సాక్షి, చైన్నె: అసెంబ్లీలో గురువారం జరిగిన చర్చ సందర్భంగా ప్రధాన ప్రతి పక్ష నేత నేత ఉదయనిధి స్టాలిన్ ప్రభుత్వం, సీఎం విజయ్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దీనికి మంత్రి ఎన్. ఆనంద్ అంతే ఘాటుగా సమాధానమిచ్చారు. ఉదయ నిధి ప్రసంగిస్తూ, ఉచిత సిలిండర్లు, వ్యవసాయ రుణమాఫీ వంటి ఎన్నికల హామీలను టీవీకే ప్రభుత్వం పూర్తిగా నెరవేర్చకుండా అరకొరగా ప్రకటనలకే పరిమితం చేసిందని విమర్శించారు. డీఎంకే హయాంలో చేపట్టిన ఈసీఆర్, హైవేస్ వంటి అభివృద్ధి ప్రాజెక్టులను రద్దు చేశారని, కొత్త పథకాలు తీసుకురాకుండా కేవలం రీల్స్ చేయడానికే ప్రాధాన్యత ఇస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో హత్యలు, మహిళలపై లైంగిక దాడులు పెరిగిపోయాయని, తూత్తుకుడి జిల్లాలో ఒక మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై అధికార పార్టీ నేతలపై చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఇందుకు మంత్రి ఎన్. ఆనంద్ ఘాటు కౌంటర్ ఇచ్చారు. తూత్తుకుడి మహిళ ఇచ్చిన లైంగిక వేధింపుల ఫిర్యాదుపై శ్రీవైకుంఠం మహిళా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, నిందితుడు బాలసుబ్రమణియన్‌ను జూన్ 1నే అరెస్ట్ చేశారని మంత్రి స్పష్టం చేశారు. నిందితుడిని జూన్ 2నే టీవీకే పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుండి తొలగించామని తెలిపారు. విచారణలో స్థానిక ఎమ్మెల్యేకు ఈ ఘటనతో ఎలాంటి సంబంధం లేదని తేలిందన్నారు. తప్పు చేసినవారు ఎంతటివారైనా, ఏ పార్టీకి చెందినవారైనా సీఎం విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం ఉపేక్షించదని, కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. ఈసమయంలో మాటకు మాట అన్నట్టుగా ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. అనంతరం ప్రసంగించిన అన్నాడీఎంకే శాసన సభా పక్ష నేత పళణి స్వామి సైతం ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. శాంతి భద్రతల పరిరక్షణలో పూర్తిగా విఫలమయ్యారని ధ్వజమెత్తారు. మాదక ద్రవ్యాలు విచ్చల విడిగా రాష్ట్రంలో లభిస్తున్నాయని, లైంగిక దాడులు, హత్యలు తాండవం చేస్తున్నాయని మండిపడ్డారు.


