నేడు ఉపరాష్ట్రపతికి సత్కారం
సాక్షి, చైన్నె : తమిళనాడుకు చెందిన సీపీ రాధాకృష్ణన్ ఇటీవల ఉప రాష్ట్రపతి బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. తమిళనాడుకు చెందిన వ్యక్తికి ఈ అవకాశం దక్కడంతో ఆయన్ని సత్కరించే విధంగా కొన్ని సంస్థలు , సంఘాలు నిర్ణయించారు. ఈ కార్యక్రమం శుక్రవారం చైన్నె కలైవానర్ అరంగంలో జరగనుంది. అలాగే ఎంజీఆర్ వర్సిటీ స్నాతకోత్సవానికి సైతం ఆయన హాజరు కానున్నారు. చైన్నెకు వస్తున్న సీపీ రాధాకృష్ణన్‌కు ఘన స్వాగతం పలికేందుకు బిజేపీ వర్గాలు సన్నద్ధమయ్యాయి.
తిరుచ్చిలో బీజేపీ‘మోదీ సంక్రాంతి’
సాక్షి, చైన్నె : తిరుచ్చి వేదికగా మోదీ సంక్రాంతి పేరిట వేడుకలకు బీజేపీ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. ఇందులో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొననున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ చేపట్టిన రాష్ట్ర పర్యటనయాత్ర ముగింపు దశకు చేరింది. 4వ తేదిన పుదుకోట్టైలో ఈ యాత్ర ముగియనుంది. దీనిని బహిరంగ సభ రూపంలో విజయోత్సవ తరహాలోజరుపుకునేందుకు సన్నద్ధమయ్యారు. ఈ వేడుక కోసం పుదుకోట్టైలో బ్రహ్మాండ ఏర్పాట్లు వేగవంతమయ్యా యి. 4వ తేదీన ఇక్కడ జరిగే బహిరంగ సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రానున్నారు. మరుసటి రోజున తిరుచ్చి శ్రీరంగంలోని రంగనాథ స్వామి వారిని అమిత్ షా దర్శించుకునేందుకు ఏర్పాట్లు చేశారు. అదేసమయంలో 5న శ్రీరంగంలో రాష్ట్ర బీజేపీ నేతృత్వంలో బ్రహ్మాండ వేడుకగా పీఎం మోదీ పేరిట మోదీ సంక్రాంతి సంబరాల వేడుకకు సన్నద్ధమయ్యారు. ఇందులో అమిత్ షా పాల్గొనున్నారని, ఈ వేడుకతమిళ సంస్కృతి,సంప్రదాయాలను చాటే విధంగా ఉంటుందని రాష్ట్ర బీజేపీ వర్గాలు గురువారం ప్రకటించారు.
గజదాడుల్లో రాగి,
మొక్కజొన్న తోటలు ధ్వసం
సేలం: సత్యమంగళం టైగర్ రిజర్వ్, అసనూర్ ఫారెస్ట్ రిజర్వ్, కెర్మలం ఫారెస్ట్ రిజర్వ్ పరిధిలోకి వచ్చే ఈరోడ్ జిల్లాలోని పదర్‌పాలయం ప్రాంతంలో వారం రోజులుగా ఏనుగుల గుంపులు సంచరిస్తున్నాయి. ఈ క్రమంలో పంటలను దెబ్బ తీస్తున్నాయి, రైతులపై దాడి చేస్తున్నాయి. మంగళవారం అర్ధరాత్రి, 5కి పైగా ఏనుగులు మాధేవప్ప తోటలోకి ప్రవేశించి మొ క్కజొన్న, రాగి పంటలను తిని, తొక్కి విధ్వంసం సృష్టించాయి. అవి సుమారు రెండు ఎకరాల భూమిలో పంటలను తిని, తొక్కి దెబ్బతీశాయి. ఈవిషయం తెలుసుకున్న కెర్మలం అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ గ్రామంలో ఏనుగులు సంచరిస్తూ నే ఉన్నందున, అటవీ శాఖ అధికారులు ఈ ప్రాంతంలో మకాం వేసి ఏనుగులను తరిమికొట్టడానికి చర్యలు తీసుకోవాలి, అడవి జంతు వులు వ్యవసాయ భూముల్లోకి రాకుండా గుంటలు నిర్మించాలి, పంటలు దెబ్బతిన్న రైతుకు పరిహారం అందించాలని రైతులు కోరారు.
మళ్లీ వానలు
సాక్షి, చైన్నె : రాష్ట్రంలో కొద్ది రోజుల విరామంతో మళ్లీ వర్షాలు పడనున్నాయి. ఇందుకు కారణం బంగాళాఖాతంలో తమిళనాడు తీరానికి సమీపంలో ఉపరితల ఆవర్తనం నెలకొని ఉండటమే. నవంబర్‌లో ఆశాజనకంగానే వర్షాలు పడ్డ విషయం తెలిసిందే. డిసెంబరులోవర్షాలు కనుమరుగై, చలి తీవ్రత పెరిగింది. మంచు దుప్పటి క్రమంగా పెరిగింది. ఈ పరిస్థితులలో కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించే విధంగా వేడుకల వేళ బుధవారం అర్థరాత్రి చైన్నె, శివారులలో అనేక చోట్ల వర్షం పడింది. కొన్ని చోట్ల కుండ పోతగా వర్షం పడింది. దిండుగల్ తదితర జిల్లాలో సైతం వర్షం పడింది. ఈశాన్య రుతు పవనాల ముగింపు దశలో ఉన్న నేపథ్యంలో ఇక వర్షాలు కనుమరుగైనట్టే భావించారు. అయితే, హఠాత్తుగా మళ్లీ వర్షం మొదలైంది. మరో రెండు మూడు రోజులు వర్షం ఉత్తరతమిళనాడు జిల్లాలతో పాటుగా, దక్షిణ తమిళనాడు జిల్లాలలో కురుస్తుందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉపరితల ఆవర్తనం తమిళనాడు తీరానికి సమీపంలో ఉందని, దీని ప్రభావం బట్టి వర్షాలు కొనసాగే అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు.
తిరువయ్యారులో
త్యాగరాజ ఆరాధనోత్సవం
సాక్షి, చైన్నె: తిరువయ్యారులోని త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాలు జరగనున్నాయి. ఈనెల 3వ తేదీన ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. వివరాలు.. తంజావూరు జిల్లా తిరువయ్యారులో త్యాగరాజ స్వామి వారి స్మారక మందిరంలో ఏటా ఆరాధనోత్సవాలు అత్యంత వేడుకగా నిర్వహించడం జరుగుతోంది. ఈ ఏడాది 179 ఆరాధనోత్సవానికి ఏర్పాట్లు చేశారు. 3వ తేదీన ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకల్లో ప్రధాన ఘట్టమైన సంగీత నీరాజన కార్యక్రమం 7వ తేదీన జరగనుంది. భక్తి భావాన్ని చాటే విధంగా ఈ ఉత్సవాలు జరగనున్నాయి. పంచరత్న కీర్తనలతో సంగీత నీరాజనం పలికే విధంగా జరిగే ఈ వేడుకు వేలాది మంది ప్రముఖ గాయకులు, సంగీత కళాకారులు తరలి రానున్నారు.


