సాక్షి,చైన్నె : రహదారులు సాహసాలు (స్టంట్లు) చేయడానికి కాదు, సురక్షితమైన ప్రయాణానికేనని చైన్నె నగర పోలీస్ కమిషనర్ అమల్‌రాజ్ విద్యార్థులకు హితవు పలికారు. చైన్నెలో వాహనాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు చైన్నె మెట్రోపాలిటన్ ట్రాఫిక్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బ్రాడ్‌వేలోని రాజా అన్నామలై మండపంలో ప్రత్యేకావగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కమిషనర్ అమల్‌రాజ్, ప్రమాద సమయాల్లో గోల్డెన్ అవర్‌లో బాధితులను కాపాడి ప్రాణాలు నిలిపిన పోలీసులు, అంబులెన్స్ డ్రైవర్లు, నర్సులు, ఆటో డ్రైవర్లు, విద్యార్థులు , సాధారణ పౌరులకు ప్రశంసా పత్రాలు అందించి అభినందించారు. ఈసందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, ఈ ఏడాది జనవరి 1 నుండి చైన్నెలో 2,206 రోడ్డు ప్రమాదాలు నమోదుకాగా, 2,000 మందికి పైగా గాయపడ్డారు. 280 మంది ప్రాణాలు కోల్పోయారని వివరించారు. పోలీసుల చర్యల వల్ల ప్రమాదాలు తగ్గినప్పటికీ, వీటిని పూర్తిగా నివారించేందుకు నిరంతరం అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు.
మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దు
18 ఏళ్లలోపు మైనర్ పిల్లలకు తల్లిదండ్రులు బైక్‌లు, ఇతర వాహనాలు ఇవ్వకూడదని, ఒకవేళ అలా ఇచ్చి ప్రమాదం జరిగితే, వాహనం ఇచ్చిన తల్లిదండ్రులపై కూడా కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నామని హెచ్చరించారు. రోడ్లు విన్యాసాలు చేసే వేదికలు కావు అని, ద్విచక్ర వాహ నడిపేవారే కాకుండా వెనుక కూర్చునేవారు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని పిలుపునిచ్చారు. ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణమే సహాయం అందించి పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రతపై కళారూపాల ద్వారా అవగాహన ప్రదర్శనలు నిర్వహించారు. ప్రముఖ టీవీ వ్యాఖ్యాత నీయా నానా గోపీనాథ్ అవగాహన ప్రసంగం చేశారు. విద్యార్థులకు హెల్మెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమం ముగింపులో 800 మందికి పైగా విద్యార్థులు, పోలీసు అధికారులు కలసి ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తాం అని ప్రతిజ్ఞ చేశారు. ఈ వేడుకలో ట్రాఫిక్ అదనపు కమిషనర్ చాముండేశ్వరి, జాయింట్ కమిషనర్ పగలవన్, డిప్యూటీ కమిషనర్లు బాలాజీ, మేగలినా ఐడెన్, ముత్తుకుమార్ తదితరులు పాల్గొన్నారు.


