రూట్‌కు రజనీకాంత్ ఆశీస్సులు
తమిళసినిమా: నటుడు గౌతమ్ రామ్ కార్తీక్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం రూట్–రన్నింగ్ అవుట్ ఆఫ్ టైమ్. వెరూస్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా నటి అపర్‌శక్తి కురానా నాయకిగా పరిచయం అవుతున్నారు. నటి భవ్య త్రిఖా, వైజీ మహేంద్రన్, పాన్వీరెడ్డీ, ఆర్‌జే ఆనంది, లింగ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం ద్వారా సూర్య ప్రతాప్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన రజనీకాంత్ హీరోగా నటించిన కొచ్చడైయాన్ చిత్రానికి సహాయ దర్శకుడిగా పని చేశారన్నది గమనార్హం. ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను నటుడు రజనీకాంత్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయనకు యూనిట్ సభ్యులు చిత్రంలోని కొన్ని సన్నివేశాలను చూపించారట. అవి చూసిన రజనీకాంత్ చాలా బాగున్నాయని ప్రశంసిస్తూ, మంచి విజన్‌తో పూర్తి ఎఫెక్ట్ పెట్టి తెరకెక్కిస్తున్న రూట్ చిత్రం మంచి విజయాన్ని సాధించాలని యూనిట్ సభ్యులకు ఆశీస్సులు అందించినట్లు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. ఈ సందర్భంగా తమ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేసిన రజనీకాంత్‌కు చిత్ర యూనిట్ ధన్యవాదాలు తెలిపారు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో కుటుంబ భావోద్వేగాలతో కూడిన సన్నివేశాలు చోటు చేసుకుంటాయని దర్శకుడు చెప్పారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న రూట్ చిత్రానికి అర్జున్ రాజా ఛాయాగ్రహణం, ఆరన్‌రే సంగీతాన్ని అందిస్తున్నారు.


