సాక్షి,చైన్నె: జీడబ్ల్యూసీ డేటా ఏఐ ఆధ్వర్యంలో తమిళనాడులో తొలిసారిగా ఆంత్రోపిక్ క్లౌడ్ ఇన్నోవేషన్ ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. హోసూరులోని జి డబ్ల్యూ సి డేటా ఏఐ ప్రాంగణంలో ఏర్పాటైన ఈ ల్యాబ్‌ను మాజీ ఇస్రో ఛైర్మెన్ , తమిళనాడు ప్రభుత్వ స్కూల్ కరికుళం డిజైన్ కమిటీ ఛైర్మెన్ డాక్టర్ మైల్ స్వామి అన్నాదురై , ఆంత్రోఫిక్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ఇరినా ఘోష్ ల చేతులమీదుగా ఘనంగా ప్రారంభించారు . రాష్ట్రంలో ఈ తరహా ప్రత్యేక కేంద్రం ఇదే మొట్టమొదటి కావటం విశేషం. క్లాడ్ ఇన్నోవేషన్ ల్యాబ్, ఆంత్రోపిక్ క్లాడ్ నమూనాల ఆధారంగా, సేవా ఆటోమేషన్, ఇంటెలిజెన్స్ , వర్క్‌ఫ్లో ఆధునీకరణ వంటి రంగాలలో ఏజెంటిక్ ఏఐ పరిష్కారాలను ప్రోటో టైప్ చేయడానికి, నిర్మించడానికి, అమలు చేయడానికి సంస్థలకు , ప్రభుత్వ విభాగాలకు ఒక పని వాతావరణాన్ని అందిస్తుందని నిర్వాహకులు వెల్లడించారు. ఈ ల్యాబ్, ఆంత్రోపిక్ క్లాడ్‌ను ఒక సాధనంగా ఉపయోగించి, సాధికారతను, సహ–ఆవిష్కరణను ఒకే సదుపాయంలోకి తీసుకువస్తుందని ,వివిధ రంగాలలోని వినియోగదారులకు క్లాడ్‌ను ఉపయోగించి పరిష్కారాలను అందిస్తాయని జీడబ్ల్యూసీ డేటా ఏఐ వ్యవస్థాపక సీఈవో నవీన్ కుమార్ తెలిపారు.


