● స్పీకర్ ప్రభాకర్‌తో పళణి వాగ్వాదం
పేలిన బాణసంచాలు
అసెంబ్లీలో మంత్రి కీర్తన , మాజీ మంత్రి తంగం తెన్నరసు మధ్య వాడివేడి శివకాశిలోని బాణాసంచా తయారీ కర్మాగారాల్లో నిర్వహించిన ఆకస్మిక తనిఖీలు, దానివల్ల ఉత్పత్తిపై పడిన ప్రభావంపై తీవ్ర వివాదం జరిగింది. సభలో మంత్రి కీర్తన మాట్లాడుతూ..టీవీకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శివకాశిలో కొన్ని ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం సంభవించిందన్నారు. ఆ సమయంలో ప్రతిపక్షాల నుంచి ఎవ్వరూ క్షేత్రస్థాయికి రాలేదని, అయితే, సీఎం విజయ్ స్వయంగా బాధితులకు సహాయం అందిస్తూ అండగా నిలిచారన్నారు. అనంతరం నిబంధనల ఉల్లంఘనలు ఏవైనా ఉన్నాయా అని తెలుసుకోవడానికి 177 ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించామని, లోపాలను సరిదిద్దిన తర్వాత ఆ తనిఖీలను కూడా నిలిపివేశామన్నారు. సమస్యలన్నీ సమసిపోయి ప్రజలు సాధారణ జీవితానికి చేరుకున్న తర్వాత కూడా డీఎంకే ఉద్దేశపూర్వకంగా నిరసన ప్రదర్శనలు చేస్తున్నదని ఆరోపించారు. ఇందుకు మాజీ మంత్రి తంగం తెన్నరసు సమాధానం ఇస్తూ, ‘శివకాశిలో నిబంధనలకు కట్టుబడి నడుస్తున్న బాణాసంచా పరిశ్రమలపై కూడా అధికారులు తనిఖీల పేరిట ఆంక్షలు విధిస్తూ, సీళ్లు వేస్తుండటంతో ఉత్పత్తి దారుణంగా దెబ్బతిందన్నారు. శివకాశి బాణాసంచా కార్మి కులు సంతోష సముద్రంలో ఈదుతున్నట్లు ఒక భ్రమను కల్పిస్తున్నారన్నారు. ఇది కేవలం వ్యాపారమే కాకుండా ఈ రంగాన్నే నమ్ముకున్న లక్షలాది మంది కార్మికుల జీవనోపాధికి సంబంధించిన అంశం కాబట్టే తాను సభ దృష్టికి తీసుకువచ్చానని తెలిపారు.
సాక్షి, చైన్నె : శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వ, ప్రతిపక్ష నాయకులు ఒకరిపైఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. రేషన్ బియ్యం పొందే ప్రజలు దానిని మేకలు, కోళ్ల మేతగా మాత్రమే ఉపయోగిస్తున్నారని మంత్రి సెంగోట్టయ్యన్ చేసిన వ్యాఖ్యలు అసెంబ్లీలో తీవ్ర వివాదానికి దారితీశాయి. పేదలు తినే ఆహారాన్ని ఈ విధంగా చులకన చేసి మాట్లాడతారా అంటూ డీఎంకే నాయకులు ఇ.వి.వేలు, కే.ఎన్.నెహ్రూ తదితరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో మంత్రి సెంగోట్టయ్యన్ మాట్లాడుతూ.. ‘రేషన్ షాపుల్లో బియ్యం తీసుకునే వారంతా దానిని మేకలు, కోళ్లకు మేతగానే వాడుతున్నారనేది దేశమంతటికీ తెలిసిన నిజం’ అని పేర్కొన్నారు. ఇందుకు మాజీ మంత్రి కే.ఎన్.నెహ్రూ సమాధానం ఇస్తూ, మంత్రి ఏ కోణంలో ఈ వ్యాఖ్యలు చేశారో అర్థం కావడం లేదని, ప్రస్తుతం ప్రజలందరూ రేషన్ బియ్యాన్ని క్రమం తప్పకుండా వినియోగిస్తున్నారని బదులిచ్చారు. అదే సమయంలో మాజీ మంత్రి ఇ.వి.వేలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ డీఎంకే హయాంలో అమలైన రేషన్ బియ్యం పథకాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తులే ప్రశంసించార ని గుర్తు చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సెంగోట్టయ్యన్ ఈ బియ్యం గురించి మాట్లాడలేదా? సభానాయకుడిగా ఉండి సభను సజావుగా నడపాల్సిన వారే ఇలా వివాదాలు సృష్టిస్తే ఎలా? పేద ప్రజలు ఆకలి తీర్చుకునే రేషన్ బియ్యాన్ని మేకలు, ఆవులు తింటున్నాయని చులకన చేసి మాట్లాడటం తగదని నిలదీశారు. అదే సమయంలో మాజీ మంత్రి ఎం.ఆర్.కే. పన్నీర్ సెల్వం సభలో సరదాగా వ్యాఖ్యానిస్తూ.. ‘‘మాజీ మంత్రి కే.ఎన్. నెహ్రూ కూడా తన షుగర్ లెవల్స్ అదుపులో ఉండేందుకు రేషన్ బియ్యాన్ని వండుకుని తింటున్నారు’ అని తెలిపారు. ఇందుకు ఆహార శాఖ మంత్రి వెంకటరమణన్ స్పందిస్తూ.. గతం సంగతి ఎలా ఉన్నా, ఇకపై ప్రజలు నేరుగా వాడుకునేలా నాణ్యమైన బియ్యాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. మరో మంత్రి ఆధవ్ అర్జునా మాట్లాడుతూ.. ‘తమ కుటుంబం కూడా రేషన్ షాపు బియ్యం తిని పెరిగిన కుటుంబమేనని, అయితే, ఇప్పుడు చాలామంది దీనిని నేరుగా తినకుండా ఇడ్లీ పిండికి వాడుతున్నారన్నారు. రేషన్ దుకాణాల్లో అందరూ తినేలా సన్న రకం బియ్యం పంపిణీ చేయాలని సీఎం విజయ్ ప్రయత్నాలు చేస్తున్నారని, అందుకోసమే సన్న రకం వరి సాగును పెంచేందుకు రైతులకు అధిక ప్రోత్సాహకాలను ప్రకటించారన్నారు.
స్పీకర్ వర్సెస్ పళణి
సౌదీ అరేబియాలో దాడికి గురైన తమిళనాడు మత్స్యకారులు , ఆంధ్రప్రదేశ్‌లో సీజన్ బోట్ల వ్యవహారంపై అసెంబ్లీ రూల్ 55 కింద కాల్ ఫర్ అటెన్షన్ తీర్మానాన్ని ఆమోదించాలని అన్నాడీఎంకే శాసన సభా పక్షత నేత ఎడప్పాడి కె. పళనిస్వామి డిమాండ్ చేయడంతో సభలో తీవ్ర నిరసనలు, చర్చలు చోటుచేసుకున్నాయి. మైలాడుతురై జిల్లా, తొడువాయి గ్రామానికి చెందిన నలుగురు మత్స్యకారులు సౌదీ అరేబియాలో చేపల వేటలో ఉండగా ఇరాన్ సముద్రపు దొంగలు దాడి చేశారన్నారు. ఈ ఘటనలో 32 ఏళ్ల మావీరన్ అనే జాలరి అక్కడికక్కడే మరణించగా, మరో ముగ్గురు తీవ్ర గాయాలతో సౌదీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని గుర్తు చేశారు. అలాగే, చైన్నె కాశిమేడుకు చెందిన తమిళ జాలర్లను, వారి బోట్లను ఆంధ్రప్రదేశ్ అధికారులు సరిహద్దు జలాల్లో అరెస్ట్ చేసి సీజ్ చేశారని, వారి సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ సమయంలో స్పీకర్ జేసీడీ ప్రభాకర్ జోక్యంచేసుకుని ప్రతిపక్ష నేత ఇచ్చిన నోటీసుపై ప్రభుత్వం నుంచి సరైన సమాచారం లేదా మంత్రి సమాధానం సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే దానిపై విస్తృత చర్చకు అనుమతిస్తామని తెలిపారు. దీంతో ఇద్దరిమధ్య కాసేపు వాగ్వివాదం నడిచింది. చివరకు మంత్రి శ్రీనాథ్ స్పందిస్తూ, ఆంధ్రప్రదేశ్ అధికారులతో చర్చించి పడవలను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు, సౌదీలో మృతి చెందిన జాలరి మృత దేహాన్ని స్వస్థలానికి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టామన్నారు.
