ఘంటసాలకు ఘన నివాళి
కొరుక్కుపేట: తెలుగుజాతి గర్వించదగ్గ అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు 52వ వర్ధంతిని బుధవారం పెరంబూరులో నిర్వహించారు. చైన్నె పెరంబూరులోని తమిళనాడు తెలుగు సాంస్కృతిక సంఘం అధ్యక్షుడు తమ్మినేని బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఘంటసాల చిత్రపటానికి జనని ప్రధాన కార్యదర్శి గుడిమెట్ల చెన్నయ్య, గాయకుడు కిడాంబి లక్ష్మీకాంత్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తమ్మినేని బాబు మాట్లాడుతూ, తెలుగుజాతి గర్వించదగ్గ మహాగాయకుడు ఘంటసాల అని, సంగీతానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. లక్ష్మీ కాంత్ మాట్లాడుతూ, తమిళనాడు తెలుగు సాంస్కృతిక సంఘం, జనని సంస్థలు ఏటా ఘంటసాల జయంతి, వర్ధంతి కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయని తెలిపారు. జనని ప్రధాన కార్యదర్శి గుడిమెట్ల చెన్నయ్య మాట్లాడుతూ, ఘంటసాల ఎన్నో ఆధ్యాత్మిక, సాంఘిక, పౌరాణిక, విషాద గీతాలను మధురంగా ఆలపించి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని అన్నారు. ఆయనను స్మరించుకోవడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు.
సహకార సంఘాల
పోస్టుల సంఖ్యలో మార్పు
కొరుక్కుపేట: తమిళనాడు సహకార సంఘాలలో ఖాళీల పోస్టుల సంఖ్యలో మార్పులు చోటు చేసుకున్నట్లు నియామక విభాగం తెలిపింది. ఈ విషయంపై బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. వివరాలు.. సహకార సంఘాల రిజిస్ట్రార్ నియంత్రణలో పనిచేసే ప్రధాన కార్యాలయం, సహకార సంఘాలు, బ్యాంకులలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ , అసిస్టెంట్ పోస్టులను ప్రత్యక్ష నియామకం ద్వారా భర్తీ చేయడానికి సెప్టెంబర్ 13, 2025న నోటిఫికేషన్ జారీ చేశారు. వాటిలో, పరిపాలనా కారణాల దృష్ట్యా, తమిళనాడు రాష్ట్ర ప్రధాన సహకార బ్యాంకు, తమిళనాడు రాష్ట్ర సహకార వ్యవసాయం, గ్రామీణాభివృద్ధిలో ఖాళీల సంఖ్యను తాజాగా మార్చారు. ఆ విషయంలో, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వంలో బ్యాంక్ అసిస్టెంట్ పోస్టుకు 111 ఖాళీలు ఉన్నాయి. తమిళనాడు రాష్ట్ర సహకార వ్యవసాయం గ్రామీణాభివృద్ధి బ్యాంకులో అసిస్టెంట్ పోస్టులకు 65 ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు. తెలిపారు. అందువల్ల, రాష్ట్ర నియామక కేంద్రం ద్వారా అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ మొత్తం ఖాళీల నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ మేరకు కులాల వారీగా కోటా, ఆదాయం వారీగా ఖాళీ పోస్టులను ప్రతిపాదించనున్నట్టు అధికారులు తెలిపారు.
రైలు నుండి జారిపడి
దంపతుల మృతి
తిరువొత్తియూరు: పరిగెడుతున్న రైలు నుంచి జారి కింద పడిన కళ్లకురిచ్చికి చెందిన దంపతులు మృతి చెందారు. వివరాలు.. కళ్ళకురిచ్చి జిల్లా, అయ్యనార్ పాళయం గ్రామానికి చెందినవారు శివకండన్ (37). అతని భార్య కలైయరసి. వీరికి ముగ్గురు ఆడపిల్లలు. వీరంతా ముంబైలో ఉంటూ ఓ హోటల్‌లో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో అయ్యనార్ పాళయం గ్రామంలో జరిగిన బంధువుల ఇంటి కార్యక్రమంలో పాల్గొనేందుకు ముంబై నుండి కళ్లకురిచికి, ముంబై నుండి తిరునల్వేలికి వెళ్లే దాదర్ ఎక్స్‌ప్రెస్ రైలులో బయలుదేరారు. బుధవారం తెల్లవారుజామున ఆరణి పక్కన ఉన్న వడమాతిమంగళం ప్రాంతంలో రైలు వెళ్తున్నప్పుడు శివకండన్ తలుపు తెరిచి తలుపు ముందు నిలబడి చూస్తున్నట్లు సమాచారం. వెళ్తున్న రైలు నుంచి ప్రమాదవశాత్తూ జారిపడి పోయాడు. అతని కాపాడేందుకు యత్నించిన భార్య కలైయరసి కూడా పడిపోయింది. దీంతో ఇద్దరూ ఘటనా స్థలంలోనే మృతి చెందారు. తోటి ప్రయాణికులు కళంబూర్ రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. కాట్పాడి రైల్వే పోలీసులు శివకండన్, కలైయరసి మృతదేహాలను స్వాధీనం చేసుకుని వేలూరు ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
సెల్వకుమార్‌కు పదవి
సాక్షి, చైన్నె : టీవీకే నేత విజయ్ మాజీ మేనేజర్, సన్నిహితుడు పిటీ సెల్వకుమార్‌కు డిఎంకేలో పదవి అప్పగించారు. డీఎంకే ట్రేడర్స్ వింగ్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలను అప్పగిస్తూ డీఎంకే అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఇటీవల కాలంగా అన్నాడీఎంకేతో పాటుగా పలు పార్టీల నుంచి డీఎంకేలో చేరిన కీలక నేతలకు పదవులు అప్పగిస్తూ డీఎంకే కార్యాలయం బుధవారం ప్రకటించింది. ఇందులో సెల్వకుమార్‌కు ట్రేడర్స్ వింగ్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి పదవిని, అన్నాడీఎంకే మాజీ ఎమ్మెల్యేసుబ్బరత్నంకు డీఎంకే న్యూస్ రూమ్ మేనేజర్ బాధ్యతలు, మాజీ ఎమ్మెల్యే బాల గంగాధరన్‌కు వర్తక విభాగం డిప్యూటీ చైర్మన్ పదవి, సురేష్‌కుమార్‌కు కార్యదర్శి పదవి అప్పగించారు. మరి కొందరికి సైతం పదవులు కేటాయించారు.


