వేలూరు: రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న మొత్తం 21 వేల టీచర్ పోస్టులను భర్తీ చేసి నిరుద్యోగులను ఆదుకోవాలని నియామక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన సెకండరీ గ్రేడ్ టీచర్‌ల సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి పార్థిబన్ అన్నారు. ఆ సంఘం సమావేశం వేలూరులోని టీచర్స్ భవనంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ 2013 నుంచి 2022 సంవత్సరం వరకు అనేక మంది టీచర్‌లు అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణ సాధించినప్పటికీ వారికి ఉద్యోగ నియామకాలు ఇవ్వలేదని దీనికి బదులుగా అర్హత పరీక్ష ధృవీకరణ పత్రాన్ని జీవిత కాల ధృవీకరణ పత్రంగా మార్చారని తెలిపారు. వీటి ద్వారా గత 13 సంవత్సరాలుగా తమకు ఎటువంటి ఉద్యోగాలు ఇవ్వకుండా కాల యాపన చేస్తున్నారన్నారు. గత 2024 సంవత్సరంలో కేకవలం 2,768 పోస్టులు మాత్రమే ప్రభుత్వం భర్తీ చేసిందని వీటిలో తమకు అవకాశం కల్పించలేదన్నారు. ఆ సమయంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 20 జిల్లాలో మాత్రమే నియామకాలు జరిగిందని వీటిపై ప్రభుత్వం స్పందించి తమకు ఉద్యోగ నియాకాలు ప్రకటించాలని కోరారు. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని గత నెల 17వ తేదిన చైన్నైలో మహా ధర్నా నిర్వహించడం జరిగిందని, అయినా ప్రభుత్వం తమ సమస్యలపై ఇప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఈ సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర సమన్వయ కర్త విష్ణుప్రియ, రాష్ట్ర కోశాధికారి లోకేశ్వరి, నిరుద్యోగ పట్టభద్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


