న్యూస్‌రీల్
ముగిసిన నాలుగు దశాబ్దాల రామన్న ప్రయాణం
వయోభారం, ఆరోగ్యసమస్యలతో రాజకీయాలకు స్వస్తి
నూతనోత్సాహంతో కేడర్ ముందుకు..
పీఎంకేలో ఇక అన్బుమణి శకం పూర్తి స్థాయిలో మొదలైంది. తండ్రి, తనయుడి మద్య ఉన్న వివాదం ముగిసింది. పీఎంకే పూర్తిగా అన్బుమణి గుప్పెట్లోకి చేరింది. వయోభారం, ఆరోగ్య సమస్యల నేపథ్యంలో రాజకీయాల నుంచి సీనియర్ నేత రాందాసుతప్పుకోవడంతో వారసుడి ఆధిక్యానికి రూట్ క్లియర్ అయినట్లయ్యింది.
సాక్షి, చైన్నె : తమిళనాట అత్యధిక జనాభా కలిగిన వన్నియర్లను ఏకం చేసి దివంగత కాడు వెట్టి గురు సహకారంతో సంఘాన్ని నెలకొల్పిన రాందాసు 1989లో దానిని పాటాలి మక్కల్ కట్చిగా (పీఎంకే) మార్చారు. వన్నియర్ల ఆధిపత్యం లక్ష్యంగా దూకుడుగా ముందడుగు వేస్తూ పార్టీ వ్యవస్థాపకుడిగా రాందాసు ఆది నుంచి చక్రం తిప్పుతూ వచ్చారు. రాష్ట్ర రాజకీయాలను శాసించే దిశగా తొలి నాళ్లలో అడుగులు వేశారు. 2001లో అన్నాడీఎంకేతో జత కట్టి 20 చోట్ల గెలిచారు. 2006లో డీఎంకేతో జత కట్టి 18 చోట్ల గెలిచారు. ఈ సమయంలో మైనారిటీ ప్రభుత్వంగా డీఎంకే పాలన సాగాల్సి వచ్చినా, మంత్రి వర్గంలో మాత్రం చేరలేదు. అయితే, జాతీయ స్థాయిలో పీఎంకేను తీసుకెళ్లే దిశగా యూపీఏ పాలనలో కేంద్ర మంత్రుల పదవులలో ఆ పార్టీకి చెందిన ముఖ్య నేతలు చక్రం తిప్పారు.
కూటములు మార్చడంలో దిట్టా..
ఆ తదుపరి పరిణామాలతో ప్రతి ఎన్నికలలోనూ కూటములను మార్చి మార్చి సామాజిక వర్గం ఓటు బ్యాంక్‌ను సైతం రాందాసు దూరం చేసుకున్నారు. కుటుంబ వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం అని తొలినాళ్లలో స్వయంగా ప్రకటించిన రాందాసు కాలక్రమేనా తన వారసుడు అన్బుమణిని తెర మీదకు తెచ్చారు. అన్బుమణి సీఎం అభ్యర్థి అంటూ ఒంటరిగా ఎన్నికలలోకి వెళ్లి భంగ పడ్డారు. 2021 అసెంబ్లీ ఎన్నికలలో అన్నాడీఎంకేతో జత కట్టి పరువు దక్కించుకున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలలో బీజేపీతో జత కట్టి డిపాజిట్లే కాదు, ఓటు బ్యాంక్‌ను కూడా గల్లంతు చేసుకున్నారు. పార్టీ అధ్యక్షుడి పదవిని తన వారసుడు అన్బుమణికి అప్పగించి తైలాపురంకు తొలుత రాందాసు పరిమితమైనా, గత రెండేళ్లుగా తండ్రి, తనయుడి మధ్య సాగుతూ వచ్చిన వారసత్వ సమరంతో 2026 అసెంబీ ఎన్నికల సమయంలో పీఎంకే రెండు ముక్కలైన పరిస్థితి ఏర్పడింది. ఎట్టకేలకు కేంద్రంలోని బీజేపీ పాలకుల సహకాారంతో పార్టీ, చిహ్నం తనదేనని ఎన్నికలలోకి వెళ్లిన అన్బుమణి శిబిరానికి నాలుగు చోట్ల విజయం దక్కింది. అయితే రాందాసు శిబిరం భంగపడాల్సి వచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో గత నెల రోజులుగా రాందాసు ఇంట సాగుతూ వచ్చిన పరిణామాలు పీఎంకే వర్గాలలో జోష్‌ను నింపేశాయి.
రామన్న రాజకీయ నిష్క్రమణ
నాలుగుదశాబ్దాల రాజకీయ ప్రయాణానికి శనివారం రాందాసు ముగింపు పలికారు. విల్లుపురం జిల్లా దిండివనం సమీపంలోని కోనేరికుప్పంలో ఉన్న రాందాసు కుటుంబానికి చెందిన సరస్వతి కళాశాలలో బర్తడేవేడుకలు జరిగాయి. తన 88వ బర్త్‌డే సందర్భంగా భార్య సరస్వతి, కుమారుడు డాక్టర్ అన్బుమణి రాందాస్, కోడలు సౌమ్య అన్బుమణితో కలిసి వేదికపై రాందాసు తన రాజకీయ నిష్క్రమణ ప్రకటన చేశారు. ఇకపై రాజకీయాలు మాట్లాడనని, పార్టీ విషయాల్లో జోక్యం చేసుకోనని, అంతా అన్బుమణి చూసుకుంటారని రాందాసు స్వయంగా ప్రకటించడంతో ఇక పీఎంకేలో వారసుడి శకం పూర్తి స్థాయిలో మొదలైందన్న జోష్ కేడర్‌లో నెలకొంది. అన్బుమణికి తాను, కోడలు సౌమ్య అండగా ఉంటామని రాందాసు ప్రకటించడంతో ఇక, పూర్తి స్థాయిలో పార్టీ బలపేతం దిశగా అడుగు వేగాన్ని పెంచేందుకు నేతలు సన్నద్ధమయ్యారు.అయితే, అన్బుమణితో వివాదం నేపథ్యంలో జీకే మణి, అరుల్ వంటి అనేక మంది నేతలు రాందాసు వెన్నంటి నిలిచారు. అంతేకాదు, రాందాసు కుమార్తె శ్రీగాంధీ కూడా అండగా నిలబడ్డారు. అయితే మున్ముందు పార్టీలో వీరి పరిస్థితి ఏమిటో? అన్నది కాలమే సమాధానం చెప్పనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


