తిరువళ్లూరు: ద్విచక్ర వాహనంలో వెళ్తున్న సమయంలో అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టిన సంఘటనలో తీవ్రంగా గాయపడిన యువకుడు మృతి చెందిన సంఘటన విషాదాన్ని నింపింది. తిరువళ్లూరు జిల్లా ఎల్లాపురం యూనియన్ దండుమానగర్ ప్రాంతానికి చెందిన ఆరుస్వామి(22) మధురవాసల్‌లోని ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం పనులు ముగించుకుని సంతోష్(15) అనే బాలుడితో కలిసి ద్విచక్ర వాహనంలో ఇంటికి బయలుదేరాడు. ఈ క్రమంలో ద్విచక్ర వాహనం పెద్దపాళ్యం–తండలం సమీపంలోని ఆత్తుపాక్కం వద్ద వెళ్తున్న సమయంలో వాహనానికి కుక్క అడ్డురావడంతో తప్పించడానికి యత్నించిన యువకుడు డివైడర్‌ను బలంగా ఢీకొట్టడంతో సంతోష్, ఆరుస్వామి తదితర ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని స్థానికులు 108 వాహనం ద్వారా ఊత్తుకోట ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అప్పటికే ఆరుస్వామి మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. తీవ్రంగా గాయపడిన సంతోష్‌కు ప్రాథమిక చికిత్స అందించిన తరువాత మెరుగైన చికిత్స కోసం తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పనులు ముగించుకుని ఇంటికి వస్తున్న యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.


