క్లుప్తంగా
విద్యుత్ కంచెలో చిక్కుకుని కొత్త వరుడి మృతి
తిరువొత్తియూరు: అరక్కోణం సమీపంలో కుందేళ్ల వేటకు వెళ్లిన కొత్త అల్లుడు విద్యుత్ కంచెలో చిక్కుకుని దారుణంగా మృతి చెందాడు. వివరాలు.. రాణిపేట జిల్లా అరక్కోణం సమీపంలోని తనిగైపోలూరు ప్రాంతంలో నరికురవర్లు వద్ద పలు కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ ప్రాంతానికి చెందిన వెంకటేశన్ (30)కి రూపా (20)కి ఇటీవల వివాహమైంది. ఈ నేపథ్యంలో వెంకటేశన్ సోమవారం రాత్రి అదే ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల ఇద్దరు మైనర్లతో కలిసి ఉళియమ్పాక్కం ప్రాంతంలో కుందేళ్ల వేటకు వెళ్లాడు. ఆ సమయంలో అక్కడ ఉన్న చెరువు దగ్గర ఉన్న వ్యవసాయ భూమి చుట్టూ, అడవి పందుల బెడదను నివారించడానికి విద్యుత్ కంచెలో చిక్కుకుని విద్యుత్ షాక్‌తో మరణించాడు. మరో బాలుడికి గాయాలయ్యాయి. స్థానిక పోలీసులు మంగళవారం తెల్లవారుజామున సంఘటనా స్థలానికి వెళ్లి వెంకటేశన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం అరక్కోణం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
తిరుత్తణి హుండీ ఆదాయం రూ.91లక్షలు
తిరుత్తణి: తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయ హుండీ ఆదాయం రూ. 91లక్షలు లభించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామికి రోజూ వేలాది మంది భక్తులు వచ్చి స్వామి దర్శనం చేసుకుని తమ మొక్కులు చెల్లించే విధంగా హుండీల్లో కానుకలు చెల్లిచడం పరిపాటి. డిసెంబర్ 31న మెట్లోత్సవం, జనవరి 1 నూతన సంవత్సర వేడుకల్లో భారీ సంఖ్యలో భక్తులు స్వామి దర్శనం చేసుకున్నారు.ఈ క్రమంలో చివరి పది రోజుల్లో భక్తులు చెల్లించిన కానుకలను మంగళవారం లెక్కించారు. ఆలయ జాయింట్ కమిషనర్ రమణి సమక్షంలో హుండీలు తెరిచి వసంత మండపంలో వంద మంది ఆలయ సిబ్బంది లెక్కించారు. నగదుగా రూ.91, 26,144, 144 గ్రాముల బంగారం, 2,422 గ్రాముల వెండిని భక్తులు కానుకలుగా సమర్పించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. మొత్తాన్ని ఆలయ ఖాతాలో బ్యాంకులో జమచేసినట్లు వారు చెప్పారు.
ఆధునిక విధానంలో
క్యాన్సర్‌కు శస్త్ర చికిత్స
సాక్షి, చైన్నె: క్యాన్సర్‌తో బాధ పడుతున్న 41 ఏళ్ల వ్యక్తికి అధునాతన శస్త్ర చికిత్స విధానాన్ని ఎంజీఎం క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ విజయవంతం చేసింది. నాలుక ముందు భాగం, నోటి అడుగు భాగం, హైయోయిడ్ ఎముక వరకు విస్తరించి ఉన్న క్యాన్సర్ కణితి కొత్త విధానంతో తొలగించారు. రోగికి నియో అడ్జువాంట్ కీమోథెరఫితో చికిత్స అందించారు. తర్వాత ఉచిత ఫ్లాప్ పునర్ నిర్మాణంతో సంక్లిష్ట మిశ్రమ విచ్చేదనం శస్త్ర చికిత్సను చేశారు. అఅనంతరం రేడియేషన్ థెరఫిని అందించారు. నాలుక క్యాన్సర్(స్క్వామస్ సెల్ కార్సినోమా)తో ఈ వ్యక్తి బాధ పడుతున్న తమ పరిశోధనలో తేలిందని ఎంజీఎం మెడికల్ ఆంకాలజి డైరెక్టర్ డాక్టర్ ఎంకే రాజా , సీనియర్ కన్సల్టెంట్‌లు డాక్టర్ శివరామ్ గణేశ్, డాక్టర్ మణి కండన్ వెంకటసుబ్రమణియన్, ఎ. శివకుమార్ నేతృత్వంలోని బృందం మంగళవారం ప్రకటించింది. సంక్లిష్టమైన ఈ శస్త్ర చికిత్సకు ఆధునిక విధానం అనుసరించామన్నారు. ఫ్రీ ఫ్లాప్ పునర్ నిర్మాణం అనేక అధునాతన సాంకేతికతను ఉపయోగించి నాలుక, నోటిని పునర్ నిర్మించడం జరిగిందన్నారు.మల్టీ డిసిప్లినరీ ట్యూమర్ బోర్డు సిఫారసుతో శస్త్ర చికిత్సలు, ఇతర థెరపీలను అందించామని వివరించారు.
పళ్లిపట్టులో నేడు
బహిరంగ వేలం వాయిదా
పళ్లిపట్టు: పళ్లిపట్టు టౌన్ పంచాయతీలో బుధవారం ఉదయం నిర్వహించేందుకు ప్రకటించిన బహిరంగ వేలం అనివార్య కారణాలతో వాయిదా వేస్తున్నట్లు పట్టణ పంచాయతీ కార్యనిర్వహణాధికారి తెలిపారు. వివరాలు.. పళ్లిపట్టు టౌన్ పంచాయతీ ద్వారా వారపు సంత, డైలీ మార్కెట్, బస్టాండులో వాహనాల సుంఖం వసూలుకు సంబంధిచి గత 3న పట్టణ పంచాయతీ ద్వారా బహిరంగ ప్రకటన విడుదల చేశారు. బుధవారం (07.01.26)న వారపు సంత, డైలీ మార్కెట్, వాహనాల సుంఖం వసూలకు సంబంధించి బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు వేలం పాటలో పాల్గొనేందుకు వీలుగా పంచాయతీ పేరిట ముందస్తుగా వారపు సంత వేలంకు రూ. 5 లక్షలు, డైలీ మార్కెట్‌కు రూ. 4 లక్షలు, వాహనాల సుంకం వసూలుకు డీడీ రూపంలో చెల్లించాలని ప్రకటించారు. ఈక్రమంలో బుధవారం నిర్వహించాల్సిన బహిరంగ వేలం అనివర్య కారణాలతో వాయిదా వేస్తున్నట్లు పట్టణ పంచాయతీ కార్యనిర్వహణాధికారి రాజకుమార్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
క్లుప్తంగా


