గత ఏడాది ఆశాజనకంగా లేదు కానీ..!
తమిళసినిమా: పరిశ్రమకు చెందిన ప్రతి ఒక్కరూ తమ చిత్రాలు విజయవంతం కావాలనే కోరుకుంటారు. అందుకోసమే శ్రమిస్తుంటారు. అయితే జయాపజయాలు ఎవరి చేతుల్లోనూ ఉండవు. ఒక్కో సారి బాగున్న కథా చిత్రాలు కూడా ప్రజాదరణకు నోచుకోవడంలో విఫలం అవుతుంటాయి. అందుకు పలు కారణాలు ఉండవచ్చు. నటి త్రిష విషయానికే వస్తే కథానాయకిగా స్వర్ణోత్సవానికి చేరువవుతున్నారు. తమిళం,తెలుగు,కన్నడం,మలయాళం,హిందీ భాషల్లో నటించి పాన్ ఇండియా కథానాయకిగా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ మధ్యలో నటిగా కాస్త స్ట్రగుల్ పడి అవకాశాలకు దూరం అయ్యారు. అలాంటి తరుణంలో మణిరత్నం రూపంలో పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో నటించే అవకాశం వరించి సెకెండ్ ఇన్నింగ్ ను ప్రారంభించారు. ఆ తరువాత విజయ్, అజిత్, కమలహాసన్ వంటి ప్రముఖ హీరోలతో జత కట్టారు. అదే విధంగా మలమాళంలో మోహన్‌లాల్, తెలుగులో చిరంజీవి వంటి ప్రముఖ హీరోలతో నటించే అవకాశాలను అందుకున్నారు. అయితే గత ఏడాది త్రిష నటించిన చిత్రాల్లో అజిత్‌కు జంటగా నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ మినహా ఇతర చిత్రాలు ఆశించిన విజయాలను అందుకోలేకపోయాయి. ముఖ్యంగా అజిత్‌కు జంటగా నటించిన మరో చిత్రం విడాముయర్చి, కమలహాసన్‌తో కలిసి నటించిన థగ్ లైఫ్ చిత్రాలు పూర్తిగా నిరాశ పరిచాయి. కాగా ప్రస్తుతం త్రిష మార్కెట్ డల్‌గా ఉందని చెప్పక తప్పదు. కాగా ఈమె సూర్యకు జంటగా నటించిన కరుప్పు చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్రం సమ్మర్ స్పెషల్‌గా తెరపైకి రానుంది. అదేవిధంగా తెలుగులో చిరంజీవి సరసన నటిస్తున్న విశ్వంభర చిత్రం కూడా చిత్రీకరణను పూర్తి చేసుకుని ప్రస్తుతం గ్రాఫిక్స్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ చిత్రం కూడా మార్చి నెలలో విడుదలకు సిద్ధం అవుతోంది. అదేవిధంగా మలయాళంలో మోహన్‌లాల్ కు జంటగా రామ్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇవన్నీ గత ఏడాది, అందకు ముందు ఏడాది అంగీకరించిన చిత్రాలు అన్నది గమనార్హం. దీంతో త్రిష కొత్తగా ఒప్పుకున్న చిత్రాలు లేవన్నది గమనార్హం. అయితే ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నట్లు సమాచారం. నాలుగు పదుల వయసు దాటిన ఈ పెళ్లి కాని నటికి తాజాగా మరో రెండు చిత్రాల్లో నటించే అవకాశం వచ్చిందని, వాటికి సంబంధించిన చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఏదేమైనా, ఈ సంచలన నటికి అర్జెంట్‌గా ఒక మంచి హిట్ అవసరం అని చెప్పక తప్పుదు.
గత ఏడాది ఆశాజనకంగా లేదు కానీ..!


