పీఎంకే శాసన సభా పక్ష నేత సౌమ్య అన్బుమణి మాట్లాడుతూ తమిళనాడు సరిహద్దుకు 4 కిలోమీటర్ల దూరంలోనే కర్ణాటక ప్రభుత్వం మేఘదాతు డ్యామ్‌ను నిర్మించాలని చూస్తోందని తెలిపారు. దాన్ని ఆపాలన్నదే మన స్పష్టమైన వైఖరని, ఈ విషయంలో కర్ణాటకతో ఎలాంటి చర్చల ప్రతిపాదనలు చేయాల్సిన అవసరం లేదని తెలిపారు. ‘కావేరి నదిలో ఏడాదికి 780 టీఎంసీల నీటి ప్రవాహం ఉంటుందని పేర్కొన్నారు. ఇందులో కర్ణాటక హక్కు 285 టీఎంసీలు కాగా, తమిళనాడుకు 404 టీఎంసీల నీటిపై హక్కు ఉందన్నారు. చర్చల పేరుతో క్రమంగా ఆ పరిమాణం తగ్గి చివరకు 175.25 టీఎంసీలకు చేరిందని వాపోయారు. ఈ నీటిని అయినా ప్రతినెలా కేటాయించిన పట్టిక ప్రకారం విడుదల చేస్తున్నారా అంటే అదీ లేదని మండి పడ్డారు. ప్రస్తుతం కర్ణాటక విడుదల చేస్తున్న నీరు కూడా కబిని డ్యామ్ నుంచి వస్తున్న అదనపు (సర్ ప్లస్) నీరు మాత్రమేనని తెలిపారు. అక్కడ వరద ముప్పు తప్పించుకోవడానికే నీటిని కిందకు వదులుతున్నారని, న్యాయస్థానం తీర్పులకు కట్టుబడి కాదన్నారు. ఈ సందర్భంగా మేఘదాతు నిర్మాణం వలన కలిగే నష్టాలను ఆమె సభ ముందు ఉంచారు.


