సాక్షి, చైన్నె: పుదుచ్చేరి ఎన్‌డీఏ కూటమిలో రాజకీయం రసవత్తరంగా మారింది. తాము 16 స్థానాలలో పోటీ చేయనున్నట్టు ఎన్‌ఆర్ కాంగ్రెస్ అధినేత, సీఎం రంగస్వామి బీజేపీకి స్పష్టం చేసినట్టు సమాచారం. మిగిలిన 14 సీట్లను బీజేపీ ఏమైనా చేసుకోవచ్చన్న సలహాను శుక్రవారం జరిగిన సీట్ల పంపకాల సమావేశంలో రంగస్వామ తేల్చిచెప్పనట్టు చర్చ జోరందుకుంది. ఐదేళ్లుగా కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఎన్‌ఆర్ కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. ఎన్‌డీఏ కూటమి అధికారంలో ఉన్న పుదుచ్చేరికి ఒరిగింది శూన్యమే. ఇదే విషయాన్ని పలుమార్లు సీఎం రంగస్వామి బహిరంగానే వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర హోదా కూడా ఇవ్వడం లేదన్న అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో 2026 ఎన్నికలలో సీట్ల పంపకాల చర్చలపై ఎన్‌డీఏ దృష్టి పెట్టింది. పుదుచ్చేరిలోని 30 సీట్లలో కూటమి పెద్దగా ఉన్న ఎన్‌ఆర్ కాంగ్రెస్ 16 స్థానాల్లో పోటీ చేయడానికి నిర్ణయించినట్టు సమాచారం. మిగిలిన 14 స్థానాలను బిజేపికి అప్పగించారు. అయితే, ఈ కూటమిలోకి చేరిన అన్నాఎంకేతోపాటు మరికొన్ని పార్టీల పరిస్థితి అయోమయంగా మారింది. అయితే, ఈ పార్టీలో బీజేపీతో కలిసి వచ్చినట్టుగా రంగస్వామి పేర్కొంటుండడం గమనార్హం. బీజేపీకి ఇచ్చిన స్థానాల్లో వారు సర్దుకోవాలంటూ సలహా ఇచ్చి ఉండడం చర్చకు దారి తీసింది. శుక్రవారం బీజేపీ పుదుచ్చేరి ఎన్నికల ఇన్‌చార్జ్, కేంద్ర మంత్రి మన్సుక్ మాండవియ నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఎన్‌ఆర్ కాంగ్రెస్ వర్గాలు తమ సీట్ల విషయంగా స్పష్టత ఇచ్చి వెళ్లినట్టు సమాచారం. అదే సమయంలో బీజేపీ ఏదేని తిరకాసుపెట్టిన పక్షంలో విజయ్ టీవీకేను కలుపుకుని ఎన్నిలను ఎదుర్కొనేందుకు రంగస్వామి వ్యూహాలకు పదును పెట్టి ఉన్నట్టు తెలిసింది. ఈవిషయంగా ఎన్‌ఆర్‌కాంగ్రెస్ వర్గాలను కదిలించగా, తాజా భేటీ పూర్తయిన తర్వాత, చర్చలు మళ్లీ మళ్లీ ముగిసినానంతరం వివరాలు స్పష్టంగా తెలియజేస్తామని చెబుతున్నారు.


