దంపతుల సజీవ దహనం
వేలూరు: సెంగం సమీపంలో గుడిసెలో గాఢ నిద్రలో ఉన్న రైతుతోపాటు ఆయన రెండో భార్యపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన సంఘటన ఆ ప్రాంతంలో సంచలనం రేపింది. వివరాల్లోకి వెళితే తిరువణ్ణామలై జిల్లా సెంగం సమీపంలోని పక్రిపాళ్యం గ్రామానికి చెందిన శక్తివేల్(51) వ్యవసాయంతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఇతని భార్య తమిళరసి, ఇద్దరి మద్య మనస్పర్థల కారణంగా గత మూడు సంవత్సరాల క్రితం విడి పోయారు. దీంతో శక్తివేల్ తీర్థాండపట్టు గ్రామానికి చెందిన అమృదం(44)ను రెండవ వివాహం చేసుకొని జీవిస్తున్నారు. బార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఆ ప్రాంతంలో ఒక వ్యవసాయ భూమిని లీజుకు తీసుకొని వ్యవసాయం చేసుకొని జీవిస్తున్నారు. వ్యవసాయ భూమిలో గుడిసెను వేసుకొని వాటిలోనే జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో శక్తివేల్, అమృదం ఇద్దరూ గురువారం రాత్రి వ్యవసాయ భూమిలోని గుడిసె ఇంటిలో నిద్రించారు. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు గుడిసె ఇంటికి ముందు పక్కన ఉన్న తలుపులు మూసి వేసి గుడిసైపె పెట్రోల్‌ను పోసి నిప్పు పెట్టారు. పెట్రోల్ పోయడంతో ఉన్నపళంగా మంటలు చెలరేగాయి. గాఢ నిద్రలో ఉన్న శక్తివేల్ ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ తలుపులు మూసి వేయడంతో బయటకు వచ్చేందుకు కుదరలేదు. దీంతో మంటల్లో చిక్కుకొని ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం స్థానికులు గమనించగా గుడిసె మంటల్లో చిక్కుకొని దంపతులు ఇద్దరూ కాలి బూడిదగా మారి ఉండడాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందజేశారు. సెంగం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద స్థలానికి చేరుకొని విచారణ చేస్తున్నారు. గుడిసె ఇంటికి ఎవరు నిప్పు పెట్టారు, ఎందుకు పెట్టారు, పాత కక్షలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.


