సాక్షి, చైన్నె: తమిళనాడు వ్యాప్తంగా ఉన్న టాస్మాక్ మద్యం దుకాణాల్లో ప్రభుత్వం నిర్దేశించిన ధర కంటే అదనంగా డబ్బులు వసూలు చేస్తున్న 150 మంది ఉద్యోగులను పరిపాలనా విభాగం సస్పెండ్ చేసింది. మద్యం బాటిళ్లపై రూ.10 వరకు అదనంగా వసూలు చేయడాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం కఠిన ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఈ చర్యలు తీసుకున్నారు. అదనపు వసూళ్లకు అడ్డుకట్ట వేసేందుకు టాస్మాక్ సిబ్బంది వేతనాలను ప్రభుత్వం ఇటీవల భారీగా పెంచింది. వేతనాలు పెంచినప్పటికీ, పలు దుకాణాల్లో ప్రతి బాటిల్‌పై రూ.1 నుండి రూ.10 వరకు అదనంగా వసూలు చేస్తున్నట్లు తనిఖీల్లో తేలడంతో 150 మంది సిబ్బందిపై చర్యలు చేపట్టారు.
కొరుక్కుపేట: తెలుగు బ్రాహ్మణ మహాసభ (టీబీఎం) మాజీ అధ్యక్షులు, శర్వాణి సంగీత సభ ట్రస్టీ, ప్రముఖ ఆడిటర్ కల్య రఘుకుమార్ (62) గురువారం ఉదయం అకాల మరణం చెందారు. ఆయన పలు ధార్మిక కార్యక్రమాలు, లోకకల్యాణార్థం హోమాలు, అన్నదానం, విద్యాదానం తదితర సేవలందించి గుర్తింపు పొందారు. బుధవారం రాత్రి తన సతీమణి లక్ష్మీతో కలిసి తేనిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రఘుకుమార్ గురువారం ఉదయం సుమారు 9.గంటల సమయంలో అకాల మరణం పొందినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. గత 15 సంవత్సరాలుగా తెలుగు బ్రాహ్మణ మహాసభకు సేవలందిస్తూ ప్రస్తుతం ఉపాధ్యక్షులుగా ఇటీవల ఎంపికయ్యారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 2.30గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. రఘుకుమార్ మృతిపై ప్రగాఢ సంతాపం తెలిపిన టీబీఎం అధ్యక్షులు గోటేటి వెంకటేశ్వరరావు తదితరులు సంతాపం తెలియచేశారు.
అన్నానగర్: శ్రీపెరుంబత్తూర్ సమీపంలోని తండలం ప్రాంతంలో ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలోని 5వ అంతస్తు నుంచి దూకి 19 ఏళ్ల కళాశాల విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. చైన్నె పూందమల్లికి చెందిన విద్యార్థిని షెరిన్ (19), తండలంలోని ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏఐఎంఎల్ రెండవ సంవత్సరం చదువుతోంది. ఆమె తండ్రి సింగపూర్‌లో పనిచేస్తుండగా, ఆమె తల్లి ప్రొఫెసర్ గా ఉన్నారు. ఇదిలా ఉండగా, గత కొన్ని నెలలుగా షెరిన్ ఒక యువకుడితో ప్రేమలో పడిందని, ఈ కారణంగా ఆమె తల్లి ఆమెను మందలించడంతో, తల్లిదండ్రులతో విభేదాలు తలెత్తాయని తెలుస్తుంది. దీంతో షెరిన్ తీవ్రమైన మనస్తాపం తో బాధపడుతోంది అని తెలుస్తుంది.ఈ స్థితిలో, బుధవారం సాయంత్రం, ఆకస్మిక తీవ్ర మానసిక ఒత్తిడి కారణంగా షెరిన్ కళాశాల ఐదో అంతస్తు నుంచి కిందకి దూకి తీవ్రంగా గాయపడింది. ఆమెను తోటి విద్యార్థులు, కళాశాల సిబ్బంది రక్షించి, చికిత్స కోసం అక్కడి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ ఇంటెన్సివ్ చికిత్స పొందుతూ షెరిన్ రాత్రి మృతి చెందింది. ఈ ఘటన పై శ్రీపెరుంబత్తూర్ పోలీసులు కేసు నమోదు చేసి, కళాశాల విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాల పై తీవ్రంగ దర్యాప్తు చేస్తున్నారు.
సాక్షి, చైన్నె: సౌందర్య వైద్యరంగంలో కల్పిత ప్రచారాలకు స్వస్తి పలికి, పక్కా పరిశోధనలు, క్లినికల్ ఆధారాలు కలిగిన అత్యాధునిక సాంకేతికతను అందించే దిశగా చైన్నెలోని హాలోస్ క్లినిక్ కీలక అడుగు వేసింది. ఇటలీకి చెందిన ప్రముఖ మెడికల్ టెక్నా లజీ సంస్థ డెకా రూపొందించిన అత్యాధునిక ఓన్డా..ప్రో ప్లాట్‌ఫామ్‌ను క్లినిక్ వ్యవస్థాపకులు, ప్రముఖ కాస్మోటాలజిస్ట్ డాక్టర్ ప్రశాంతి జి. చైన్నెలో ఆవిష్కరించారు. డెకా పేటెంట్ పొందిన కూల్‌వేవ్స్ మైక్రోవేవ్ సాంకేతికత ద్వారా పనిచేసే ఈ పరికరం శరీరం, ముఖంపై పేరుకుపోయిన కొవ్వును కరిగించడం, చర్మం కింద ఉండే కొవ్వు గడ్డల వల్ల ఏర్పడే సెల్యులైట్ రూపురేఖలను మెరుగుపరచడం, చర్మ బిగుతును పెంచడం వంటి చికిత్సలను శస్త్రచికిత్స లేకుండానే అందిస్తుందని వివరించారు. మైక్రోవేవ్ శక్తిని నేరుగా కొవ్వు కణజాలం పైకే ప్రయోగిస్తూ, చర్మం ఉపరితలానికి ఎలాంటి హానీ కలగకుండా కూలింగ్ వ్యవస్థ ద్వారా రక్షణ కల్పిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇటలీ డెకా ఇంటర్నేషనల్ హెడ్ ఫ్రాన్సిస్కో బాడీ , జియో మెడిక్స్ ఫార్మా డైరెక్టర్ నీహార్ గాంధీ తదితరులు పాల్గొన్నారు.


