సంకీర్ణ ప్రభుత్వానికి చోటు లేదు..! | - | Sakshi
Sakshi News home page

సంకీర్ణ ప్రభుత్వానికి చోటు లేదు..!

Feb 12 2026 7:30 AM | Updated on Feb 12 2026 7:30 AM

సంకీర

సంకీర్ణ ప్రభుత్వానికి చోటు లేదు..!

తమిళనాడు దేశానికే మార్గదర్శనం చేస్తుంది డీఎంకే ప్రభుత్వం కొనసాగితేనే రాష్ట్రానికి ఉత్తమ భవిష్యత్తు రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో సీఎం స్టాలిన్‌

‘తమిళనాడు గెలుస్తుంది.. దేశానికే మార్గదర్శకం చేస్తుంది’ అని సీఎం స్టాలిన్‌ వ్యాఖ్యానించారు. తమిళనాడులో సంకీర్ణ ప్రభుత్వానికి చోటు లేదని స్పష్టం చేశారు. డీఎంకే ప్రభుత్వం కొనసాగితేనే రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తేల్చి చెప్పారు. ఇండియా టుడే నేతృత్వంలో చైన్నెలో బుధవారం తమిళనాడు– రౌండ్‌ టేబుల్‌ కార్యక్రమం జరిగింది. ఇందులో సీఎం స్టాలిన్‌ పాల్గొని.. పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

సాక్షి, చైన్నె : తమిళనాడులో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అన్ని పార్టీలు పోటా పోటీగా ఎన్నికల సమరానికి సమాయత్తం అవుతున్నాయి. ఈనేపథ్యంలో ఇండియా టుడే నేతృత్వంలో సాగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో సీఎం స్టాలిన్‌ వివిధ అంశాలపై స్పందించారు. ఆయన మాటల్లోనే.. ఇండియా టుడే కూడా తమిళనాడు ప్రజల మనసులో ఏముందో తెలుసుకోవాలనుకుంటోంది. ఓటర్స్‌ కంపెనీ నిర్వహించిన సర్వేలో ఇది స్పష్టంగా తెలిసి ఉంది. మీ సర్వే ప్రకారం, డీఎంకే కూటమి 45 శాతం మద్దతుతో ముందంజలో ఉంది. మాకు, రెండవ స్థానానికి మధ్య తేడాను చూడండి. ఇక్కడ జర్నలిస్టులు, రాజకీయ నాయకులు ఉన్నారు. కార్యకర్తలుగా ఉన్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు. మీకు తెలుసా...సింపుల్‌ లాజిక్‌ అంకగణితం ఇది. మూడు శాతం తేడాతో క్లీన్‌ స్వీప్‌ అన్నది జరిగింది. ఇప్పుడు 12 శాతం తేడా. అయితే, ఇది ఖచ్చితంగా బ్రహ్మాండ విక్టరీ అవుతుంది!. ఇందులో ఎటువంటి మార్పు ఉండదు. ఈ సర్వే ఫలితం మాకు ఓ బూస్ట్‌! ప్రజలతో ఎప్పటికీ ఉంటాం.. ప్రజల కోసం కృషి కొనసాగుతుంది. మరింత ఉత్సాహంగా పని చేస్తాం. మీ అంచనాలను నిజం చేస్తాం.. అని వివరించారు.

