డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్ మాట్లాడుతూ ‘‘కావేరి నీరు మన హక్కు, దాన్ని ఇవ్వడం కర్ణాటక బాధ్యత. మేఘదాతులో ప్రాజెక్టును నిర్మించకూడదు. ఈ సమస్యపై చర్చించేందుకు ముఖ్యమంత్రి విజయ్ కర్ణాటక వెళ్లాలనుకోవడం మంచి నిర్ణయమే. ఒకవేళ అక్కడ మన సీఎంకు అవమానం జరిగితే తమిళనాడు ప్రజలంతా ఏకమై తిరగబడతారు’’ అని స్పష్టం చేశారు. గత ప్రభుత్వాల పథకాలకు ప్రస్తుత టీవీకే ప్రభుత్వం పేర్లు మారుస్తోందని అంటున్నారని గుర్తు చేస్తూ, పజలకు ఉపయోగపడే ఏ మంచి పథకమైనా కొనసాగాలన్నదే తమ విధానమని పేర్కొన్నారు. ఏ ప్రభుత్వం తెచ్చినా అది ప్రజల పన్నుల డబ్బుతోనే నడుస్తుందన్నారు. విరుదాచలంను ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని ఆమె డిమాండ్ చేశారు. ముందుగా సీపీఐ ఎమ్మెల్యే రామచంద్రన్ ప్రసంగిస్తూ చర్చలు వృథా ప్రయాస అని ప్రభుత్వానికి హితవు పలికారు. అఖిలపక్షం ద్వారానే ఢిల్లీకి వెళ్దామని డిమాండ్ చేశారు. ఈ సమయంలో మంత్రి నిర్మల్‌కుమార్ స్పందిస్తూ కావేరి వ్యవహారంలో అఖిలపక్ష సమావేశం కన్నా, అసెంబ్లీలో ఉన్న అన్ని పక్షాలు కలిసి తీర్మానం చేసి పంపించిన విషయాన్ని గుర్తు చేశారు. శనివారం సీఎం విజయ్ నేతృత్వంలో నియోజకవర్గ పునర్విభజన వ్యవహారంపై అన్ని పార్టీల ఎంపీలతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. అదే సమయంలో మంత్రులు రాజ్ మోహన్, ఆదవ్ అర్జున, సెంగోట్టయన్ మాట్లాడుతూ కావేరి వ్యవహారంలో గత డీఎంకే ప్రభుత్వ తప్పిదాలను గుర్తు చేస్తూ వ్యాఖ్యల తూటాలను పేల్చారు.


