సాక్షి, చైన్నె : విద్యార్థుల పోరాటాలను తాము మనస్పూర్తిగా గౌరవిస్తున్నామని, అయితే, కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం ఈ ఆందోళనలను ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మళ్లించేందుకు కుట్ర, ప్రయత్నాలు చేస్తున్నారని దేవాదాయ శాఖమంత్రి ఎస్ రమేషన్ ఆరోపించారు. ఈ అంశాన్ని ప్రభుత్వం ఎలా ఎదుర్కోవాలో అలా కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. తిరుచ్చి జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న మంత్రి రమేష్, అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నీట్ పరీక్షా విధానంపై విద్యార్థులు చేస్తున్న పోరాటానికి ముఖ్యమంత్రి ఇప్పటికే పూర్తి మద్దతు ప్రకటించారని గుర్తుచేశారు. నీట్ పరీక్షను పూర్తిగా రద్దు చేసి, విద్యను తిరిగి రాష్ట్ర జాబితా లోకి తీసుకురావడమే దీనికి శాశ్వత పరిష్కారమని, ఆ దిశగా ప్రభుత్వం కృషి చేస్తున్నట్టు తెలిపారు. శాసనసభలో నీట్‌కు వ్యతిరేకంగా మళ్లీ బిల్లు ప్రవేశపెట్టే విషయమై ముఖ్యమంత్రే సరైన సమయంలో నిర్ణయం వెల్లడిస్తారని చెప్పారు.
పళని ఆలయ భూముల వివాదంపై వివరణ
పళని ఆలయ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారంపై వస్తున్న ఆరోపణల గురించిమంత్రి స్పందిస్తూ, పళని ఆలయ భూముల వ్యవహారంపై ప్రస్తుతం విచారణ వేగంగా జరుగుతోందన్నారు.. నేరస్థులు ఎంతటివారైనా సరే కఠినంగా శిక్షించబడతారన్నారు. అయితే కొందరు కేవలం రాజకీయ లబ్ధి కోసమే తనపై నిందలు వేస్తున్నారన్నారు. అసలు ఈ కేసును సీబిసీఐడీ విచారణకు అప్పగించాలని స్వయంగా తానే ముఖ్యమంత్రిని కోరాననని పేర్కొన్నారు. అప్పుడే నిజమైన దోషులు బయటకు వస్తారని, ఈ సమస్య వచ్చే వరకు పళనిలో అలాంటి ఒక భూమి ఉందనే విషయం కూడా తనకు తెలియదన్నారు. తనబంధువులకు, తనకకు ఇందులో సంబంధం ఉందంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. సమయపురం ఆలయంలో పనిచేస్తున్న పళనివేల్ అనే అధికారి అక్రమంగా ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై ఏసీబీ విచారణ జరుపుతోందని, విచారణ నిష్పక్షపాతంగా సాగేందుకు ఆయనను సస్పెండ్ చేశామని తెలిపారు. తిరుచ్చి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలుకల బెడదపై తనిఖీలు చేపట్టామని, త్వరలోనే అక్కడ మౌలిక వసతులను మెరుగుపరుస్తామని చెప్పారు.


