కలుషిత నీటికి రెండు ప్రాణాలు బలి
పళ్లిపట్టు: కలుషిత నీరు తాగి ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లు ఆరోపిస్తూ గ్రామస్తులు శనివారం రాస్తారోకో చేపట్టారు. దీంతో శనివారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. వివరాలు.. పళ్లిపట్టు సమీపంలోని కర్లంబాక్కం కాలనీలో 200కు పైగా కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. పంచాయతీ పైపులైన్ల ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నారు.ఈ క్రమంలో గ్రామానికి చెందిన తాపిమేస్త్రి ఏలుమలై (55), సుధ(40) అనే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. పైగా 14 మందికి వాంతాలు, విరేచనాలతో తిరుత్తణి, పళ్లిపట్టు ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తాగునీటిలో కలుషిత నీరు కలిసిపోవడంతోనే రెండు ప్రాణాలు గాలిలో కలిసినట్లు ఆరోపిస్తూ గ్రామస్తులు రాస్తారోకో చేపట్టారు. దీంతో పళ్లిపట్టు షోళింగర్ రాష్ట్ర రహదారిలో వాహన సేవలు స్తంభించాయి. పోలీసులు వారితో చర్చలు జరిపారు. అయితే గ్రామీణులు పోరాటం వీడక పోవడంతో తహసీల్దారు భారతి, బీడీఓ అరుల్ సహా అధికారులు చర్చించారు. బాధిత కుటుంబీకులకు ప్రభుత్వం ఆర్ధిక సాయం అందజేయాలని ఆందోళనకారులు కోరారు. కాగా తాగునీటిని ల్యాబ్‌కు పంపామని, రిపోర్టు వచ్చిన తరువాతే నిర్ణయం తీసుకోగలమని అధికారులు వివరించారు. దీంతో ఐదు గంటల పాటూ చేపట్టిన రాస్తారోకోను గ్రామస్తులు విరమించారు. అదే సమయంలో మండల ఆరోగ్య శాఖ అధికారి ధనంజెయియన్ ఆధ్వర్యంలో వైద్యుల బృందం గ్రామస్తులుకు వైద్య సేవలు అందిస్తున్నారు.
సుధ (ఫైల్), ఏలుమలై (ఫైల్)
కలుషిత నీటికి రెండు ప్రాణాలు బలి
కలుషిత నీటికి రెండు ప్రాణాలు బలి


