ఆధునిక తమిళనాడు శిల్పి కరుణానిధి
వాడవాడలా కరుణానిధి వర్ధంతి వేడుకలు
రాష్ట్ర వ్యాప్తంగా డీఎంకే నేతృత్వంలో శాంతి ర్యాలీ
సమాధి వద్దకు తరలిన నేతలు
చైన్నెలో స్టాలిన్ నేతృత్వంలో ర్యాలీ
సాక్షి, చైన్నె : ‘‘ప్రభుత్వానికి చెందిన లెక్కలేనన్ని ఫైళ్లపై సంతకాలు చేసి, తమిళనాడు తలరాతను మార్చిన మహనీయుడు, ఆధునిక తమిళనాడును నిర్మించిన శిల్పి మాజీ ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి’’ అని డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎం.కే.స్టాలిన్ కొనియాడారు. కరుణానిధి వర్థంతిని పురస్కరించుకుని శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. శాంతి ర్యాలీలు నిర్వహించారు. కరుణానిధి చిత్ర పటాలు, విగ్రహాల వద్ద పుష్పాంజలి ఘటించారు. చైన్నెలో మాజీ సీఎం, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ నేతృత్వంలో శాంతి ర్యాలీ చేపట్టారు.
ప్రజల హృదయాల్లో నిలిచిన నేత
ద్రవిడ సిద్ధాంతకర్త పెరియార్‌కు శిష్యుడిగా, ద్రవిడ పార్టీ ఆవిర్భావ కర్త అన్నాదురైకు తమ్ముడిగా, తమిళ ప్రజలే తన శ్వాస అని చివరి వరకు రాజకీయ ప్రస్తానంలో అవిశ్రాంత నేతగా పనిచేసి అందరి హృదయాల్లో చిరస్మరణీయుడైన నేత కలైంజ్ఞర్ కరుణానిధి అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2018 ఆగస్టు 7వ తేదీన ఆయన తుది శ్వాస విడిచారు. మెరీనా తీరంలో తన అన్న అన్నాదురై సమాధి పక్కనే శాశ్వత నిద్రలో ఉన్నారు. భౌతికంగా ఆయన లేకున్నా తమిళ ప్రజల హృదయాల్లో మాత్రం చిరస్మరణీయుడే. అదే సమయంలో తాము అధికారంలో ఉన్నా, లేకున్నా దివంగత నేత కరుణానిధి జయంతి, వర్ధంతి కార్యక్రమాలను డీఎంకే వర్గాలు ఘనంగా నిర్వహిస్తున్నాయి. కరుణానిధి మరణించి 8వ సంవత్సరం కావడంతో వర్థంతి కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా డీఎంకే నేతృత్వంలో జరిగాయి. అన్నదానం తదితర సేవా కార్యక్రమాలు చేపట్టారు.
రాష్ట్ర వ్యాప్తంగా శాంతి ర్యాలీలు
కరుణానిధిని స్మరించుకుంటూ రాష్ట్రవ్యాప్తంగా వాడ వాడలలో నివాళులర్పించడంతోపాటు శాంతి ర్యాలీలు నిర్వహించారు. మెరీనా తీరంలో ఉన్న కరుణానిధి సమాధి పరిసరాలను డీఎంకే వర్గాలు సుందరంగా తీర్చిదిద్దాయి. అలాగే, పక్కనే ఉన్న అన్నా సమాధిని సైతం మరింత సుందరంగా తీర్చిదిద్దారు. ఉదయం నుంచే డీఎంకే వర్గాలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి సమాధి వద్ద పుష్పాంజలి ఘటించాయి. డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ నేతృత్వంలో ఉదయాన్నే ఓమందూరార్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఆవరణలోని కరుణానిధి నిలువెత్తు విగ్రహం వద్ద పార్టీ వర్గాలు పూల మాలలు వేసి అంజలి ఘటించాయి. అక్కడి నుంచి పెద్ద ఎత్తున శాంతి ర్యాలీ నిర్వహించాయి. కరుణానిధి స్మారకం తలపించే వాహనం ముందుకు సాగగా స్టాలిన్‌తో పాటు, మాజీ మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు చేపాక్కం, ఎళిలగం, కామరాజర్ సాలై మీదుగా మెరీనా తీరంలోని కరుణానిధి సమాధి వరకు శాంతి ర్యాలీలో నడుచుకుంటూ వచ్చారు. తొలుత అన్నా సమాధి వద్ద నివాళులర్పించారు. తర్వాత కరుణానిధి సమాధి వద్ద స్టాలిన్ అంజలి ఘటించారు. మాజీ మంత్రులు ఉదయనిధి స్టాలిన్, దురై మురుగన్, కేఎన్ నెహ్రూ, ఐ పెరియస్వామి, కరుప్పనన్, ఏవీ వేలు, ఎంఆర్‌కే పన్నీరు సెల్వం, ఎంపీలు కనిమొళి, టీఆర్ బాలు, దయానిధి మారన్, రాజ, పలువురు ఎమ్మెల్యేలు, పెద్ద సంఖ్యలో కేడర్ తరలివచ్చి కరుణానిధి సమాధి వద్ద నివాళులర్పించారు. అనంతరం తేనాం పేటలోని పార్టీ కార్యాలయం అన్నా అరివాలయంకు చేరుకుని కరుణానిధి విగ్రహానికి సీఎంతో పాటు నేతలు పుష్పాంజలి ఘటించారు. ముందుగా గోపాలపురం, సీఐటీ నగర్ నివాసాల్లో కరుణానిధి చిత్ర పటానికి స్టాలిన్ అంజలి ఘటించారు.
ఆధునిక తమిళనాడు రూపశిల్పి కరుణానిధి
ఎం.కరుణానిధి వర్ధంతి సందర్భంగా డీఎంకే అధినేత, ఎం.కే. స్టాలిన్ మాట్లాడుతూ ‘ఎనభై ఏళ్ల సుదీర్ఘ ప్రజా జీవితం కరుణానిధి సొంతం. అర్ద శతాబ్ద కాలం పాటు ఒక గొప్ప ఉద్యమానికి (డీఎంకే) నాయకత్వం వహించారు. ఐదుసార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా, 13 సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికై రాష్ట్రంలో సుదీర్ఘ కాలం సీఎం పదవిలో కొనసాగిన ఘనత ఆయనదే. ప్రభుత్వ యంత్రాంగంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకుని తమిళనాడు భవిష్యత్తును తీర్చిదిద్దారు.’’ అని వివరించారు. ఆధునిక తమిళనాడును మలిచిన రూపశిల్పి ఆయనే అని కొనియాడారు. రాజకీయం, పాలన, కళలు, సాహిత్యం, సినిమా, నాటకం, బుల్లితెరతో పాటు సామాజిక మాధ్యమాల వరకు అన్ని రంగాల్లోనూ తనదైన ముద్ర వేసిన తమిళ బహుముఖ ప్రజ్ఞాశాలిగా మెలిగారని పేర్కొన్నారు. నల్లటి అద్దాలు, ఆ గంగుల గొంతుతో మన జ్ఞాపకాలలో చెరగని ముద్ర వేసుకున్న నాయకుడు కరుణానిధి భౌతికంగా మనకు దూరమై, మన హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోయిన రోజు ఇది అని, ఆయనే మనకు సర్వస్వం.. ఆయన లేకుండా మనం లేము అని స్టాలిన్ భావోద్వేగంగా పేర్కొన్నారు.


