పొరుగు రాష్ట్రాలతో.. | - | Sakshi
Sakshi News home page

పొరుగు రాష్ట్రాలతో..

Aug 21 2026 2:57 AM | Updated on Aug 21 2026 2:57 AM

దక్షిణ రాష్ట్రాల సీఎంల సదస్సులో పలు అంశాల ప్రస్తావన

కావేరి వ్యవహారంలో సుప్రీం తీర్పును గౌరవించాలని విజ్ఞప్తి

సాక్షి, చైన్నె: కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అధ్యక్షతన 31వ దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశం కోవళంలో గురువారం జరిగింది. ఈ దక్షిణ మండలిలో ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలతో పాటూ పుదుచ్చేరి, అండమాన్‌ – నికోబార్‌ దీవులు, లక్షద్వీప్‌ కేంద్రపాలిత ప్రాంతాలు సభ్యులుగా ఉన్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఈ మండలికి అధ్యక్షుడిగా ఉండగా, తమిళనాడు సీఎం విజయ్‌ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు నాయుడు, కర్ణాటక సీఎం డి.కె.శివకుమార్‌, కేరళ సీఎం వి.డి.సతీశన్‌, తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కల మల్లుతో పాటు ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.

సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థ(బ్లూ ఎకానమీ)

ఇందులో సీఎం విజయ్‌ మాట్లాడుతూ దక్షిణ రాష్ట్రాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ బ్లూ ఎకానమీ పెంపొందించేందుకు పొరుగు రాష్ట్రాలతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఉమ్మడి భాగస్వామ్యం ద్వారా ఓడరేవులు, సరుకు రవాణా (లాజిస్టిక్స్‌), మత్స్య రంగం, కోస్టల్‌ టూరిజం గణనీయంగా అభివృద్ధి చెందుతాయన్నారు. 1,076 కిలోమీటర్ల మేర ఉన్న సముద్ర తీర రవాణా , పర్యాటకరంగాన్ని విస్తరించేందుకు పొరుగు రాష్ట్రాలకు సహకరిస్తామన్నారు.

మత్తు పదార్థాల నిర్మూలన–నిఘా సమాచారం

డ్రగ్స్‌ రహిత సమాజం కోసం దక్షిణ రాష్ట్రాలు ఏకతాటిపైకి రావాలని, ఆన్‌లైన్‌లో మత్తు పదార్థాల విక్రయాలను అరికట్టేందుకు చట్టాలను కఠినతరం చేయాలని సూచించారు. అంతర్‌ రాష్ట్ర నిఘా (ఇంటెలిజెన్స్‌) సమాచారాన్ని పరస్పరం పంచుకోవడం ద్వారా దక్షిణ రాష్ట్రాలు సమన్వయంతో పనిచేయాలని కోరారు.

నదీ జలాల వివాదాలు

కావేరి నదీ జలాల వ్యవహారంలో సుప్రీంకోర్టు , కావేరి నిర్వహణ అథారిటీ ఇచ్చే ఉత్తర్వులను అన్ని రాష్ట్రాలు గౌరవించాలని, దిగువన ఉండే రాష్ట్రాల చట్టబద్ధమైన హక్కులు, ప్రజల జీవనోపాధి దెబ్బతినకుండా చూడాలని, అలాగే, న్యాయస్థానాల ఆదేశాల ప్రకారం ముల్లైపెరియార్‌ డ్యామ్‌ నీటిమట్టాన్ని 152 అడుగులకు పెంచేందుకు అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, పరస్పర నమ్మకం, శాసీ్త్రయ ఆధారాలు, చట్టం పట్ల గౌరవంతో నదీ జలాల సమస్యలను పరిష్కరించుకోవాలని ఈ సమావేశం దృష్టికి తీసుకొచ్చారు.

కృష్ణా నదీ జలాల వివాదం

కృష్ణా నదీ జలాల వినియోగంపై ఆంధ్రప్రదేశ్‌ నుండి వ్యతిరేకత ఉండటం వల్ల కర్ణాటక తమకు కేటాయించిన నీటిని పూర్తిగా వినియోగించుకోలేకపోతోందని, దీనిపై సుప్రీంకోర్టులో న్యాయపోరాటం కొనసాగుతోందని పేర్కొన్నారు. పొరుగు రాష్ట్రాల హక్కులను కర్ణాటక ఎల్లప్పుడూ గౌరవిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

సాతనూర్‌ డ్యామ్‌ నుంచి ద్వారా తాగునీరు

దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశంలో పుదుచ్చేరి ఎల్జీ కై లాసనాథన్‌మాట్లాడుతూ, తమ రాష్ట్రంలో తీవ్రమవుతున్న నీటి కొరతను అధిగమించడానికి సాతనూర్‌ డ్యామ్‌ నుండి పుదుచ్చేరి వరకు ఒక ప్రత్యేక తాగునీటి పైప్‌లైన్‌ నిర్మించేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు.

గోదావరి – పెన్నయార్‌ అనుసంధానం

ప్రతిపాదిత గోదావరి అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా శంకర భరణి, తెన్‌ పెన్నయార్‌ నదులను అనుసంధానించాలని, మొదటి దశలో తాగునీరు, సాగునీటి అవసరాల కోసం పుదుచ్చేరికి 5.55టీఎంసీల నీటిని కేటాయించాలని జాతీయ జల అభివృద్ధి సంస్థ కోరారు. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలు చూపుతున్న మద్దతు, అవగాహన నిజమైన సహకార సమాఖ్యవాదానికి నిదర్శనం అని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కై లాసనాథన్‌ కొనియాడారు.

