రంగంలోకి సీఈసీ
సాక్షి, చైన్నె: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నగారా మోగించేందుకు ముందుగా ఇక్కడి అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమావేశానికి కేంద్ర ఎన్నికల కమిషన్ సన్నద్ధమైంది. ఇందులో భాగంగా కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషన్(సీఈసీ) వర్గాలు చైన్నెలో పర్యటనకు రెడీ అయ్యారు. డిప్యూటీ కమిషనరన్ భాను ప్రకాష్ నేతృత్వంలోని బృందం బుధవారం చైన్నెకు చేరుకుంది. గురు, శుక్రవారం చైన్నెలో పర్యటించనుంది. నిబంధనల ప్రకారం రాష్ట్రంలో మే మొదటి వారంలో కొత్త ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టాల్సి ఉంది. ఈ దృష్ట్యా, ఏప్రిల్‌లో ఎన్నికలు ఒకే విడతగా ముగించే దిశగా ఎన్నికల యంత్రాంగం కసరత్తు మొదలెట్టింది. కొత్త ప్రభుత్వం కొలువుకు మరో రెండు నెలలే సమయం ఉండంతో ముందుగా అన్ని ప్రక్రియలను ముగించేందుకు రాష్ట్ర ఎన్నికల అధికారులు ఉరకలు తీస్తున్నారు. నగారా మార్చి మొదటి వారంలో మోగ వచ్చు అన్న చర్చ జరుగుతోన్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కమార్ ఆదేశాలతో డిప్యూటీ కమిషనర్‌భాను ప్రకాష్ నేతృత్వలోని బృందం రంగంలోకి దిగింది. బుధవారం రాత్రి చైన్నెకు చేరుకున్న ఈ బృందం గురు, శుక్రవారం సమావేశాలలో బిజీ కానుంది. తొలుత గుర్తింపు పొందిన రాజకీయ పక్షాల ప్రతినిధులతో, ఆ తదుపరి రాష్ట్ర ఎన్నికల ప్రధాన బృందం, జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో సమావేశానికి నిర్ణయించింది.
అంతలోపు రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించినఅంశాలతో సమగ్ర నివేదిక రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అర్చనా పట్నాయక్ సిద్ధం చేశారు. ముసాయిదా ఓటర్ల జాబితాలో పేర్లుగల్లంతైన వాళ్లు సుమారు 34.73 లక్షల మంది మళ్లీ దరఖాస్తు చేసుకున్నారు. వీరి దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేశారు. ముందుగా నిర్ణయించినట్టుగా ఈనెల 17న తుది ఓటరు జాబితాను ప్రకటించనున్నారు.


