సాక్షి: చైన్నెలో ప్రజల్లో ఆరోగ్య చైతన్యాన్ని పెంపొందించే లక్ష్యంతో తమిళనాడు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాక్ ఫర్ హెల్త్ 2.ఓ (నడుద్దాం – ఆరోగ్యంగా ఉందాం 2.ఓ) పథకాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఎం సుబ్రమణియన్ శుక్రవారం చైన్నె శివారులోని ఆవడిలో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి నాజర్‌తో కలసి ప్రారంభించారు. పథకాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రి సుబ్రమణియన్ స్వయంగా 8 కిలోమీటర్లు నడిచి ప్రజల్లో ఉత్సాహాన్ని నింపారు.గతంలో టోక్యో పర్యటనకు వెళ్లిన సమయంలో అక్కడి 8 కి.మీ. ‘హెల్త్ వాక్’ విధానాన్ని చూసిన ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్, అదే తరహా సౌకర్యాలను తమిళనాడులోని అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీంతో గత ఏడాది నవంబర్‌లో మొదటి విడత హెల్త్ వాక్ ప్రారంభం కాగా, తాజాగా రెండో విడత అమల్లోకి తీసుకొచ్చారు. ఒక వ్యక్తి రోజుకు 8 కిలోమీటర్లు నడవడం అనేది 10వేల అడుగులకు సమానంగా పేర్కొంటూ, ఇలా క్రమం తప్పకుండా నడవడం వల్ల మధుమేహం, బీపీ, గుండెపోటు సమస్యలు తగ్గుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు చెబుతున్నాయని మంత్రి వివరించారు. ప్రతినెలా మొదటి ఆదివారం నడక సాగించే వారికోసం ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తామన్నారు. ఆవడి కార్పొరేషన్ మేయర్ ఉదయకుమార్, హెల్త్ సెక్రటరీ డాక్టర్ సెంథిల్ కుమార్, ప్రజలు పాల్గొని ఉత్సాహంగా నడక సాగించారు. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం 37 జిల్లాల్లో ఈ హెల్త్ వాక్ మార్గాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు.