ఆ ఉత్తర్వులలో ఎటువంటి దురుద్దేశం లేదు
‘‘ఆందోళనలు, నిరసనలు తెలిపే విద్యార్థులకు సంబంధించి ఉన్నత విద్యాశాఖ జారీ చేసిన ఉత్తర్వులలో ఎలాంటి దురుద్దేశం లేదు. విద్యార్థులు, యువత హక్కులను అణచివేసే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఎంతమాత్రం లేదు‘’ అని తమిళనాడు ఉన్నత విద్యాశాఖ మంత్రి విశ్వనాథన్ అసెంబ్లీలో స్పష్టం చేశారు. సీపీఐ సభ్యుడు మారీముత్తు సభలో తీసుకొచ్చిన తీర్మానం మేరకు ‘‘మనం స్వతంత్ర భారతదేశంలో జీవిస్తున్నాం, ఇక్కడ అందరికీ ప్రాథమిక హక్కులు ఉన్నాయి. హక్కుల కోసం పోరాడే విద్యార్థులు, ముఖ్యంగా వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులను గుర్తించి, వారిపై తీసుకున్న చర్యల వివరాలు పంపాలని ఉన్నత విద్యాశాఖ డైరెక్టర్ ఒక ఉత్తర్వులు పంపారు. స్వతంత్ర దేశంలో హక్కుల కోసం పోరాడే విద్యార్థులపై చట్టవిరుద్ధంగా వ్యవహరించడం సమంజసమేనా?’’ అని నిలదీశారు .ఇందుకు ఉన్నత విద్యాశాఖ మంత్రి విశ్వనాథన్ సమాధానం ఇస్తూ, విద్యార్థుల ఆందోళనలకు సంబంధించి తీసుకుంటున్న చర్యలను వెంటనే సీఎం దృష్టికి తీసుకెళ్లాం. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో జరిగే నిరసనల నేపథ్యంలో శాంతిభద్రతలు, క్రమశిక్షణను కాపాడవలసిన అవసరం వచ్చింది. అందుకోసమే ఆగస్టు 17న ఉన్నత విద్యాశాఖ ద్వారా కళాశాలల డైరెక్టరేట్‌కు లేఖ పంపడం జరిగింది. దాని ఆధారంగా విద్యాసంస్థల్లో తీసుకోవాల్సిన క్రమశిక్షణా చర్యలపై ఆగస్టు 20 నాటికి నివేదిక ఇవ్వాలని కోరాం అని వివరించారు. సీపీఐ ఎమ్మెల్యే తళి రామచంద్రన్ స్పందిస్తూ, ‘‘వామపక్ష విద్యార్థి సంఘాలు నీట్ పరీక్షలకు వ్యతిరేకంగా, పేపర్ లీకేజీలు, ప్రైవేటు కళాశాలల ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా మాత్రమే ప్రజాస్వామ్యయుతంగా పోరాడుతున్నాయి. ప్రత్యేకంగా వామపక్ష సంఘాలను లక్ష్యంగా చేసుకుని ఈ సర్క్యులర్ రావడం కొంత ఆందోళన కలిగించింది. అయితే దీనిపై మంత్రిగారు స్పష్టమైన వివరణ ఇచ్చినందుకు ధన్యవాదాలు’’ అని ఆ వివాదానికి ముగింపు పలికారు.


