75 వేల కేంద్రాల్లో ఓటరు నమోదు శిబిరాలు
సాక్షి, చైన్నె: ఎస్‌ఐఆర్ ప్రక్రియ తదుపరి శని, ఆదివారాలలో రాష్ట్రవ్యాప్తంగా ఓటరు శిబిరాలు ఏర్పాటయ్యాయి. తొలి రోజు శనివారం 75 వేల పోలింగ్ కేంద్రాలలో ఏర్పాటు చేసిన శిబిరాల వద్దకు ఓటర్లు తరలి వచ్చి తమ పేర్లు జాబితాలో ఉన్నాయా.? అని పరిశీలించుకున్నారు. లేని వారు తమ వద్ద ఉన్న ఆధారాలతో దరఖాస్తు చేసుకున్నారు. వివరాలు.. రాష్ట్రవ్యాప్తంగా నవంబర్ 4 నుంచి డిసెంబరు 14 వరకు ఓటరు జాబితా సవరణ ప్రక్రియ జరిగిన విషయం తెలిసిందే. నమూనా ఓటరు జాబితా ను విడుదల చేశారు. ఇందులో సుమారు 97 లక్షల మంది పేర్లను తొలగించారు. అత్యధికంగా 60 లక్షల పేర్లు చిరునామాల మార్పుతో గుర్తించలేని పరిస్థితి ఏర్పడిందని ప్రకటించారు. ఈ జాబితా తదుపరి సవరణ ప్రక్రియపై అనేక ఆరోపణలు బయలు దేరాయి. జీవించి ఉన్న వారిని అనేక మందిని చంపేశారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేసే వారు పెరిగారు. అలాగే, తమ ఇళ్ల వద్దకు ఎవ్వరూ రాలేదంటూ అనేక మంది ఓటర్ల ఆగ్రహాన్ని ప్రదర్శించే పనిలో నిమగ్నమయ్యారు.
ప్రత్యేక శిబిరాలు..
ఓటరు జాబితాలో తమ పేర్లు లేవంటూ అనేక మంది ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుండంతో వీరి కోసం ప్రత్యేక శిబిరాల నిర్వణకు ఎన్నికల ప్రధాన అధికారి అర్చనా పట్నాయక్ చర్యలు తీసుకు న్నారు. అన్ని పోలింగ్ కేంద్రాలలో ఓటరు జాబితాలను పొందుపరిచారు. ఓటర్లు తమ పేర్లను పరిశీలించుకునేందుకు వీలు కల్పించారు. ఎవ్వరెవ్వరి పేర్లు జాబితాలో లేవో వారికి మళ్లీ అవకాశం కల్పించే విధంగా శనివారం శిబిరాలు జరిగాయి. ఫారం 6 ద్వారా జాబితాలో పేర్లు లేని వాళ్ల తమ వద్ద ఉన్న ఆధారాలతో మళ్లీ దరఖాస్తు చేసుకోక తప్పలేదు. అలాగే, కొత్తగా పేర్లను చేర్పించుకునే పనిలో ఓటర్లు అనేక మంది నిమగ్నమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 75 వేల శిబిరాలలో వేలాది మంది సిబ్బంది సహకారంతో శిబిరాలు ఆదివారం కూడా జరగనునున్నాయి. చైన్నెలో సుమారు 1,900 కేంద్రాలలో శిబిరాలు జరుగుతున్నాయి.


