నీటిని సాధించడం పెద్ద సవాలు | - | Sakshi
Sakshi News home page

నీటిని సాధించడం పెద్ద సవాలు

Aug 8 2026 1:47 AM | Updated on Aug 8 2026 1:47 AM

శాసనసభలో మంత్రి ఆనంద్‌ మాట్లాడుతూ నెలవారీ ప్రాతిపదికన కర్ణాటక నుంచి తమిళనాడుకు రావాల్సిన కావేరి నీటిని పొందడం పెద్ద సవాలుగా మారిందన్నారు. ఈ విషయంలో తమిళనాడు హక్కులను ఏమాత్రం వదులుకోకుండా టీవీకే ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటోందన్నారు. కావేరి నీరు రాష్ట్రానికి జీవాధారమని, డెల్టా జిల్లాల వ్యవసాయానికి, ఇతర జిల్లాల తాగునీటి అవసరాలకు ఇది ఎంతో ముఖ్యంగా వివరించారు. కావేరి ట్రిబ్యునల్‌ తుది తీర్పు, సుప్రీంకోర్టు ఉత్తర్వుల ద్వారా తమిళనాడు హక్కులు నిరూపితమైనప్పటికీ, ప్రతినెలా కర్ణాటక నుంచి నీటిని విడుదల చేయించుకోవడం సవాలుగా మారిందన్నారు. నీటి పంపిణీపై చర్చించేందుకు తమిళనాడు సీఎం చేసిన విజ్ఞప్తికి ఆగస్టు 3న సమావేశమవుదామని కర్ణాటక ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్‌ అంగీకరించారని తెలిపారు. ఆ తర్వాత ఆ తేదీ అనుకూలంగా లేదంటూ వాయిదా వేశారని గుర్తు చేశారు. కావేరి నీటి నియంత్రణ కమిటీ ఆదేశాల ప్రకారం జూలై 29 నుంచి ఆగస్టు 12 వరకు రోజుకు 3,500 క్యూసెక్కుల నీటిని (మొత్తం 4.536 టీఎంసీలు) విడుదల చేయాల్సి ఉండగా, కర్ణాటక ప్రభుత్వం ఆ ఆదేశాలను సరిగ్గా అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జూలై 29 నుంచి ఆగస్టు 2 మధ్య రోజుకు 3,500 క్యూసెక్కులు రావలసిన చోట 144 నుంచి 619 క్యూసెక్కులు మాత్రమే విడుదల చేసిందన్నారు. దీంతో రావలసిన నీటిలో భారీ వ్యత్యాసం ఏర్పడిందన్నారు. ఆగస్టు 6వ తేదీ నాటికి మనకు అందింది 4.947 టీఎంసీల నీరు మాత్రమేనని, ట్రిబ్యునల్‌ తీర్పు ప్రకారం మనకు ఇంకా 41.412 టీఎంసీల నీటి కొరత ఏర్పడిందన్నారు. సీఎం ఆదేశాల మేరకు ఆగస్టు 3న సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశామని మంత్రి తెలిపారు. అలాగే కర్ణాటక డ్యామ్‌లలో నీటి ప్రవాహం పెరిగినందున, ఆగస్టు 12 నాటికి తమిళనాడుకు రావాల్సిన 26.594 టీఎంసీల నీటిని విడుదల చేసేలా ఆదేశించాలని కావేరి మేనేజ్‌మెంట్‌ అథారిటీకి లేఖ రాశామన్నారు. కావేరి, మేఘదాతు డ్యామ్‌ అంశాలపై ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రధానికి రెండుసార్లు లేఖలు రాశారని వివరించారు. చట్టపరంగా, పరిపాలనా పరంగా రాష్ట్ర హక్కుల పరిరక్షణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement