ఒకే వేదికపై మూడు వేడుకలు
తమిళసినిమా: ప్రముఖ బిల్డర్ ఎంఎస్ మూర్తి దర్శక నిర్మాతగా పరిచయం అవుతూ కథ, కథనం, మాటలు, పాటలు, సంగీతం బాధ్యతలను నిర్వహిస్తూ మిత్ర పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నిర్మిస్తున్న తొలి చిత్రం 99/66. హర్రర్, థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం ద్వారా హార్ట్ బీట్ వెబ్ సీరీస్ ఫేమ్ శబరి, రోహింద్ రచిత మహాలక్ష్మి హీరో హీరోయిన్‌గా నటించారు. శ్వేత, పవన్‌కృష్ణ, కేఆర్ విజయ, కేఎస్ వెంకటేష్, ఎస్.స్నేహ, కుమారి కనిష్క ,శ్రీలేఖ, బుజ్జి బాబు, సింగం పులి పోషించిన ఈ చిత్రానికి క్రియేటివ్ దర్శకుడిగా రవి భార్గవన్ వ్యవహరిస్తున్నారు. కాగా దీనికి సెవిలో రాజాచాయాగ్రహణం అందించారు. త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతున్న ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని శనివారం సాయంత్రం స్థానిక నుంగంబాక్కంలోని వళ్లువర్ కోటంలో నిర్వహించారు. నిర్మాత కలైపులి ఎస్.థాను, జ్ఞానసంబంధం, మురళీ రామస్వామి, దర్శకుడు ఆర్‌వీ ఉదయ్‌కుమార్, పేరరసు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 99/66 చిత్ర ఆడియోను నిర్మాత కలైపులి ఎస్.థాను ఆవిష్కరించారు. శనివారం నిర్మాత ఎంఎస్ మూర్తి సతీమణి పుట్టినరోజు కావడంతో ఇదే వేదికపై ఆమె చేత కేక్ కట్ చేయించి జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఎంఎస్ మూర్తి మరో చిత్రాన్ని కూడా స్వీయ దర్శకత్వంలో నిర్మించనున్నారు. దానికి హస్కీహౌస్ అనే టైటిల్ ను నిర్ణయించారు. ఈ చిత్ర టైటిల్, టీజర్‌లను ఇదే వేదికపై ఆవిష్కరించారు. అనంతరం 99 / 66 చిత్రం నుంచి ముఖ్య అతిథులు ప్రసంగించారు. ఎమ్మెస్ మూర్తి మాట్లాడుతూ తాను చేసిన తొలి ప్రయత్నం ఈ చిత్రమని, తనకు తెలిసింది చేశానని, చిత్రం సంతృప్తిగా వచ్చిందని అన్నారు.