ఐదేళ్ల క్రితం తమిళనాడు పరిస్థితి ఎలా ఉండేది? ఇక్కడ అందరికీ అది తెలుసు. ఇప్పుడు ద్రవిడ మోడల్‌ ప్రభుత్వం ఏర్పడింది, ఈ ఐదు సంవత్సరాలలో చరిత్ర సృష్టించాం. తమిళనాడు విజయపథం వైపు పయనిస్తోంది. రాబోయే ఎన్నికల్లో గెలిచి ఈ అభివృద్ధి ప్రయాణాన్ని కొనసాగిస్తాం. ద్రవిడ మోడల్‌ 2.0 తో మన విజయ ప్రయాణాన్ని కొనసాగిస్తాం. మీడియా మిత్రులారా..రాజకీయ పరిశీలకులారా అని సంబోధిస్తూ, కొన్ని గణాంకాలతో తమిళనాడు ఆర్థిక వృద్ధి 11.19 శాతంకు చేరడం గురించి ఈ సందర్భంగా వివరించారు. రెండు అంకెల వృద్ధి అనేది 14 సంవత్సరాల క్రితం, అది కూడా డీఎంకే పాలనలోనే ఉండేది. ఆ తర్వాత తాజాగా మేం సాఽధించాం. తమిళనాడు జీఎస్టీ రూ. 17 లక్షల 23 వేల 698 కోట్లుగా నమోదైంది. తలసరి ఆదాయం రూ. 3. 58 లక్షలుగా ఉండి జాతీయ సగటుతో పోల్చి చూస్తే, 1.74 రెట్లు ఎక్కువ అన్నది గుర్తుంచుకోవాలి.

భారతదేశం అంతటా ప్రభుత్వ ఉన్నత మాధ్యమిక పాఠశాలల్లో సైనన్స్‌ ల్యాబ్‌లు 50 శాతం స్కూళ్లలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అదే తమిళనాడులో 98.3 శాతం పాఠశాలల్లో ప్రయోగశాలలు ఉన్నాయి. ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్స్‌ ప్రకారం టాప్‌ 100 కళాశాలల్లో తమిళనాడులో 10 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. నీతి ఆయోగ్‌ విడుదల చేసిన సూచికలో 78 పాయింట్లతో తమిళనాడు రెండవ స్థానంలో ఉంది. ఏ గణాంకాలు తీసుకున్నా కూడా తమిళనాడు అగ్రస్థానంలో ఉంది. అందుకే తమిళనాడుకు 65కి పైగా కేంద్ర ప్రభుత్వ అవార్డులు లభించాయి. ఐదేళ్లలో తమిళనాడు బ్రహ్మాండ ప్రగతి పథంలో దూసుకెళ్లింది. చరిత్ర సృష్టించే పథకాలు అమల్లోకి విజయవంతంగా తీసుకొచ్చాం. ద్రవిడ మోడల్‌పథకాలు, ప్రాజెక్టులను వివిధ రాష్ట్రాలు ఆదర్శకంగా తీసుకున్నాయి. అందరికీ నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందించాలి. ప్రతి నెలా ఒక కోటి 30 లక్షల మంది మహిళలకు రూ. 1000 నగదు అందజేస్తున్నాం.

ఈ సందర్భంగా ద్రావిడ మోడల్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని పథకాలను సీఎం వివరిస్తూ, డీఎంకే ప్రభుత్వం కొనసాగితేనే తమిళనాడు భవిష్యత్తు బాగుంటుందని స్పష్టం చేశారు. ప్రజలకు తనపై నమ్మకం ఉంది. ఎల్లప్పుడూ విశ్వాసానికి నిజాయితీగా నేను ఉంటాను. కష్ట పడిపనిచేస్తున్నాను. డీఎంకే ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే విధంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సంక్షోభాలను సృష్టిస్తున్నదో అందరికీ తెలుసు. ఆర్థిక కేటాయింపు, పన్ను కేటాయింపు, ప్రత్యేక ప్రాజెక్టులు, రైల్వే ప్రాజెక్టులకు ... ఇలా అన్నింటా అన్యాయం, ద్రోహం చేస్తున్నారు. ఇటీవల విడుదలైన బడ్జెట్‌లోనూ తమిళనాడుకు దక్కింది సున్నా. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. గవర్నర్‌ ద్వారా అనేక అడ్డంకులు.. అని పేర్కొంటూ, తాజాగా అవినీతి పరులందర్నీ ఒక చోట చేర్చి ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు. ఈ అవినీతి కూటమి పేరు డబుల్‌ ఇంజిన్‌ అంటా. ఇది ఓ డబ్బా ఇంజిన్‌.

