ప్రభుత్వానికి నోటీసులు
సాక్షి, చైన్నె: చైన్నెలోని పల్లికరణై రామ్‌సర్ చిత్తడి నేలల సమీపంలో 1,250 అపార్ట్‌మెంట్ల నిర్మాణానికి గతంలో ఇచ్చిన పర్యావరణ అనుమతులను రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ ఓ ప్రైవేట్ నిర్మాణ సంస్థ వేసిన పిటిషన్‌పై రాష్ట్ర పర్యావరణ ప్రభావ అంచనా మండలి(ఈఐఏఏ) వివరణ ఇవ్వాలని మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వివరాలు.. చైన్నె పల్లికరణై రామ్‌సర్ చిత్తడి నేలల ప్రాంతంలో బ్రిగేడ్ అనే ప్రైవేట్ నిర్మాణ సంస్థ 1,250 అపార్ట్‌మెంట్లను నిర్మించేందుకు గత డీఎంకే ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పర్యావరణ ప్రభావ అంచనా మండలి, సీఎండీఏ ఈ నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేశాయి. దీనిని నిరసిస్తూ అరప్పోర్ ఇయక్కమ్, అన్నాడీఎంకే తరఫున దాఖలైన పిటిషన్లను విచారించిన హైకోర్టు, చిత్తడి నేలలకు సంబంధించిన కేసులు ఇప్పటికే సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున ఈ అంశంపై కూడా అత్యున్నత న్యాయ స్థానం ఆశ్రయించాలని గతంలో ఆదేశించింది.
పర్యావరణ అనుమతుల రద్దు
రాష్ట్రంలో టీవీకే ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చినానంతరం పల్లికరణై చిత్తడి నేలల చుట్టూ 1 కిలోమీటరు పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని నిషేధం విధించారు. ఇందులో భాగంగా సదరు బ్రిగేడ్ సంస్థకు గతేడాది జనవరిలో మంజూరు చేసిన పర్యావరణ అనుమతులను రద్దు చేస్తూ రాష్ట్ర పర్యావరణ ప్రభావ అంచనా మండలి ఈనెల 18న ఉత్తర్వులు ఇచ్చింది. ఆ తర్వాత సీఎండీఏ కూడా ఇచ్చిన అనుమతులను రద్దు చేసింది.
హైకోర్టును ఆశ్రయించిన నిర్మాణ సంస్థ
సీఎండీఏ, పర్యావరణ మండలి నిర్ణయాన్ని సవాలు చేస్తూ బ్రిగేడ్ సంస్థ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తమకు కేటాయించిన పర్యావరణ అనుమతులను రద్దు చేసే ముందు తమ వైఖరిని లేదా వివరణను కోరకుండా అధికారులు ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకున్నారని, తమిళనాడు ప్రభుత్వ ఈ చర్య సమర్థనీయం కాదని పిటిషన్‌లో పేర్కొంది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయమూర్తి మహమ్మద్ షఫీక్, దీనిపై రాష్ట్ర పర్యావరణ ప్రభావ అంచనా మండలి వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ కేసు విచారణను జూలై 28కి వాయిదా వేశారు.
పళ్ళికరణై చిత్తడి నేలలు


