హఠాత్తుగా చిన్నారి మృతి
అన్నానగర్: మధురైలోని తిరునగర్ ప్రాంతానికి చెందిన అరవిందన్ భార్య గాయత్రి (28). ఇద్దరూ చైన్నెలోని ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తున్నారు. వీరికి 2.6 నెలల క్రితం ఒక ఆడపిల్ల పుట్టింది. దీని తర్వాత గాయత్రి బిడ్డతో మధురైలోని తన తల్లిదండ్రుల ఇంటికి వచ్చింది. గురువారం రాత్రి, ఆమె బిడ్డకు పాలిచ్చి, ఊయలలో నిద్రపుచ్చింది. శుక్రవారం ఉదయం ఆమె చూసేసరికి, బిడ్డ కదలకుండా పడి ఉంది. దిగ్భ్రాంతితో వెంటనే శిశువును ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. మార్గమధ్యలోనే శిశువు చనిపోయిందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
బస్సు కిందపడి
యువకుడి బలవన్మరణం
అన్నానగర్: కోయంబత్తూరులో, గాంధీపురం బస్టాండ్ నుండి గురువారం సాయంత్రం ఒక ప్రైవేట్ బస్సు వస్తోంది. ఆ సమయంలో కాట్టూర్ పోలీస్ స్టేషన్ సమీపంలో రోడ్డు పక్కన 30 ఏళ్ల యువకుడు నిలబడి ఉన్నాడు. అతను అకస్మాత్తుగా బస్సు కిందకు దూకాడు. దానిని చూసి షాక్ అయిన డ్రైవర్ బ్రేక్ వేయడానికి ప్రయత్నించాడు. అప్పటికే బస్సు వెనుక చక్రం ఆ యువకుడిపై ఎక్కి దిగింది. రెప్పపాటులో జరిగిన ఈ సంఘటనలో యువకుడి తల నుజ్జునుజ్జయి, రక్తస్రావంతో సంఘటన స్థలంలోనే మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి అతని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ అస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి ఆ యువకుడు ఎవరు, ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడని విచారణ చేస్తున్నారు.
ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి
అన్నానగర్: నూతన సంవత్సర వేడుకలో ఏడేళ్ల బాలికను కిడ్నాప్ చేసి లైంగిక దాడి చేసిన యువకుడిని ప్రజలు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా గురువారం చైన్నెలోని లౌడ్ స్పీకర్లు, నృత్య పాటలతో జరుపుకోవడానికి గుమిగూడారు. ఈ సందర్భాన్ని ఆసరాగా చేసుకుని, అదే ప్రాంతానికి చెందిన 29 ఏళ్ల మదివానన్ అనే వ్యక్తి ఆ ప్రాంతానికి చెందిన ఏడేళ్ల బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసినట్లు తెలుస్తోంది. బాలిక కేకలు విన్న స్థానికులు పరిగెత్తుకుంటూ వచ్చి రక్తస్రావం అవుతున్న బాలికను రక్షించి ఆసుపత్రికి తరలించారు. వారు మదివానన్‌ను కొట్టి, తన్ని తిరుమంగళం ఆల్ ఉమెన్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి మదివానన్‌ను అరెస్టు చేసి జైలుకు పంపారు. గతంలో పోలీసుల నుండి తప్పించుకునే ప్రయత్నంలో మదివానన్ కిందపడిపోవడంతో అతని చేయి విరిగిందని పోలీసులు తెలిపారు. మదివానన్‌కి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
పీఎంకే నేత ఆత్మహత్య
తిరువళ్లూరు: అప్పుల బాధ తాళలేక పీఎంకే నేత ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. తిరువళ్లూరు జిల్లా కుప్పమ్మసత్రం గ్రామానికి చెందిన శశికుమార్(36). పీఎంకేలో జిల్లా కార్యనిర్వాహక సభ్యుడిగా కొనసాగుతున్నాడు. ఇతనికి భార్య మైథిలితో పాటు కుమార్తె వున్నారు. ప్రయివేటు కంపెనీలో పనిచేస్తున్న శశికుమార్, ఇటీవల అనారోగ్యానికి గురికావడంతో మంచానికే పరిమితమైయ్యాడు. ఇతను రూ.80 లక్షల మేరకు అప్పు చేశాడు. అయితే అప్పులు తిరిగి చెల్లించడంలో ఆలస్యం కావడంతో ఇతనిపై ఒత్తిడి పెరిగింది. దీంతో మనస్తాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. అపస్మారక స్థితిలో పడిపోయిన శశికుమార్‌ను తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం చైన్నె వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
యువకుడి ఆత్మహత్య
అన్నానగర్: ప్రేమ విఫలమైందని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చైన్నె, వేలచ్చేరిలోని అంబికా వీధికి చెందిన ముఖేష్ (19). ఇతను తరమణిలోని పాలిటెక్నిక్‌లో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఇతని తల్లి దుబాయ్‌లో పనిచేస్తోంది. దీంతో ముఖేష్ తన అమ్మమ్మ ఇంట్లో నివసిస్తున్నాడు. ముఖేష్ ఒక యువతిని ప్రేమించాడని, ఆ తర్వాత ఆ యువతి అతన్ని మోసం చేసిందని తెలుస్తుంది. దీనితో మనస్తాపం చెందిన ముఖేష్ గురువారం సాయంత్రం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వేలచ్చేరి పోలీసులు కేసు నమోదు చేసి ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు.
కొండ చిలువ కలకలం
తిరువొత్తియూరు: చైన్నె తిరువొత్తియూరు విమ్కో నగర్ రాజీవ్ గాంధీ నగర్‌లో నివాసం ఉంటున్న శేఖర్ ఇంట్లోకి కొండచిలువ ఒకటి దూరింది. దీన్ని చూసి దిగ్భ్రాంతి చెందిన చుట్టుపక్కల వారు పామును పట్టుకోవడానికి ప్రయత్నించగా, అక్కడే ఉన్న అండర్‌గ్రౌండ్ డ్రైనేజీలోకి వెళ్లింది. ఫైర్ సిబ్బంది కొండచిలువను చాకచక్యంగా పట్టుకున్నారు.


