విజయీభవ..! | - | Sakshi
Sakshi News home page

విజయీభవ..!

Jan 2 2026 11:15 AM | Updated on Jan 2 2026 11:15 AM

విజయీ

విజయీభవ..!

మిన్నంటిన న్యూ ఇయర్‌ వేడుకలు భక్తి భావంతో కొత్త సంవత్సరానికి ఘన స్వాగతం వెంకన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు భక్తులతో ఆలయాల కిటకిట పరస్పర శుభాకాంక్షలతో ఆనందోత్సాహాలు చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు కేక్‌ కట్టింగ్‌లతో సంబరాలు

2025 సంవత్సరానికి గుడ్‌ బై చెబుతూ 2026 సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ రాష్ట్రంలో వేడుకలు మిన్నంటాయి. అర్ధరాత్రి వేళ పరస్పర శుభాకాంక్షలతో ఆనందాన్ని పంచుకున్నారు. కేక్‌ కట్టింగ్‌లతో సందడి చేస్తూ, బాణసంచా పేలుస్తూ వేడుకలను హోరెత్తించారు. గురువారం వేకువజాము నుంచే ప్రజలు ఆలయాల ముందు బారులుదీరారు. కొత్త ఆనందం, ఉత్సాహంతో సరికొత్త నిర్ణయాలతో ముందుకు సాగే విధంగా పూజలు, ప్రార్థనల్లో నిమగ్నమయ్యారు.

మెరీనా తీరంలో సందడి

చైన్నె శ్రీవారి ఆలయంలో స్వామివారిని దర్శించుకుంటున్న భక్తులు

సాక్షి, చైన్నె: గడిచిన కాలానికి గుడ్‌ బై చెబుతూ, కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించే విధంగా బుధవారం అర్ధరాత్రి వేళ రాష్ట్ర ప్రజలు తమ ఆనందాన్ని పంచుకున్నారు. రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లోనే కాకుండా పట్టణాలు, గ్రామాల్లోనూ వేడుకలు మిన్నంటాయి. చైన్నె, శివారు జిల్లాలలోని స్టార్‌ హోటళ్లు, రిసార్టులు, ఫామ్‌ హౌస్‌లు, క్లబ్‌లలలో ఆంగ్ల సంవత్సరాదిని ఆహ్వానిస్తూ ఆనందోత్సాహాలతో సంబరాలు జరిగాయి. అర్ధరాత్రి పన్నెండు కాగానే ఎక్కడికక్కడ వేడుకలలో కేక్‌లు కట్‌ చేస్తూ, బాణసంచా పేల్చుతూ, ఆట, పాటలతో కేరింతలు కొడుతూ, ఒకరికొకరు శుభాక్షాంక్షలు తెలుపుకున్నారు. తమ తమ ప్రాంతాలలో ఆనందోత్సాహాలతో యువత రోడ్లపై కేరింతలు కొడుతూ, కన్పించిన వారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఆనందాన్ని పంచుకుంటూ ఉత్సాహంగా ఉరకలు తీశారు. ఇక కొత్త సంవత్సరాదిని ఆహ్వానిస్తూ జరిగిన వేడుకలలో మద్యం ఏరులై పారింది. రాష్ట్రంలోని అన్ని టాస్మాక్‌ దుకాణాలు మందుబాబులతో కిక్కిరిశాయి. బార్లు, నక్షత్ర హోటళ్లు, రిసార్ట్స్‌లలోనూ మద్యం ఏరులై పారడంతో కొత్త సంవత్సరాన్ని మత్తులోనే ఆహ్వానించిన మందుబాబులు ఎక్కువగానే ఉన్నారు.

సముద్ర తీరాలలో..

