మైలాపూర్ ఫెస్టివల్‌కు సన్నద్ధం
సాక్షి, చైన్నె: చైన్నెలో ప్రసిద్ధి చెందిన మైలాపూర్ పరిసరాల వైభవాన్ని చాటే విధంగా మైలాపూర్ సన్నద్ధమయ్యారు. జనవరి 8 నుంచి 11వ తేదీ వరకు ఈ వేడుకలు జరగనున్నాయి. మైలాపూర్ చారిత్రాత్మకత, వారసత్వాన్ని, గొప్ప సాంస్కృతికత, శాసీ్త్రయ సంగీతం, నృత్యం, పోటీలు, కోలం కళ, వీధి నాటకం, సాంప్రదాయ చేతి వృత్తి కళాకారుల ప్రతిభను చాటే ప్రదర్శనలకు వేదికగా ఈ ఫెస్టివల్ మారనున్నది. ఈ ఉత్సవం మైలాపూర్ స్ఫూర్తికి ప్రజా ప్రదేశాలలో జీవం పోసే విధంగా ఐకానిక్ వేదికలను ఎంపిక చేశారు. ఈ ఉత్సవంలో సుందరం ఫైనాన్స్ 2026లో బ్లూగ్రీన్ పేరిట మైలై లో నడకను ప్రోత్సహించే కొత్త చొరవకు శ్రీకారం చుట్టనుంది. మైలాపూర్ ఫెస్టివల్‌లో భాగంగా సుందరం ఫైనాన్స్, ఉఊఐ (ఎన్విరాన్‌మెంటల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా) ఒక ప్రత్యేకమైన సుస్థిరత కార్యక్రమాన్ని ప్రారంభించనున్నాయి. గ్రో యువర్ ఫుడ్ చొరవ కింద పౌరులకు స్వచ్ఛంద సేవకులు వారి స్వంత కిచెన్ గార్డెన్‌లను ఏర్పాటు చేసుకోవడానికి శిక్షణ ఇవ్వనున్నారు. వర్క్‌షాప్‌లను నిర్వహించనున్నారు. ప్లాస్టిక్ సంచులకు నో చెప్పండి నినాదంతో 10 వేల వస్త్ర సంచుల పంపిణీ, ప్లాస్టిక్‌కు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మైలాపూర్‌ను శుభ్రంగా ఉంచండి నినాదంతో ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. జనవరి 8 నుంచి 11వ తేదీ వరకు ఉదయం 7 నుండి 8 గంటల వరకు శ్రీకపాలీశ్వరర్ ఆలయంలో కచేరీలు, గాత్ర, వాయిద్య కచేరీలను కూడా నిర్వహించనున్నారు. జనవరి 10, 11 తేదీల్లో మైలాపూర్‌లోని లేడీ శివసామి అయ్యర్ స్కూల్‌లో ఉదయం 8 నుండి 11 గంటల వరకు 8, 10, 12 సంవత్సరాల్లోపు పిల్లల కోసం చెస్ టోర్నమెంట్ జరుగనుంది. అలాగే 8 నుండి 12 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లల కోసం ఆర్ట్–క్రాఫ్ట్ వర్క్‌షాప్ కూడా నిర్వహించనున్నారు. సుందరం ఫైనాన్స్ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ లోచన్ ఈ ఫెస్టివల్‌కు సంబంధించిన వివరాలను, జెర్సీలను శనివారం స్థానికంగా విదుదల చేశారు. సంస్కృతిని చాటే ఈ పండుగ 22 ఏళ్లు నిరంతరం కొనసాగుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ ఉత్సవాలలో జరిగే వివిధ పోటీలలో విజేతలకు జనవరి 11వ తేది బహుమతులను ప్రదానం చేయనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మైలాపుర్ ఫెస్టివల్ డైరెక్టర్ విన్సెంట్ డిసౌజా, సుందరం ఫైనాన్స్ ఎండీ రాజీవ్ లోచన్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మోహన్ వెంకటేశన్ పాల్గొన్నారు.


