తమిళసినిమా: తెలుగులో భారీ చిత్రాలను నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఇప్పుడు తమిళంలోనూ వరుసగా చిత్రాలు నిర్మిస్తూ విజయాలను అందుకుంటోంది. ఇక్కడు ఇంతకు ముందు అజిత్ హీరోగా గుడ్‌బ్యాడ్ అగ్లీ చిత్రాన్ని నిర్మించి సక్సెస్‌ను అందుకుంది. ఆ తరువాత మొద రాత్రి అనే చిన్న బడ్జెట్ చిత్రాన్ని నిర్మించి మంచి విజయాన్ని సాధించింది. కాగా తాజాగా దర్శకుడు లోకేశ్ కనకరాజ్‌తో కలిసి ఒక వైవిధ్యభరిత కథా చిత్రాన్ని నిర్మిస్తుండటం విశేషం. స్టార్ దర్శకుడిగా రాణిస్తున్న లోకేశ్ కనకరాజ్ ఇటీవల హీరోగా అవతారమెత్తి డీసీ అనే చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా భారీ చిత్రాన్ని తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నారు. అంతే కాకుండా తన స్క్వాడ్ స్టూడియో పతాకంపై వరుసగా చిత్రాలను నిర్మిస్తున్నారు. అలా ఆయన తాజాగా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థతో కలిసి నిర్మిస్తున్న చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీనికి ఇంతకు ముందు సిల నేరంగళిల్ సిల మనిదర్‌గళ్ , బాంబ్ వంటి వైవిధ్యభరిత కథా చిత్రాలను తెరకెక్కించిన విశాల్ వెంకట్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నటుడు నాజర్, నటి రెజీనా, రమేశ్ తిలక్, శ్రీజారవి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుందని యూనిట్ వర్గాలు ఒక వీడియోను విడుదల చేశారు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాగా ఈ చిత్ర టైటిల్‌తో పాటూ ఇతర వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు యూ నిట్ సభ్యు లు పేర్కొన్నారు.