బీజేపీ విషయానికొస్తే, ద్వేషాన్ని వ్యాప్తి చేస్తోంది. సమస్యలను సృష్టించి చలి కాచుకుంటోంది. ప్రజాస్వామ్య భారతదేశంలో కేంద్రంలో అధికారంలో ఉన్న వారితో హక్కుల కోసం గళాన్ని వినిపించడం, బంధం కోసం హస్తాన్ని అందించడం డీఎంకే నైజం. తమిళనాడుకు దక్కాల్సిన నిధులు, న్యాయం కచ్చితంగా లభిస్తాయి. మేం సాధిస్తాం.. తమిళనాడులో బీజేపీ ఫాసిస్ట్‌ రాజకీయాలకు ప్రజలే చరమ గీతాన్ని పాడుతారు. తమిళనాడులో ద్రావిడ మోడల్‌ 2.ఓ షురూ. ఇది దేశంలోనే నంబర్‌– 1 రాష్ట్రం అయిన తమిళనాడు గెలుస్తుంది. అది భారతదేశానికి మార్గనిర్దేశం చేస్తుంది.

ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్న స్టాలిన్‌

డీఎంకే కొనసాగితేనే భవిష్యత్తు..

బ్రహ్మాండ ప్రగతి..

అప్పటి.. ఇప్పటి పరిస్థితిని..

విద్వేషాలకు కుట్ర

ఈ కార్యక్రమంలో తమిళనాడులో సంకీర్ణ ప్రభుత్వం గురించి సందించిన ప్రశ్నకు సీఎం స్టాలిన్‌ ఇచ్చిన సమాధానం ఆసక్తికర చర్చకు దారి తీసింది. అందుకు ఇక్కడ చోటు లేదు. అధికారంలో వాటా అన్నది తమిళనాడుకు కలిసిరాదు. ఇది మాకు తెలుసు...వాళ్లకీ తెలుసు అని కాంగ్రెస్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. కూటమిలో కాంగ్రెస్‌ బంధం కొనసాగుతుంది. ఇతరులు ఆశిస్తున్నవి జరగవు అని సమాధానం ఇచ్చారు. దీనిపై టీఎన్‌సీసీ అధ్యక్షుడు సెల్వపెరుంతొగై స్పందిస్తూ, అధికారంలో వాటా విషయంగా ఏఐసీసీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. సీఎం వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అని పేర్కొన్నారు. అయితే, కాంగ్రెస్‌ ఎంపీ మాణిక్యం ఠాకూర్‌ స్పందిస్తూ, 2006 ఎన్నికలలో డీఎంకేకు మెజారిటీ లేదని, ఈ సమయంలో అధికారంలో వాటా విషయంగా కాంగ్రెస్‌ పెద్ద తప్పే చేసిందన్నారు. అయితే, తాజాగా ఆ తప్పు చేయబోమని, ఒక పార్టీ సంపూర్ణ మెజారిటీ పాలన లేదా కూటమి పాలన అన్నది ప్రజలే రానున్న ఎన్నికలలో నిర్ణయిస్తారని వ్యాఖ్యలు చేశారు. ఇక, జాతీయ నాయకుడు ప్రవీణ చక్రవర్తి స్పందిస్తూ, సంకీర్ణంలో తమిళ ప్రజలకు ఎలాంటి సమస్య లేదని, ఇతర రాష్ట్రాలు అధికారంలో వాటా ఇస్తుంటే, తమిళనాడు భయపడుతున్నది ఎందుకు..? అని ప్రశ్నించడం గమనార్హం.

సంకీర్ణ ప్రభుత్వానికి చోటు లేదు..! 1
1/1

సంకీర్ణ ప్రభుత్వానికి చోటు లేదు..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement