చెక్‌పోస్టుల వద్ద ప్రత్యేక నిఘా | - | Sakshi
Sakshi News home page

చెక్‌పోస్టుల వద్ద ప్రత్యేక నిఘా

Mar 20 2026 10:17 AM | Updated on Mar 20 2026 10:17 AM

వేలూరు: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వేలూరు ఉమ్మడి జిల్లాలోని రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లోని చెక్‌పోస్టుల వద్ద ప్రత్యేక నిఘా ఉంచాలని జిల్లా ఎన్నికల అధికారి సుబ్బలక్ష్మి ఎన్నికల అధికారులను ఆదేశించారు. వేలూరు జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికలపై ఎన్నికలు నిర్వహణ, బందోబస్తు ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర వాటిపై జిల్లాలో ఎన్నికల అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గాల్లో సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను ఇప్పటికే గుర్తించామన్నారు. అటువంటి ప్రాంతాల్లో అధిక పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలన్నారు. అదే విధంగా బహిరంగ ప్రదేశాలు, ప్రైవేటు ప్రాంతాలు, కళ్యాణ మండపాల్లో రాజకీయ పార్టీలకు చెందిన సమావేశాలు, బహిరంగ సభలు నిర్వహించినా వెంటనే వాటిని ముందస్తుగా సంబంధిత పోలీసులు, ఎన్నికల అధికారుల వద్ద అనుమతి పొందాలన్నారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంచి వాహన తనిఖీలు చేయాలన్నారు. వేలూరు జిల్లా కర్ణాటక, ఆంధ్ర సరిహద్దులో ఉన్నందున ఓటర్లకు బహుమతులు, దుస్తులు, నగదు పంపిణీ అయ్యే అవకాశం ఉందని వీటిపై ఆయా ప్రాంతాల్లోని అధికారులు ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. పోలింగ్‌ కేంద్రాల్లో తాగునీటి వసతి, విద్యుత్‌ లైట్లు తదితర కనీస వసతులు సక్రమంగా ఉంచుకునే విధంగా చూడాలన్నారు. అనంతరం వివిధ సమస్యలపై సమీక్షించారు. ఈ సమావేశంలో ఎస్పీ శివరామన్‌లతో పాటు జిల్లాలోని ఐదు అసెంబ్లీ ఎన్నికల అధికారులు, తహశీల్దార్‌లు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement