ఐఐటీ మద్రాసు గ్లోబల్ ఆవిష్కరణ
– అంతర్జాతీయ వర్సిటీ లక్ష్యంగా కార్యాచరణ
సాక్షి, చైన్నె: ప్రపంచంలోనే తొలి బహుళ జాతీయ వర్సిటీగా మార్చే లక్ష్యంగా ఐఐటీ మద్రాసు గ్లోబల్‌ను ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ పరిశోధన, ఆవిష్కరణ, స్టార్టప్, విద్యా సహకారాలతో ప్రపంచ వ్యాప్ట నెట్‌వర్క్‌తో ఈ గ్లోబల్ రీసెర్చ్ ఫౌండేషన్ వ్యవహరిస్తుందని ప్రకటించారు. శుక్రవారం ఐఐటీ మద్రాసు ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఐఐటీఎం ఫెస్టివల్ ఫోర్ట్ నైట్‌ను కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ప్రారంభించారు. ఇందులో ఓపెన్ హౌస్‌ను ఏర్పాటు చేశారు. శాస్త్ర 2026 శుక్రవారం నుంచి ఈనెల 6 వరకు , సారంగ్–2026 జనవరి 8 నుంచి 12వ తేదీ వరకు జరగనున్నాయి. కార్యక్రమానికి ఐఐటీ మద్రాసు డైరెక్టర్ వి.కామకోటి, డీన్ ప్రొఫెసర్ రఘునాథన్ రంగస్వామి, గ్లోబల్ రీసెర్చ్ ఫౌండేషన్ సీఈఓ మాధవ్ నారాయణ్, అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు హాజరయ్యారు.
అగ్రగామిగా ఐఐటీ మద్రాసు: జై శంకర్
కేంద్ర మంత్రి జైశంకర్ మాట్లాడుతూ, దేశంలో ఉన్నత విద్యకు అగ్రగామి సంస్థగా ఐఐటీ విస్తృత గుర్తింపు దక్కించుకుందన్నారు. విద్య, పరిశోధన, ఆవిష్కరణల్లో ప్రపంచ స్థాయిలోకి వెళ్లే దిశగా ఐఐటీఎం గ్లోబల్‌ను ఒక వ్యూహాత్మక, స్థిరమైన స్కేలబుల్ వేదికగా తీర్చిదిద్దారని వివరించారు. భారత విదేశాంగ విధానం, దౌత్య పరంగా సమస్యలను పరిష్కరించడం, పోటీతత్వ బలాలను ఇతర సంస్థలు, అవకాశాలు ఉపయోగించేందుకు వీలుంటుందన్నారు. టాంజానియాలోని ఐఐటీ మద్రాసు క్యాంపస్ అనేది భారత విదేశాంగ విధానం, సామర్థ్యాలను ఉపయోగించుకుని భారీ ప్రభావాన్ని చూపించేందుకు ఒక మార్గంగా వ్యాఖ్యలు చేశారు. భారత్‌ను ఎవ్వరూ నిర్దేశించలేరని, ఉగ్రవాదం నుంచి ప్రజలను రక్షించే బాధ్యత భారత ప్రభుత్వానికి ఉందన్నారు. అంతర్జాతీయ చట్టాలు, పద్దతలను గౌరవిస్తామని పేర్కొంటూ, టెక్నాలజీ కోసం విదేశాలపై ఆధార పడే పరిస్థితి పోయిందన్నారు. ఐఐటీ మద్రాసు డైరెక్టర్ ప్రొఫెసర్ వి.కామకోటి మాట్లాడుతూ, ఐఐటీఎం గ్లోబల్ రీసెర్చ్ ఫౌండేషన్ అనేది అంతర్జాతీయ సహకారాలను బలోపేతం చేసే లక్ష్యంతో చేపట్టిన ప్రోత్సాహక కార్యక్రమమని వివరించారు.
ఐఐటీ మద్రాసు గ్లోబల్ ఆవిష్కరణ


