మెరీనాకు బ్లూ ఫ్లాగ్‌ దక్కేనా..? | - | Sakshi
Sakshi News home page

మెరీనాకు బ్లూ ఫ్లాగ్‌ దక్కేనా..?

Aug 21 2026 2:57 AM | Updated on Aug 21 2026 2:57 AM

● పెరుగుతున్న అడ్డంకులు ● ఈతకు సరిపడ్డ శుభ్రత కరువు

సాక్షి, చైన్నె : ప్రపంచంలోనే ప్రముఖ పర్యాటక తీరాల్లో ఒకటైన చైన్నె మెరీనా బీచ్‌కు అంతర్జాతీయ పర్యావరణ గుర్తింపు ‘బ్లూ ఫ్లాగ్‌’ సాధించడంలో ప్రతిబంధకాలు కొనసాగుతూనే ఉన్నాయి. బీచ్‌ పరిసరాల్లో మురుగునీరు కలవడం, సముద్ర నీటి నాణ్యత తగ్గడం వంటి సమస్యలే ఇందుకు ప్రధాన కారణమని అధికారులు చెబుతున్నారు.

బ్లూ ఫ్లాగ్‌ ప్రాముఖ్యత – ప్రమాణాలు:

అంతర్జాతీయ స్థాయిలో బీచ్‌ల పరిశుభ్రత, సముద్రపు నీటి నాణ్యత, పర్యావరణ పరిరక్షణ, మురుగునీటి నిర్వహణ మరియు పర్యాటకుల భద్రత వంటి కఠినమైన ప్రమాణాలను పాటించే తీర ప్రాంతాలకే ఈ బ్లూ ఫ్లాగ్‌ గుర్తింపును ప్రదానం చేస్తారు. సముద్రపు నీరు ప్రజలు ఈత కొట్టడానికి, స్నానం చేయడానికి సురక్షితమైన నాణ్యతతో ఉందనడానికి ఈ సర్టిఫికేషన్‌ నిదర్శనం.

మెరీనాలో చేపట్టిన అభివృద్ధి పనులు

మెరీనా తీరంలోని స్విమ్మింగ్‌ పూల్‌ సమీపంలో ఉన్న సుమారు 20 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని బ్లూ ఫ్లాగ్‌ జోన్‌గా అభివృద్ధి చేసేందుకు కార్పొరేషన్‌ ప్రయత్నాలు చేస్తున్నది. ప్రజా మరుగుదొడ్లు, పిల్లల ఆట స్థలాలు, పర్యావరణ విద్యా సౌకర్యాలు మరియు ప్రాథమిక మౌలిక సదుపాయాలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఇక్కడ మెరుగుపరిచారు.

ఎదురవుతున్న సవాళ్లు

మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసినప్పటికీ, తీరప్రాంతంలో సముద్రంలో మురుగునీరు కలవడం అతిపెద్ద పర్యావరణ సమస్యగా మారింది. సముద్ర నీటిలో నాణ్యత లోపించడం వల్ల ప్రజలు ఈత కొట్టేందుకు అది అనుకూలంగా లేదు. బోటింగ్‌, డాకింగ్‌ సౌకర్యాలు , తీరప్రాంత రక్షణ పరంగా సముద్ర పరిస్థితులు సవాలుగా ఉన్నాయని సముద్ర జల వనరుల పరిశోధన అధికారులు తెలిపారు. మెరీనాకు అంతర్జాతీయ బ్లూ ఫ్లాగ్‌ గుర్తింపు లభిస్తే దేశీయ, విదేశీ పర్యాటకుల రాక గణనీయంగా పెరుగుతుంది. అయితే కేవలం మైదాన ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచడం, మరుగుదొడ్లు నిర్మించడమే కాకుండా, సముద్రంలో మురుగునీరు కలవకుండా నిరోధించడం , నీటి నాణ్యతను మెరుగుపరచడం ద్వారానే ఈ గుర్తింపు సాధ్యమవుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement