నీలగిరుల్లో కుండపోత
సేలం: నీలగిరి జిల్లాలో గురువారం రాత్రి కుండపోత వర్షం కురిసింది. అనేక చోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి. మెట్టుపాళయం–కూనూర్–ఊటీ మధ్య వివిధ ప్రదేశాల్లో రైల్వే పట్టాలపై రాళ్లు, కొండ చరియలు విరిగిపడ్డాయి. అదనంగా, చెట్లు పట్టాలకు అడ్డంగా పడి రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. మెట్టుపాళయం–కూనూర్–ఊటీ మధ్య నీలగిరి పర్వత రైల్వే మార్గంలో నడిచే హాలిడే స్పెషల్ రైళ్లు సహా అన్ని రైలు సర్వీసులు రద్దు చేశారు. రైలు సేవలను తిరిగి ప్రారంభించడానికి పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. కున్నూరు–ఊటీ మార్గంలో అనేక చోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి. ఎక్కడికక్కడ వాహనాలు ఆగిపోయాయి. కొండచరియలు విరిగి పడడంతో నాలుగు కార్లు, మూడు లారీలు దెబ్బ తిన్నాయి. అయితే, ఎవ్వరికి ఎలాంటి గాయాలు కాలేదు. ఈమార్గంలో ఆగిన రవాణాను పునరుద్ధరించే విధంగా అధికారులు చర్యలు చేపట్టారు. కొన్ని గంటల వ్యవధిలో నీలగిరి వ్యాప్తంగా సరాసరిగా 20 సె.మీ వర్షం పడడంతోనే జనజీవనం శుక్రవారం స్థంబించినట్లైంది. కున్నూరులో సైతం 20 సె.మీ వర్షం పడింది. ఇక, పశ్చిమ కనుమలలో వర్షాలు కొనసాగుతున్నాయి. తెన్‌కాశి కుట్రాలం జలపాతం పొంగి పొర్లుతుండడంతో స్నానానికి నిషేధం విధించారు. పశ్చిమకనుమల వెంబడి ఉన్న దిండుగల్, తేని, నీలగిరి, కోయంబత్తూరు, తెన్‌కాశి, తిరునల్వేలి, కన్యాకుమారిలలో శనివారం నుంచి మరింతగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. ఉపరితల ఆవర్తనం బంగాళాఖాతంలో తమిళనాడు తీరానికి సమీపంలో ఉండడంతోనే వర్షాలు పడుతున్నాయని, మరింతగా కొద్ది రోజులపాటు వర్షాలను ఎదురు చూడవచ్చని వాతావరణ కేంద్రం ప్రకటించింది.
నీలగిరుల్లో కుండపోత


