సాక్షి, చైన్నె: వాతావరణ మార్పుల కారణంగా ఆదివారం వేకువ జామున సుమారు 3.30 గంటలకు వాయువ్య బంగాళాఖాతం , దాని పరిసర ప్రాంతాలలో కొత్త అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ–వాయువ్య దిశగా పయనిస్తూ, రాబోయే 24 నుండి 48 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది.
వర్ష సూచన – ప్రభావిత జిల్లాలు
ఈ అల్పపీడన ప్రభావంతో తమిళనాడు తీర ప్రాంతాలు, లోతట్టు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉంది. మోస్తరు వర్షాలు చైన్నె, తిరువళ్లూరు, చెంగల్పట్టు, కాంచీపురం, కడలూరు, నాగపట్టణం జిల్లాల్లో కురిసే అవకాశం ఉంది. తంజావూరు, తిరువారూరు, పుదుచ్చేరి, తిరువణ్ణామలై, తూత్తుకుడి, అలాగే పశ్చిమ కనుమల ప్రాంతాలైన నీలగిరి, కోయంబత్తూరు, తేని, దిండిగల్ జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటికే లోతైన సముద్రంలో ఉన్న మత్స్యకారులు తక్షణమే ఒడ్డుకు తిరిగి రావాలని కోరారు. ప్రాంతీయ తుఫాను హెచ్చరిక కేంద్రం డైరెక్టర్ వి.ఆర్. దురై మాట్లాడుతూ.. ఈ అల్పపీడనం ఉత్తర ఒడిశా వైపు కదిలే అవకాశం ఉన్నప్పటికీ, దీని ప్రభావంతో ఉత్తర కోస్తా తమిళనాడులో నైరుతి రుతుపవనాలు పుంజుకుని వర్షాలు పెరుగుతాయని వెల్లడించారు.
వర్షపాత లోటు..
జూన్ 1 నుంచి ఇప్పటివరకు చైన్నెలో సాధారణం కంటే 8% తక్కువ వర్షపాతం నమోదైంది. అలాగే తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మీద 17% వర్షపాత లోటు ఉంది. రానున్న బుధవారం నుంచి విస్తారంగా మంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.


