్‌ వాడివాసల్‌ సమీపంలో అన్నాడీఎంకే ఆధ్వర్యంలో గురువారం నిరసన కార్యక్రమం జరిగింది. జల్లికట్టు ఎద్దులతో మాజీ మంత్రులు సెల్లూర్‌ రాజు, ఆర్‌బీ ఉదయ్‌కుమార్‌, వి.వి.రాజన్‌ సెల్లప్పల నేతృత్వంలో అన్నాడీఎంకే వర్గాలు తరలి వచ్చారు.

ఎమ్మెల్యే రాజీనామాకు డిమాండ్‌

తమిళుల వీరత్వానికి, సంస్క్కృతికి ప్రతీకగా ఉన్న జల్లికట్టును అవమానించిన ఎమ్మెల్యే చేత సీఎం విజయ్‌ రాజీనామా చేయించాలని, లేకపోతే బాధ్యత వహిస్తూ సీఎం రాజీనామా చేయాలని ఆర్‌.బీ.ఉదయ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. స్క్రిప్ట్‌ లేకుండా సీఎం మాట్లాడలేకపోతున్నారని విమర్శించారు.

రీల్స్‌ ప్రభుత్వంపై ధ్వజం

మాజీ మంత్రి సెల్లూర్‌ కె.రాజు మాట్లాడుతూ, ప్రస్తుత ప్రభుత్వం కేవలం రీల్స్‌ చేసుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నదన్నారు. గత అన్నాడీఎంకే ప్రభుత్వం చేపట్టిన పథకాలనే తాజా ప్రభుత్వం కూడా తమవిగా ప్రచారం చేసుకుంటోందని మండిపడ్డారు. జయలలిత హయాంలో జల్లి కట్టుపై ఉన్న నిషేధాలను అధిగమించి క్రీడను పునరుద్ధరించామని గుర్తుచేశారు. ఆందోళనలు తీవ్రం కావడంతోనే స్పీకర్‌ జేసిడీ ప్రభాకర్‌ సదరు ఎమ్మెల్యే వ్యాఖ్యలను అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించారని, యువతను, వీర క్రీడను అవమానించేలా మాట్లాడటం సభా సాంప్రదాయాలకే విరుద్ధమని ఈసందర్భంగా రాజన్‌ సెల్లప్ప విమర్శించారు. తమిళుల ఆత్మగౌరవంతో ముడిపడి ఉన్న జల్లీకట్టు హక్కును కాలరాయాలని చూస్తే ప్రభుత్వం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని నాయకులు హెచ్చరించారు. కాగా, నిరసనకు తరలి వచ్చిన వారిని అలంగానల్లూరు వైపుగా వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారన్న ఆగ్రహాన్ని మాజీ మంత్రులు వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement