తిరువళ్లూరు: ఉల్లి ధరలు పెరుగుతున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నిరుపేదలకు రేషన్ దుకాణాల ద్వారా తక్కువ ధరకే ఉల్లిపాయలను అందించే కార్యక్రమానికి తిరువళ్లూరులో గురువారం శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉల్లిపాయల ధరలు భారీగా పెరుగుతున్నాయి. గత రెండు వారాల క్రితం వంద రూపాయలకు మూడుకిలోల మేరకు విక్రయాలు జరిగిన క్రమంలో, గత నాలుగు రోజుల నుంచి భారీగా ధరలు పెరిగింది. ప్రస్తుతం కిలో ఉల్లి వంద రూపాయలకు పెరిగింది. పెరిగిన ఉల్లిని కొనుగోలు చేయడం సాధారణ ప్రజలకు భారంగా మారిన క్రమంలో రేషన్ దుకాణల ద్వారా పంపిణి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారి చేసింది. ఇందులో భాగంగానే గురువారం ఉదయం తిరువళ్లూరులోని రేషన్ దుకాణంలో ఉల్లిని పంపిణి చేసే కార్యక్రమాన్ని సహాకార సంఘాల జాయింట్ రిజిస్టర్ జయశ్రీ ప్రారంభించారు.
తిరుత్తణి: గోకులాష్టమి పురస్కరించుకుని తిరుత్తణిలోని పాఠశాలలో గురువారం వేడుకలు కోలాహలంగా నిర్వహించారు. తిరుత్తణి దళపతి వినాయకం మెట్రిక్ ప్రాథమిక పాఠశాలలో గోకులాష్టమి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులకు వారి తల్లిదండ్రులు చిన్ని కృష్ణుడు వేషధారణతో పాఠశాలకు తీసుకొచ్చారు. పాఠశాల ప్రాంగణంలో అలంకరించిన శ్రీ కృష్ణుడి చిత్రపటం వద్ద పండ్లు, పలహారాలు, తినుబండారాలు వుంచి పూజలు చేపట్టారు. ఇందులో పాఠశాల కరస్పాండెంట్ బాలాజీ పాల్గొని విద్యార్ధులకు స్వీట్లు పంచిపెట్టి గోకులాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా చిన్నారుల చిన్ని కృష్ణుడు రాధ వేషధారణలో నృత్య ప్రదర్శన, నాటకం అమితంగా ఆకట్టుకుంది.
సాక్షి,చైన్నె: దక్షిణాది చిత్ర పరిశ్రమల నుంచి వస్తున్న అద్భుతమైన కథలు, సినిమాలకు అంతర్జాతీయ స్థాయిలో లభిస్తున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ కొత్త విభాగాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇన్–టు ది సౌత్‌వెర్స్ పేరిట ప్రత్యేక కలెక్షన్ పేజీని గురువారం ఆవిష్కరించింది. ఒకే చోట దక్షిణాది సినిమాలు నెట్‌ఫ్లిక్స్ హోమ్ పేజీలో లభించే రీతిలో ఈ సౌత్‌వెర్స్ హబ్ ద్వారా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషలకు చెందిన విభిన్న సినిమాలు, సిరీస్‌లను యూజర్లు చాలా సులభంగా అన్వేషించ వచ్చునని, 2026 సంవత్సరం మిగిలిన వ్యవధిలో ప్రతి వారం సగటున ఒక నూతన దక్షిణాది చిత్రం లేదా ఒరిజినల్ సిరీస్‌ను స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది.
అన్నానగర్: పోరూరులోని చెట్టియార్ అగరం ప్రాంతంలో ఒక మాదకద్రవ్యాల వ్యాపారి గంజాయి అమ్ముతున్నాడని నార్కోటిక్స్ కంట్రోల్ యూనిట్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో గురువారం ఆ ప్రాంతంలో అత్యంత అప్రమత్తంగా ఉన్న పోలీసులు, 1వ వీధిలో అనుమానాస్పదంగా బ్యాగ్ తీసుకువెళుతున్న ఓ యువకుడిని పట్టుకుని విచారించారు. ఇందులో అదే ప్రాంత నివాసి అయిన మహమ్మద్ ఇర్ఫాన్ ఆసిఫ్ (23), అతని వద్ద గంజాయి ప్యాకెట్లు ఉన్నట్లు గుర్తించారు. దీని తరువాత, పోలీసులు అతన్ని అరెస్టు చేసి, అతని వద్ద నుండి 8 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆన్‌లైన్ డెలివరీ వర్కర్ గా పనిచేసే మహమ్మద్ ఇర్ఫాన్ ఆసిఫ్, గంజాయి అమ్మితే ఎక్కువ లాభం వస్తుందని ఒక స్నేహితుడు చెప్పడంతో గత వారం రైలులో ఒడిశాకు వెళ్లాడు. అతను కిలోకు రూ. 8,000 చొప్పున 12 కిలోల గంజాయిని కొనుగోలు చేశాడు. విచారణలో అతను గంజాయిని ఇంట్లో నిల్వ ఉంచి, కళాశాల విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని ఒక వినూత్న పద్ధతిలో విక్రయిస్తున్నట్లు వెల్లడైంది. అతనితో సంబంధం ఉన్న గంజాయి విక్రయ ముఠాపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అన్నానగర్: తిరుక్కలకుండ్రం సమీపం కీరప్పాక్కంలో ఒక ప్రైవేట్ పాఠశాల నడుస్తోంది. ఈస్థితిలో, బుధవారం సాయంత్రం పాఠ శాల ముగిసిన తర్వాత, 15 మందికి పైగా విద్యార్థులతో పాఠశాలకు చెందిన ఓ వ్యాన్ సిరుంగుండ్రం ప్రాంతానికి వస్తోంది. వలర్‌కుండ్రంకు చెందిన శరవణన్ దాన్ని నడుపుతున్నాడు. మార్గమధ్యంలో, 9 మంది విద్యా ర్థులను దించిన తర్వాత, మిగిలిన 6 మంది విద్యార్థులతో ఉన్న వ్యాన్, తిరుపోరూర్ పక్కన ఉన్న సిరుంగుండ్రం గ్రామ పరిపాలన కార్యాలయం సమీపానికి చేరుకోగానే, అది అకస్మాత్తుగా ఆగిపోయి రోడ్డుకు ఎడమవైపున వ్యాన్ బోల్తా పడింది. వ్యాన్‌లో ప్రయాణిస్తున్న విద్యార్థులు కేకలు వేశారు. ఆ కేకలు విని ఇరుగుపొరుగు వారు పరుగెత్తుకొచ్చి వ్యాన్‌లోని ఆరుగురు విద్యార్థులను రక్షించారు. వారిలో 6వ తరగతి విద్యార్థిని వర్షిణి (12), 11వ తరగతి విద్యార్థి అయిన అశ్వంత్ (9) స్వల్ప గాయాలతో ఒక ప్రైవేట్ ఆసుపత్రి లో చేరాడు. మిగిలిన విద్యా ర్థులు ఎటువంటి గాయాలు లేకుండా తప్పించుకున్నారు. వ్యాన్ డ్రైవర్ మద్యం సేవించి ఉన్నట్లు తెలిసింది. తిరుపోరూర్ పోలీసులు కేసు నమోదు చేసి ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.