చైన్నె మెరినా, బీసెంట్‌ నగర్‌, కోవలం, మహాబలిపురం బీచ్‌తో పాటుగా ఈసీఆఆర్‌, ఓఎంఆర్‌ మార్గాలలో రాష్ట్రంలోని అనేక బీచ్‌లు, పరిసరాలలో వేడుకలను ఆహ్వానించే కార్యక్రమాలు జరిగాయి. మెరీనా తీరంలోకి పెద్దసంఖ్యలో జన సందోహం తరలివచ్చి తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఆట పాటలతో చిందేశారు. వర్షం పడుతున్నప్పటికీ లెక్క చేయకుండా కామరాజర్‌ సాలై ఇసుకేస్తే రాలనంతంగా నగర వాసులు తరలి వచ్చి ఆనందంతో కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించారు. చైన్నె పోలీసు అధికారులు ఇక్కడ కేక్‌ కట్‌ చేశారు. చైన్నె పోలీసు కమిషనర్‌ అరుణ్‌ తన కుటుంబంతో కలిసి కామరాజర్‌ సాలైతో పాటూ పలు ప్రదేశాలలో జరిగిన కేక్‌ కట్టింగ్‌ కార్యక్రమానికి హాజరై పోలీసులు, ప్రజలకు శుభాకంక్షలు తెలియజేశారు. శ్రామిక విగ్రహం వద్ద పిల్లలతో కలిసి ఆయన కేక్‌ కట్‌ చేసి అందరికి పంచి పెట్టారు. నగరంలో అనేక చోట్ల, అనేక కూడళ్లలలో పోలీసులు, ప్రజలతో కలిసి ఆనందాన్ని, శుభాకాంక్షలను పంచుకున్నారు. అందరికీ కేక్‌లు, స్వీట్లు, చాక్లెట్లను పోలీసులు పంచి పెట్టారు. అలాగే నగరంలో పలు కూడళ్లలో పోలీసుల నేతృత్వంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో ఆ పరిసర వాసులు అక్కడికి వచ్చి కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించే విధంగా సందడి చేశారు. నీలాంకరై, కోవలం, మహాబలిపురం బీచ్‌లలోనూ సంబరాలు మిన్నంటాయి. పుదుచ్చేరి, కన్యాకుమారి తీరాలలో కోలాహలంగా వేడుకలు నిర్వహించారు. అయితే, గురువారం ఉదయం సూర్యోదయాన్ని తిలకించ లేని పరిస్థితి పర్యాటకులకు ఏర్పడింది. ఇందుకు కారణం మంచు దుప్పటి కప్పేయడమే. ఇక అర్ధరాత్రి కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని , రాష్ట్రంలోని చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. పెద్దసంఖ్యలో క్రైస్తవులు తరలి వచ్చి ఆరాధనల్లో లీనమయ్యారు. కేక్‌లను కట్‌ చేసి ఆనందాన్ని పంచుకున్నారు.

మిన్నంటిన భక్తి భావం

రాత్రంతా సందడితో కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించిన వారంతా వేకువ జామున తలంటు స్నానాలతో ఆలయాల బాట పట్టారు. వేకువ జామున కొత్త సంవత్సరంలో సరికొత్తగా ముందుకెళ్లడంతో పాటూ, అన్ని శుభాలే జరిగేలా, తమ జీవితంలో కొత్త పుంతలు తొక్కే రీతిలో దేవుళ్లను ప్రార్థించుకునే విధంగా జన సందోహం ఆలయాల వద్ద బారులుదీరారు. కొత్త సంవత్సరాదిని పురస్కరించుకుని టీ నగర్‌లోని టీటీడీ సమాచార కేంద్రలోని వెంకటేశ్వర స్వామి సన్నిధిలో, జీఎన్‌ చెట్టి రోడ్డులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయాలలో ఉదయాన్నే విశిష్ట పూజలు నిర్వహించారు. వేకువ జామున స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణలు జరిగాయి. పెద్ద ఎత్తున భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు బారులుదీరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా ప్రత్యేక క్యూలు ఏర్పాటు చేయడంతో అందరికీ స్వామి దర్శన భాగ్యం కల్గింది. స్వామి, అమ్మవార్లను దర్శించుకున్న భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. టీటీడీ స్థానిక ఏఈఓ ధనుంజయ్‌ నేతృత్వంలో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రసాదాలు అందజేశారు. లడ్డూలు, టీటీడీ క్యాలెండర్ల అమ్మకాలు జోరుగా సాగాయి. ఇక, చైన్నె ట్రిప్లికేన్‌ పార్థసారథి ఆలయం, మైలాపూర్‌ కపాళీశ్వరాలయం, వడపళని సుబ్రమణ్య స్వామి ఆలయాల్లో వేకువ జాము నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు బారులు తీరి దర్శనం చేసుకున్నారు. రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన మదురై మీనాక్షి అమ్మవారి ఆలయంలో, తిరుచ్చి శ్రీరంగం రంగనాథస్వామి ఆలయం, సమయపురం మారియమ్మన్‌ ఆలయం, తిరుచెందూరు సుబ్రమణ్య స్వామి, పళణి దండయుధపాణి ఆలయం, తిరుప్పరకుండ్రం మురుగన్‌ ఆలయం, తంజావూరు బృహదీశ్వర ఆలయం, కాంచీపురం కామాక్షి అమ్మన్‌ తదితర ఆలయాలలో విశిష్ట పూజలు జరిగాయి. వేకువజాము నుంచి ఏకాంత సేవ వరకు భక్తులు భక్తి భావంతో ఆలయాల సందర్శనలో పెద్ద సంఖ్యలో మునిగారు.

సీఎంకు నేతల శుభాకాంక్షలు

సీఎం స్టాలిన్‌కు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు ఆయన నివాసం వద్దకు ఉదయాన్నేపెద్ద ఎత్తున మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు తరలి వచ్చారు. కేడర్‌ సైతం బారులుదీరారు. మంత్రులు దురై మురుగన్‌, ఏవీ వేలు, ఎం. సుబ్రమణియన్‌, శేఖర్‌బాబు, నెహ్రూ, అన్బిల్‌ మహేశ్‌, తంగం తెన్నరసు, స్వామినాథన్‌, ఎంపీలు కనిమొళి, టీఆర్‌బాలుతో పాటుగా పలువురు సీఎంను కలిసిన వారిలో ఉన్నారు. అలాగే డీఎంకే ముఖ్య నాయకులు, జిల్లాల నేతలు, సీఎం ఇంటి ముందు క్యూ కట్టారు. ఈ సందర్భంగా సీఎం చేతుల మీదుగా కొత్త క్యాలెండర్ల ఆవిష్కరణలు జరిగాయి. అలాగే అన్నాడీఎంకే ప్రధాన కార్యాదర్శి పళని స్వామి నివాసం వద్ద సైతం ఆ పార్టీ నేతలు బారులుదీరారు. ఆయనకు శుభకాంక్షలు తెలియజేసి ఆశీస్సులు అందుకున్నారు. తమిళ మానిల కాంగ్రెస్‌ నేత జీకే వాసన్‌ను ఆ పార్టీ నేతలు జీఆర్‌ వెంకటేష్‌ నేతృత్వంలో నిర్వాహకులు కలిసి శుభాకాంక్షలు తెలియజేసి సత్కరించారు. ఇక, దక్షిణభారత చలన చిత్ర సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌కు శుభాకాంక్షలు తెలిపేందుకు ఆయన అభిమానులు పోయేస్‌ గార్డెన్‌కు పెద్ద సంఖ్యలో వచ్చారు. వారందర్నీ రజనీకాంత్‌ పలకరించారు. కొత్త సంవత్సరం వేళ సంబరాలు, భక్తి భావమే కాదు, పసందైన విందులు హోరెత్తాయి. దీంతో మాంసం, చేపల ధరకు రెక్కలు తప్పలేదు.

పర్యాటకం కిటకిట

కొత్త సంవత్సరం వేడుక వేళ ప్రజలు పర్యాటక ప్రాంతాలలో ఆనందంగా గడిపే విధంగా కూడా ముందుకెళ్లారు. రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన కొడైకెనాల్‌, ఊటీ, హొగ్నెకల్‌, ఏర్కాడు, వంటి పర్యాటక కేంద్రాలు సందర్శకులతో కిక్కిరిసింది. ఇక, ఆయా నగరాలలోని పార్కులు బీచ్‌ల వైపుగా జనం పోటెత్తారు. చైన్నెలోని మెరీనా, ఎలియట్స్‌, బీసెంట్‌ నగర్‌, నీలాకంరై, కోవళం, మహాబలిపురం జనంతో కిక్కిరిశాయి. కొత్త సంవత్సరం వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట భద్రతతో వ్యవహరించారు. చైన్నెలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా, నేరాలకు ఆస్కారం ఇవ్వకుండా 19 వేల మంది పోలీసులు విధులలో నిమగ్నమయ్యారు. 425 ప్రాంతాలలో పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం ద్వారా ప్రమాద రహితంగా చైన్నెలో కొత్త ఆహ్వానం మిన్నంటినట్టు పోలీసు కమిషనరేట్‌ ప్రకటించింది.

విజయీభవ..!1
1/2

విజయీభవ..!

విజయీభవ..!2
2/2

విజయీభవ..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement