సాక్షి, చైన్నె: జర్నలిస్టు సంఘాల చిరకాల కోరికలను మన్నిస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ శుక్రవారం రాత్రి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చైన్నె సచివాలయంలో ముఖ్యమంత్రితో సమావేశమైన జర్నలిస్టు ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు, పెన్షన్ పెంపు, వైద్య బీమా, గృహ నిర్మాణ పథకాలకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు. ఉదయం సీఎం స్టాలిన్‌ను చైన్నె ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సురేష్ వేదనాయగం, ప్రధాన కార్యదర్శి ఎం. ఆసిఫ్, ఉపాధ్యక్షుడు మదన్, కోశాధికారి మణికండన్, సభ్యులు పి.స్టాలిన్, గవాస్కర్, ఎస్ పళణివేల్, ఎం.విజయగోపాల్, ఎస్.కార్తికేయన్, ఎస్.షణ్ముగప్రియ కలసి తమ సమస్యలను విన్నవించారు. వీటిని పరిశీలించిన సీఎం స్టాలిన్ ఉత్తర్వులు జారీ చేశారు.
పెన్షన్ పెంపు: జర్నలిస్టులకు ప్రస్తుతం అందుతున్న నెలవారీ పెన్షన్‌న్‌ను రూ.12వేల నుంచి రూ.15వేలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే, జర్నలిస్టుల కుటుంబ పెన్షన్‌న్‌ను రూ.6వేల నుంచి రూ.7,500కు పెంచారు. అక్రిడిటేషన్ కార్డు కలిగిన జర్నలిస్టులందరికీ సీఎం సమగ్ర వైద్య బీమా పథకం కింద ఉచిత వైద్య సదుపాయం కల్పించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. చైన్నె జర్నలిస్టుల గృహ నిర్మాణ కోరికను తీరుస్తూ, చెంగల్పట్టు జిల్లాలో తమిళనాడు హౌసింగ్ బోర్డు ద్వారా ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఇందుకోసం జర్నలిస్టులు ఒక కో–ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీని ఏర్పాటు చేసుకోవాలని సీఎం సలహా ఇచ్చారు. అలాగే జర్నలిస్టులు సమర్పించిన మిగిలిన వినతులను కూడా త్వరలోనే పరిశీలించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.


