కొరుక్కుపేట: చైన్నెలోని తెలుగు లోగిళ్లలో శ్రీపరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. పంచాంగ పఠనం, ఉగాది పురస్కారాలు, సత్కారాలు, ఉగాది పచ్చడి వినియోగంతో తెలుగు సంఘాలు కోలాహలంగా వేడుకలు నిర్వహించాయి.
టీటీడీ ఆలయంలో పంచాంగ శ్రవణం
కొరుక్కుపేట: చైన్నె టి.నగర్, వెంకటనారాయణ రోడ్‌లోని శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఏఈవో ధనుంజయ, టీటీడీ స్థానిక సలహామండలి మాజీ అధ్యక్షుడు శ్రీకృష్ణ, శేఖర్ రెడ్డి, మాజీ సభ్యులు అనిల్‌కుమార్‌రెడ్డి, చంద్రశేఖర్, పీవీఆర్ కృష్ణారావు, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
టీబీఎం ఉగాది పురస్కారాలు ప్రదానం
తెలుగు బ్రాహ్మణ మహాసభ (టీబీఎం) ఆధ్వర్యంలో శ్రీపరాభవ నామ సంవత్సర ఉగాది, శ్రీ త్యాగరాజ దినోత్సవం గురువారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. స్థానిక టి.నగర్‌లోని శ్రీశారదా విద్యాలయ ప్రాంగణంలో సాయంత్రం 4.15గంటలకు గణపతి పూజ, ఫణిశర్మ పంచాంగ పఠనంతో వేడుకల్లో ముందుగా పరేశ్ బాబా నేతృత్వంలో చిన్నారులు ప్రదర్శించిన భరతనాట్యం అందరినీ ఆకట్టుకుంది. టీబీఎం అధ్యక్షుడు గోటేటి వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఉగాది పురస్కార వైభవంలో ముఖ్య అతిథిగా ఆదాయపు పన్ను శాఖ రిటైర్డ్ జాయింట్ కమిషనర్ మంగపతి వివేకానందన్ హాజరయ్యారు. బ్రహ్మశ్రీ దర్బాకుల కుమారశర్మ, పరేశ్ బాబా, త్రికూటం సత్యమూర్తి, శ్రీరంగం డాక్టర్ వెంకట నగరాజన్‌లకు ఉగాది పురస్కారాలు ప్రదానం చేశారు. టీబీఎం నిర్వాహకులు ఎస్.జయరామన్, ఓ.ప్రభాకర్, టి.శంకర్, ఎల్.సాయినాథ్, ఆర్.బాలాజీ పాల్గొన్నారు.
టీటీసీఏ ఉగాది స్వర్ణోత్సవాలు
తమిళనాడు తెలుగు సాంస్కృతిక సంఘం (టీటీసీఏ) ఉగాది స్వర్ణోత్సవ సంబరాలు గురువారం పెరంబూరు డీఆర్బీసీసీసీ పాఠశాల ప్రాంగణంలో ఘనంగా జరుపుకున్నారు. సంఘం అధ్యక్షుడు తమ్మినేని బాబు సారథ్యం వహించారు. ముఖ్యఅతిథిగా అఖిల భారత తెలుగు సమాఖ్య అధ్యక్షుడు ఆచార్య సీఎంకేరెడ్డి, విశిష్టి అతిథిగా సినీ నటుడు భానుచందర్, ఆత్మీయ అతిథిగా జనని సంస్థ ప్రధాన కార్యదర్శి గుడిమెట్ల చెన్నయ్య పాల్గొన్నారు. టీటీసీఏ ప్రారంభించి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వర్ణోత్సవ ప్రత్యేక సంచికను వైభవంగా ఆవిష్కరించారు. వివిధ రంగాలలో రాణిస్తున్న నర్రావుల వెంకటరమణ, పి.సుబ్బారెడ్డి, ఆచార్య విస్తాలి శంకర రావు, శ్రీలక్ష్మీ మోహన్ రావు, ఎంఆర్ సుబ్రహ్మణ్యంకు ఉగాది పురస్కారాలు ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు. కార్యదర్శి పీఆర్ కేశవులు పాల్గొన్నారు.
శ్రీఆంధ్రకళా స్రవంతి ఆధ్వర్యంలో..
శ్రీఆంధ్ర కళా స్రవంతి ఆధ్వర్యంలో శ్రీపరాభవ నామసంవత్సర ఉగాది సంబరాలు గురువారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. స్థానిక కొరట్టూరు రామాలయం వీధిలోని కోదండరామాలయం కమ్యూనిటీ హాలులో స్రవంతి అధ్యక్షుడు జేఎం నాయుడు అధ్యక్షతన జరిగింది. పండితులు సుసర్ల కుటుంబశాస్త్రి పంచాంగ శ్రవణంతో సంబరాలు ప్రారంభమయ్యాయి. ప్రధాన కార్యదర్శి జె.శ్రీనివాస్ నివేదిక సమర్పించారు. ముఖ్య అతిథిగా ఎట్టాయపురం ఎస్వీ వర్శిటీ చాన్సలర్ బి.రామచంద్రన్, విశిష్ట అతిథులుగా పారిశ్రామికవేత్తలు డి.దేవేంద్రన్, పి.ముత్తువేల్ రాజ్, శోభా రాజా పాల్గొన్నారు. ట్రెజరర్ జీవీ రమణ వందన సమర్పణ చేశారు. వైస్ ప్రెసిడెంట్లు కేఎన్ సురేష్ బాబు, వీఎన్ హరినాథ్, పి.సరస్వతి పాల్గొన్నారు.
వైభవంగా ఉగాది పుష్పయాగం
ప్యారీస్: శ్రీకన్యకా పరమేశ్వరి అమ్మవారికి ఉగాది పుష్పయాగ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. చైన్నె జార్జిటౌన్ ఆదియప్పనాయకన్ వీధిలో మూడు వందల యేళ్లకు పైగా చరిత్ర కలిగిన శ్రీ కన్యకాపరమేశ్వరి దేవస్థానం (ఎస్‌కేపీడీ)లో శ్రీ పరాభవ నామసంవత్సర ఉగాది వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు.
దేవాంగ పెండ్లి సమాజం ఆధ్వర్యంలో...
దేవాంగ పెండ్లి సమాజం ఆధ్వర్యంలో అతిథులుగా చిరంజీవి, డాక్టర్ పేరిశెట్ల నందివర్మన్, జక్కల కుప్పుసామి తదితరులు పాల్గొని, ఉగాది పోటీల్లోని విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.
చైన్నె తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో..
చైన్నె తెలుగు అసోసియేషన్(సీటీఏ)–వలసరవాక్కం ఆధ్వర్యంలో శ్రీపరాభవ నామ ఉగాది వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. మధురవాయల్‌లోని సీతాలక్ష్మి కల్యాణ మండపంలో జరిగిన ఈ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ అవనిగడ్డ శాసనసభ్యుడు బుద్ధప్రసాద్ ముఖ్య అతిథిగా, గౌరవ అతిథులుగా వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఉగాది పుష్పయాగం
అనిల్‌కుమార్‌రెడ్డికి ఉగాది పురస్కారం


