సాక్షి, చైన్నె: శ్రావణ, ఆషాఢ మాసాల ముగింపు అనంతరం, తమిళ ఆవణి (ఆగస్టు–సెప్టెంబర్) మాసం ప్రారంభంలో మొదటి శుభ ముహూర్తం రోజు కావడంతో ఆదివారం ఆలయాలలో పెళ్లి సందడి నెలకొంది. ముహూర్తం, ఆదివారం కూడా కలిసిరావడంతో తమిళనాడులోని ప్రముఖ మురుగన్ ఆలయాలన్నీ పెళ్లిళ్లతో కళకళలాడాయి. వివిధ ఆలయాల్లో కలిపి సుమారు మూడు వందలకు పైగా జంటలు వివాహ బంధంతో ఒకటయ్యారు.నవదంపతులు, బంధుమిత్రులు,సెలవు దినం కావడంతో స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణాలు కిక్కిరిసిపోయాయి.
వివిధ ఆలయాల్లో పెళ్లిళ్ల జోరు
తిరుపోరూర్ సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో 75 వివాహాలు జరిగాయి. ఆలయం చుట్టుపక్కల ఉన్న 15కి పైగా కల్యాణ మంటపాల్లో కూడా మరెన్నో పెళ్లిళ్లు జరిగాయి. దీంతో భక్తులు లోపలికి వెళ్లలేక, బయటకు రాలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అలాగే కుండ్రత్తూర్ మురుగన్ ఆలయం ఒకే రోజు 60కి పైగా వివాహాలు జరిగాయి. ఆలయ యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేయకపోవడం, పార్కింగ్ సమస్యల వల్ల నూతన వధూవరులు వాహనాల్లోనే గంటల తరబడి చిక్కుకుపోయారు.వడపళని మురుగన్ ఆలయంలో 100 అడుగుల రహదారి భక్తులు, వాహనాలతో పూర్తిగా నిండిపోయింది. ఇక్కడ సైతం పదుల సంఖ్యలో జంటలకు వివాహాలు జరిగాయి. అలాగే, ముహూర్తం రోజు కావడంతో అనేక శుభకార్యాలే కాదు, గృహ ప్రవేశాలు, కొత్త పనులుమొదలెట్టడం వంటికార్యక్రమాలు మరెన్నో హోరెత్తాయి. దిండుగల్‌జిల్లా పళణిలోని వరదరాజ పెరుమాల్ ఆలయంలో ఆవణి బ్రహ్మోత్సవాలకు సైతం శ్రీకారం చుట్టారు. ఆలయంలో ధ్వజారోహనం ఘనంగా జరిగాయి. వడలూరు వల్లలార్ సత్య జ్ఞాన సభలో కొత్త ధ్వజ స్తంభాన్ని సైతం ప్రతిష్టించారు.


