– తిరిగి పాఠశాలలో చేర్పించిన సింగప్పెన్
సాక్షి, చైన్నె : శాంతి భద్రతల పర్యవేక్షణలోనే కాదు చెంగల్పట్టు పోలీస్ స్టేషన్ పరిధిలోని బి.వి.కళత్తూర్ గ్రామంలో ఉన్న గిరిజన నివాస ప్రాంతానికి చెందిన పలువురు చిన్నారులు నిరంతరం బడికి వెళ్లకుండా మానేస్తున్నారనే విషయం పోలీసుల దృష్టికి వచ్చింది. ఈ క్రమంలో సబ్‌ఇన్‌స్పెక్టర్ దేవిక నేతృత్వంలోని సింగప్పెన్ పోలీసులు, స్థానిక ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడితో కలిసి ఆ గిరిజన ప్రాంతాలను అక్కడ బడికి దూరంగా ఉంటున్న ఏడుగురు పిల్లలను గుర్తించారు. అనంతరం ఆ చిన్నారుల తల్లిదండ్రులతో మాట్లాడిన మహిళా పోలీసులు.. చదువు ప్రాముఖ్యతను వివరించారు. బడికి వెళ్లకుంటే పిల్లల భవిష్యత్తు, ఉద్యోగ అవకాశాలు ఎలా దెబ్బతింటాయో కౌన్సెలింగ్ ఇచ్చారు. పోలీసుల సూచనలతో అవగాహన పొందిన తల్లిదండ్రులు, తమ పిల్లలను తిరిగి పాఠశాలకు పంపేందుకు అంగీకరించారు. దీంతో ఆ ఏడుగురు పిల్లలను వెంటనే సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో మళ్లీ చేర్పించేందుకు చర్యలు తీసుకున్నారు. బడి మానేసిన పిల్లలను గుర్తించి, వారిని తిరిగి విద్యావ్యవస్థలోకి తీసుకొచ్చేందుకు పోలీసులు తీసుకున్న ఈ చొరవను, పిల్లల భవిష్యత్తుకు బాటలు వేసే మంచి ప్రయత్నంగా పలువురు అభినందిస్తున్నారు.
జీవన్ రక్షా అవార్డు కోసం దరఖాస్తుల ఆహ్వానం
కొరుక్కుపేట:జీవన్ రక్షా అవార్డు కోసం దరఖాస్తులు చేసుకోవాలని కాంచీపురం కలెక్టర్ స్నేహ ఒక ప్రకటనలో తెలిపారు. భారత ప్రభుత్వం తరపున, నీటిలో మునిగిపోవడం, విద్యుత్ ప్రమాదాలు, అగ్నిప్రమాదాలు, కొండచరియలు విరిగిపడటం, జంతువుల దాడులు , గనుల సహాయక చర్యల వంటి సందర్భాలలో మానవ ప్రాణాలను కాపాడిన వారికి ఈ క్రింది కేటగిరీలలో జీవన్ రక్షా పురస్కారం ఇస్తున్నారు. ఈక్రమంలో, సర్వోత్తమ్ జీవన్ రక్షా పతకం – అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులలో ధైర్యంగా పోరాడి వారిని రక్షించే వారికి ఈ పురస్కారం ప్రదానం చేస్తారు. ఉత్తమ్ జీవన్ పతకం – అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులలో ధైర్యంగా, ఆలస్యం చేయకుండా వ్యవహరించి, పోరాడి వారిని రక్షించే వారికి, జీవన్ రక్షా పతకం – గాయపడినప్పటికీ, ప్రాణాలను కాపాడటానికి ధైర్యంగా, ఆలస్యం చేయకుండా పోరాడే వారికి ఈ పురస్కారం అందజేస్తారు. 2026 సంవత్సరానికి గాను జీవన్ రక్షా అవార్డు కోసం దరఖాస్తులను కేవలం httpr://awardr.gov.in వెబ్‌సైట్ ద్వారా మాత్రమే చేసుకోవాలి. కాంచీపురం జిల్లాలో విశేష విజయాలు సాధించిన వారు జీవన్ రక్షా అవార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలని, మరిన్ని వివరాల కోసం 74017 03481 నంబరును సంప్రదించాలని జిల్లా క్రీడలు, యువజన సంక్షేమ అధికారి కోరారు.
రూ.33 లక్షల హౌసింగ్ బోర్డు టెండర్ వివాదం
సాక్షి, చైన్నె: తమిళనాడు హౌసింగ్ బోర్డుకు చెందిన రూ.33 లక్షల విలువైన టెండర్‌ను ఒక నిర్దిష్ట సంస్థకే కట్టబెట్టేందుకు ప్రయత్నించిన అధికారులపై ముఖ్యమంత్రి విజయ్ ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు బదిలీ వేటు వేశారు. తమిళనాడు హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో చైన్నె అశోక్ నగర్‌లో నిర్మిస్తున్న 22 అంతస్తుల హైరైజ్ అపార్ట్‌మెంట్లలోని ఇళ్ల ముందు నేమ్ బోర్డులు ఏర్పాటు చేసేందుకు ఆగస్టు 15న రూ. 33 లక్షల విలువైన టెండర్ పిలిచారు. అయితే, ఈ టెండర్ సమర్పించడానికి కేవలం 5 రోజుల వ్యవధి మాత్రమే ఇచ్చారు. సమయం తక్కువగా ఉందంటూ పలువురు కాంట్రాక్టర్లు అదనపు సమయం కోరినప్పటికీ అధికారులు నిరాకరించారు. బాధ్యతాయుతమైన అధికారిని కాంట్రాక్టర్లు ప్రశ్నించగా... ‘నిర్దిష్ట కాంట్రాక్ట్ సంస్థలు మాత్రమే దీనికి దరఖాస్తు చేయగలవు అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. దీనికి సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వ్యవహారం పెద్ద వివాదాస్పదం కావడంతో, పరిపాలనా కారణాల రీత్యా ఈ నేమ్ బోర్డుల టెండర్‌ను రద్దు చేస్తున్నట్లు హౌసింగ్ బోర్డు ప్రకటించింది. అనంతరం, దీనికి బాధ్యులైన సూపరింటెండింగ్ ఇంజినీర్, చీఫ్ ఇంజనీర్‌లపై హౌసింగ్ బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ విచారణ జరిపారు. అధికారులు కావాలనే సెట్టింగ్ టెండర్ వేసి ఒకే కంపెనీకి అనుకూలంగా వ్యవహరించారని విచారణలో నిరూపితమైంది. దీంతో వీరిపై సీఎం విజయ్ కన్నెర్ర చేశారు. ఆయన ఆదేశాల మేరకు సంబంధిత అధికారులను తక్షణమే వేరే స్థానాలకు బదిలీ చేయడం విశేషం.