పొరుగు రాష్ట్రాలతో కలిసి పని చేసేందుకు తన ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం విజయ్‌ స్పష్టం చేశారు. దక్షిణ రాష్ట్రాల సీఎంల సదస్సులో ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. ప్రధానంగా కావేరి నదీ జలాల వివాదంలో సుప్రీంకోర్టు తీర్పును గౌరవించాలని, ముల్లైపెరియార్‌ డ్యామ్‌ నీటిమట్టాన్ని 152 అడుగులకు పెంచాలని, నీట్‌ పరీక్ష నుంచి తమిళనాడుకు మినహాయింపు ఇవ్వాలని కోరారు.

నీట్‌ మినహాయింపు

ప్లస్‌ –2 మార్కుల ఆధారంగానే వైద్య విద్యార్థుల అడ్మిషన్లు చేపట్టేలా అనుమతించాలని కోరారు. నీట్‌ ప్రవేశ పరీక్ష వల్ల గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. కాబట్టి తమిళనాడుకు నీట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పునర్విభజన ప్రక్రియ వల్ల ఏ ఒక్క దక్షిణ రాష్ట్రం కూడా నష్టపోకూడదని, దీనివల్ల పార్లమెంటులో ఏ రాష్ట్ర ప్రాతినిధ్యం తగ్గదని కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధమైన హామీ ఇవ్వాలని కోరారు.

ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ – ఆర్థిక అంశాలు

దక్షిణ రాష్ట్రాల్లో ఉమ్మడి పారిశ్రామిక పార్కులను (కో–ఆపరేటివ్‌ ఇండస్ట్రియల్‌ పార్కులు ) ఏర్పాటు చేయాలని, కర్ణాటకలోని బొమ్మసంద్ర నుంచి తమిళనాడులోని హోసూరు వరకు మెట్రో రైలును విస్తరించే ప్రాజెక్ట్‌ అద్భుతమైన మౌలిక సదుపాయంగా మారుతుందని సూచించారు. దేశ ఆర్థిక వ్యవస్థలో దక్షిణ రాష్ట్రాలు 30 శాతం భాగస్వామ్యాన్ని అందిస్తున్న దృష్ట్యా, దక్షిణ రాష్ట్రాల పనితీరు, అభివృద్ధి, పెట్టుబడులను పరిగణనలోకి తీసుకుని సరసమైన రీతిలో కేంద్ర నిధుల పంపిణీ జరగాలన్నారు. అలాగే జీఎస్‌టీ పరిమితులను నిర్ణయించే సడలింపులను, హక్కులను రాష్ట్రాలు మళ్లీ పొందాలని కోరారు. కాగా, ఈసమావేశంలో సీఎం విజయ్‌, కర్ణాటక సీఎం శివకుమార్‌లు పక్క పక్కనే కూర్చుని మాట్లాడుకుంటూ ఉండటం ప్రాధాన్యతకు దారి తీసింది. కావేరి, మేఘదాతు వ్యవహారం గురించి చర్చించి ఉండ వచ్చు అన్న సంకేతాలు వెలువడ్డాయి. ఈ సమావేశానికి వెళ్తూ కానత్తూరు వద్ద సీఎం విజయ్‌ కాన్వాయ్‌ నుంచి దిగి కొంత దూరం నడుచుకుంటూ ప్రజలకు అ భివాదం తెలియజేశారు. ఇక, ఈ సమావేశానికి పుదుచ్చేరి సీఎం రంగస్వామి హాజరు కాలేదు. ఆ రాష్ట్ర లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కై లాశ్‌ నాథన్‌ హాజరయ్యారు. ఇదిలా ఉండగా ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు నదుల అనుసంధానం గురించి ప్రస్తావిస్తూ, కావేరి, గోదావరి అనుసంధానంతో తమిళనాడుకు నీరు సంవృద్ధిగా దక్కుతుందని సూచించడంతో పాటుగా కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ అమరావతిలను కలుపుతూ బుల్లెట్‌ రైలు సేవకు విజ్ఞప్తి చేసినట్టు సమాచారాలు వెలువడ్డాయి.

మేఘదాతుతో ప్రయోజనం..

కావేరీ నదీ జలాల వివాదానికి శాశ్వత పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉందని, మేఘదాతు ఆనకట్ట నిర్మాణం ద్వారా తమిళనాడు, కర్ణాటక రెండు రాష్ట్రాలకూ ఎంతో ప్రయోజనం చేకూరుతుందని కర్ణాటక సీఎం డి.కె. శివకుమార్‌ పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మేఘదాతు లో డ్యామ్‌ నిర్మాణం వల్ల వర్షభావ సమయంలో అదనపు నీరు వృథాగా సముద్రంలో కలవకుండా ఆదా అవుతుందని, ఇది దీర్ఘకాలంలో తమిళనాడు, పుదు చ్చేరి ప్రజల సాగు, తాగునీటి అవసరాలకు సహాయపడుతుందని తెలిపారు. ‘మీరు మాకు సహాయం చేయండి, మేము మీకు సహాయం చేస్తాం. తమిళనా డు, కర్ణాటక రాష్ట్రాలు కలసి చర్చల ద్వారా కావేరీ సమస్యకు పరిష్కారం కనుగొనాలి’’ అని ఆయన పిలుపునిచ్చారు. నదీ జలాల పంపిణీ అనేది రాష్ట్రాల ను విభజించేదిగా కాకుండా, రాష్ట్రాలను ఏకం చేసే సహకార వనరుగా మారాలని అభిప్రాయపడ్డారు.

సీఎం విజయ్‌ స్పష్టీకరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement