వైకుంఠ ద్వార దర్శనాలకు విస్తృత ఏర్పాట్లు
తిరుమల: శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాలకు విచ్చేసే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విస్తృత ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. శనివారం ఉదయం ఆయన తిరుమలలోని క్యూలను అధికారులతో కలిసి ఆయన తనిఖీ చేశారు. క్యూల్లో ఏర్పాటు చేసిన తాగునీటి కొళాయిలు, అన్న ప్రసాదం పంపిణీ, మరుగుదొడ్ల సౌకర్యాలను పరిశీలించి భక్తులతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు.
మొబైల్ వాటర్ డ్రమ్స్, మొబైల్ ఫుడ్ వ్యాన్లు
భక్తులకు తాగునీరు అందించేందుకు అదనంగా మొబైల్ వాటర్ డ్రమ్స్, మూడు మొబైల్ ఫుడ్ వ్యాన్లు అందుబాటులో ఉంచినట్లు అదనపు ఈఓ తెలిపారు. ఈ తనిఖీల్లో ఆలయ డిప్యూటీ ఈఓ లోకనాథం, అన్న ప్రసాద విభాగం డిప్యూటీ ఈఓ రాజేంద్ర, హెల్త్ డిప్యూటీ ఈఓ సోమన్నారాయణ, ఈఈ శ్రీనివాసులు, డీఈ చంద్రశేఖర్, ఐటీ డిప్యూటీ జీఎం వెంకటేశ్వర్లు నాయుడు, అశ్వని ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటసుబ్బారెడ్డి పాల్గొన్నారు.
జనవరి 7వ తేదీ వరకు ఎస్‌ఎస్‌డీ టోకెన్లు రద్దు
శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలను పురస్కరించుకుని విచ్చేసే భక్తుల రద్దీ దృష్ట్యా డిసెంబర్ 28 నుంచి జనవరి 7వ తేదీ వరకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ లో భక్తులకు ఇచ్చే ఈ టోకెన్ల జారీని టీటీడీ రద్దు చేసింది.
వైకుంఠ ద్వార దర్శనాలిలా..
డిసెంబర్ 30 నుంచి జనవరి ఒకటో తేదీ వరకు ఈ–డిప్ ద్వారా టోకెన్లు పొందిన భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వారదర్శనం. టోకెన్ పొందిన భక్తులు ఆయా తేదీల్లో మాత్రమే తిరుమలలోని దర్శన ప్రవేశ మార్గాలకు చేరుకోవాల్సి ఉంటుంది. జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు సర్వదర్శనం క్యూల ద్వారా వైకుంఠ ద్వార దర్శనం పొందడానికి తమ ప్రణాళికను రూపొందించుకోవాలిని టీటీడీ కోరుతోంది.


