వీనుల విందుగా అన్నమయ్య అఖండ గానం
కొరుక్కుపేట: చైన్నెకి చెందిన సుశృతి ఆధ్యాత్మిక బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన 13వ వార్షిక అన్నమయ్య అఖండ గాన కార్యక్రమం సంగీత ప్రియులను అలరించింది. చైన్నె ఆళ్వారుపేటలోని యతి రాజ కల్యాణ నిలయంలో ఆదివారం నిర్వహించిన ఈ సంగీత కార్యక్రమంలో దశావతారాలు, గోదాదేవి ప్రతిమలు, అన్నమయ్య చిత్రాలతో ఆధ్యాత్మిక శోభ తలపించేలా వేదికను అలంకరించారు. ఉదయం 5 గంటలకు లక్ష్మి అష్టోత్తరం, విష్ణుసహస్ర నామపారాయణం, తిరుప్పావై, రామాయణాలను భక్తిశ్రద్ధలతో ఆలపించారు. సుశృతి సంస్థ అధ్యక్షులు, ప్రముఖ నాట్యకళాకారుడు అద్దేపల్లి బాలాజీ అధ్యక్షతన ఉదయం 6గంటలకు ప్రేమా ఉపేంద్ర గుప్తా, సుశృతి వ్యవస్థాపకులు దివంగత టి.ఉపేంద్ర గుప్తా చిత్రపటానికి పూలుచల్లి నివాళులర్పించి అఖండ ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సాగిన ఈ అఖండగానంలో తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాలతో పాటు విదేశాలకు చెందిన 60కి పైగా కళాకారుల బృందాలు పాల్గొని అన్నమాచార్య కీర్తనలను శ్రావ్యంగా ఆలపించారు. గానం, వీణా, వయోలిన్, కీబోర్డు, భరతనాట్యం, కోలాట ప్రదర్శనలతో పద కవితా పితామహుడైన అన్నమయ్యకు నీరాజనం పలికారు. ఈ సందర్భంగా అద్దేపల్లి బాలాజీ మాట్లాడుతూ, అఖండగానం కార్యక్రమాన్ని గత 13 యేళ్లుగా నిర్వహిస్తూ అన్నమయ్య కీర్తనలను కళాకారులు, సంస్థ సభ్యుల సమిష్ట కృషితో ప్రజల్లోకి తీసుకెళుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకురాలు జి.వైష్ణవి, జి.సంజయ్కుమార్, నిర్వాహకులు ఆర్.శ్రీమతి, జి.రాజేశ్వరి, పి.రేవతి, జె.విజయలక్ష్మి, మీరా ప్రభాకర్, మీరా శేఖర్, కె.సుకన్య, ప్రముఖులు చిన్ని రమేష్ బాబు, కంచర్ల రాజేంద్ర, కంకిపాటి శ్రీరామచంద్ర, నామా సతీష్ కుమార్, ఇమ్మిడి కిషోర్ దంపతులు పాల్గొన్నారు.


