సేలం: విద్యా రంగంలో అధునాతత సాంకేతికతను అందుబాటులోకి తె చ్చే విధంగా కృష్ణగిరిలో ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశారు. ఇందులో భాగంగా కృష్ణగిరి జిల్లా బర్గూర్‌లోని ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలో డెల్టా ఎలక్ట్రానిక్స్ సంస్థ నేతృత్వంలో సామాజిక ధృక్పథంతో రూ.1.5 కోట్ల వ్యయంతో అత్యాధునిక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ రోబోటిక్స్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. దీనిని కృష్ణగిరి జిల్లా కలెక్టర్ ఎస్.దినేష్‌కుమార్ ప్రారంభించారు. వసతులను, ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ దినేష్‌కుమార్ మాట్లాడుతూ పారిశ్రామిక ఆటోమేషన్, అధునాతన సాంకేతిక విద్యా రంగంలో ఇది పెద్ద పురోగతిగా పేర్కొన్నారు. విద్యుత్, శక్తి నిర్వహణ పరిష్కారాలలో అగ్రగామిగా ఉన్న డెల్టా ఎలక్ట్రానిక్స్ ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలో రోబోటిక్స్ విభాగాల కోసం అత్యాధునిక సౌకర్యాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానిస్తున్నామన్నారు. డెల్టా ఎలక్ట్రానిక్స్ ఆటోమేషన్, రోబోటిక్స్, పవర్ ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్స్, ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్, స్మార్ట్ మాన్యుఫ్యాక్చరింగ్ తదితర రంగాలలో అధునాతన సాంకేతిక పరిష్కారాలను అందించడం ద్వారా భారతదేశ పారిశ్రామిక, సాంకేతిక రంగం బలోపేతం అవుతోందన్నారు. ఈ నైపుణ్య అభివృద్ధి ప్రాజెక్టును కేంద్రం పరిశ్రమలు, సమాచార సాంకేతిక శాఖ ద్వారా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఏర్పాటైనట్టు వివరించారు. ఈ సెంటర్‌లో రోబోటిక్స్, అటానమస్ సిస్టమ్స్‌లో నాలుగు నెలలు స్వల్పకాలిక శిక్షణ, రోబోటిక్స్, అటానమస్ సిస్టమ్స్‌లో తొమ్మిది నెలల మాస్టర్స్ సర్టిఫికెట్ శిక్షణ అందిస్తామన్నారు. ఈ కార్యక్రమాల్లో డెల్టా ఎలక్ట్రానిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ బెంజమిన్ లిన్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనిరంజన్ ఎస్ నాయక్, తమిళనాడు స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె.వి.రాజ్‌కుమార్, మేనేజింగ్ డైరెక్టర్ కాశీ విశ్వనాథన్ పాల్గొన్నారు.


