తొలి జల్లికట్టుకు వేళాయే!
సాక్షి, చైన్నె: కొత్త ఏడాదిలో తొలి జల్లికట్టు సంబరానికి సన్నద్దమయ్యారు. 3వ తేదీన తచ్చాం కురిచ్చిలో జల్లికట్టు రంకెలేయనుంది. ఇందుకోసం గురువారం నుంచి టోకెన్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. సంక్రాంతి పర్వదినం సమీపిస్తుండడంతో తమిళుల సాహస క్రీడ జల్లికట్టు ఏర్పాట్లు వేగవంతం అయ్యాయి. ఈ పోటీలకు మదురై జిల్లా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి అవనీయాపురం, పాలమేడు, అలంగానల్లూరులలో జరిగే పోటీలకే తొలి ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతుంది. అలంగానల్లూరు జల్లికట్టు అయితే, ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఏర్పాట్లపై నిర్వాహకులు అధికారులు దృష్టి పెట్టారు. ఈ పరిస్థితులలో కొత్త సంవత్సరంలో తొలి పోటీ అన్నది పుదుకోట్టై జిల్లా గందర్వ కోట్టై సమీపంలోని తచ్చాంకురిచ్చిలో నిర్వహించడం గత కొన్నేళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. ఇక్కడి అన్నై మాత ఆలయం ఉత్సవాలలో భాగంగా జల్లికట్టు క్రీడ జరుగుతుంది. ఈ పోటీ 3వ తేదిన జరగనుంది. దీంతో పోటీలలో పాల్గొనే క్రీడా కారులు,ఎద్దులకు టోకెన్ల పంపిణీకి గురువారం శ్రీకారం చుట్టారు. దీంతో మదురై, దిండుగల్, శివగంగై, తిరువారూర్, రామనాథపురం తదితర జిల్లాల నుంచి వందలాది మంది ఎద్దుల యజమానులు, క్రీడాకారులు తరలి వచ్చి దరఖాస్తులను సమర్పించి టోకెన్లను పొందే పనిలో పడ్డారు. ఇక్కడ జల్లి కట్టు కోసం చేసిన ఏర్పాట్లను కలెక్టర్ అరుణ పరిశీలించారు. జల్లికట్టుకు సమయం ఆసన్నం అవుతుండటంతో కదన రంగంలో దిగే ఎద్దులకు ప్రత్యేక శిక్షణ వేగవంతమయ్యాయి. అలాగే, క్రీడాకారులు సైతం సాధనలో నిమగ్నమయ్యారు.


