సాక్షి, చైన్నె: టీవీకే ప్రభుత్వం ప్రకటించిన విధంగా రూ.832 కోట్ల నిధులతో ‘అణ్ణన్ సీర్’(అన్నయ్య సారె) పథకాన్ని అమలు చేయడం సాధ్యం కాదరని, ‘వెట్రి 150 రోజులు’ (విజయం 150 రోజుల) పథకం ద్వారా టీవీకే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి దాసోహమైనట్టు స్పష్టమవుతోందని డీఎంకే సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రఘుపతి అసెంబ్లీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందుకు ఆర్థిక మంత్రి మరియా విల్సన్ సమాధానం ఇవ్వడంతో ఇద్దరి మధ్య ఆర్థిక బడ్జెట్ చర్చ వ్యాఖ్యల తూటాల మధ్య సాగింది. శాసనసభలో బడ్జెట్ కాపీపై జరిగిన సాధారణ చర్చలో రఘుపతి మాట్లాడుతూ విమర్శనాస్త్రాలు సందించారు. బడ్జెట్‌లో ప్రజల పన్నుల డబ్బును ఒక్క పైసా కూడా తాకమని, తాకిన వారిని వదలిపెట్టమని చెప్పారని గుర్తు చేశారు. శనివారం పనైయూర్ వారపు సంతకు వచ్చే వారంతా గతంలో అలా పన్నుల డబ్బును తాకిన వారేనని చమత్కరించారు. ఆర్థిక మంత్రి చేతిలో జపమాలతో వచ్చి బడ్జెట్ చదివితే, వ్యవసాయ శాఖ మంత్రి తిరుపతి వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని లడ్డూ, పులిహోరతో వచ్చి బడ్జెట్ ప్రవేశపెట్టారని విమర్శించారు. తాము అన్నాదురై చూపిన ఒకే కులం – ఒకే దేవుడు అనే మార్గంలో నడిచేవాళ్లమని పేర్కొన్నారు.
అణ్ణన్ సీర్ పథకంపై విమర్శలు
ఎన్నికల్లో ప్రకటించిన రూ.832 కోట్లతో ’అణ్ణన్ సీర్’ (అన్న సారె) పథకాన్ని అందించడం సాధ్యపడదన్నారు. ఈ పథకం పరిధిలోకి దాదాపు 2 లక్షల నుంచి 3 లక్షల మంది మహిళలు వస్తారని వివరించారు. ప్రస్తుతం తులం (సవర్న్) బంగారం ధర రూ.1,05,000గా ఉందని, ఒకవేళ బంగారం ధర రూ.లక్ష, చీర ధర రూ.10 వేలు అనుకున్నా ఈ పథకానికి రూ.2 వేల కోట్లు అవసరమవుతాయని తెలిపారు. ఉచిత 200 యూనిట్ల విద్యుత్ గురించి మాట్లాడితే ఈ పాలకులకు కోపం వస్తుందన్నారు. ఎవరికీ ఆ విద్యుత్ లభించడం లేదని ధ్వజమెత్తారు. పైగా 3 లక్షల మందిపై విద్యుత్ ఛార్జీల భారంపై మోపినట్టు ఫిర్యాదులు వస్తున్నాయని విమర్శించారు. మహిళలకు అందాల్సిన రూ.2,500 సాయం కూడా అందడం లేదంటూ రఘుపతి వ్యాఖ్యల తూటాలను పేల్చారు. ఆర్థిక మంత్రి మరియా విల్సన్ మాట్లాడుతూ అన్ని ఆధారాలు, అన్ని లెక్కలు తమ వద్ద ఉన్నాయని, సీఎం విజయ్ ప్రసంగంలో అవన్నీ ఉంటాయని వివరించారు.
కేంద్ర నిధుల వాటాపై ప్రత్యేక తీర్మానం
తమిళనాడుకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన న్యాయమైన పన్నుల వాటాను అందించాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రత్యేక తీర్మానం శాసనసభలో ఏకగ్రీవంగా ఆమో దం పొందింది. ఈ తీర్మానాన్ని ఆర్థిక మంత్రి మరియ విల్సన్ ప్రవేశపెట్టారు. కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే పన్నుల నుంచి తమిళనాడుకు న్యా యబద్ధంగా రావాల్సిన నిధుల వాటాను నిరంతరంగా నిర్ధారించాలని, రాష్ట్రాల ఆర్థిక సహకారం, పాలనా సామర్థ్యం, అభివృద్ధి అవసరాలను గుర్తించేలా కేంద్ర పన్నుల పంపిణీ పారదర్శకంగా, నిష్పాక్షికంగా ఉండాలని డిమాండ్ చేశారు. జనాభా నియంత్రణ, మానవ వనరుల అభివృద్ధిలో రాష్ట్రాలు సాధించిన విజయాల కారణంగా పన్నుల కేటాయింపు నిబంధనలు ఏ రాష్ట్రాన్ని దెబ్బతీసే విధంగా ఉండకూడదని తెలిపారు. భవిష్యత్తులో పన్నుల వాటా కేటాయింపుల్లో తమిళనాడు న్యాయమైన ఆర్థిక ప్రయోజనాలను కాపాడే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ తీర్మానానికి మద్దతు ఇస్తూ డీఎంకే సభ్యులు తంగం తెన్నరసు మాట్లాడుతూ ప్రస్తుతం కేంద్రం రాష్ట్రాలకు ఇస్తున్న 41 శాతం పన్నుల వాటాను 50 శాతానికి పెంచాలని తీర్మానంలో సవరణ చేయాలని కోరారు. అదేవిధంగా అన్నాడీఎంకే శాసనసభా పక్ష నేత పళనిస్వామి కూడా ఈ తీర్మానాన్ని స్వాగతించారు. అనంతరం ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన ఈ తీర్మానం శాసనసభలో వాయిస్ ఓటింగ్ ద్వారా ఏకగ్రీవంగా ఆమోదించారు.


