గాంధీ పేరు మార్పునకు వ్యతిరేకంగా నిరసన
సాక్షి, చైన్నె: గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మహాత్మగాంధీ పేరును తొలగిస్తూ కేంద్రం తీసుకున్న చర్యలను ఖండిస్తూ బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా డీఎంకే ఇచ్చిన పిలుపు మేరకు కూటమి పార్టీల మద్దతుతో నిరసనలు హోరెత్తించారు. అన్ని జిల్లా కేంద్రాలలో డిఎంకే కూటమి పార్టీల నేతలు ధర్నాలు నిర్వహించాయి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్రం కొత్తగా వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్, అజీవికామిషన్– గ్రామీణ(వీబీ –జీరామ్‌జీ)గా మారుస్తూ లోక్ సభలో బిల్లును తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీనిని వ్యతిరేకిస్తూ తొలుత కాంగ్రెస్ నేతృత్వంలో నిరసనలు హోరెత్తాయి. తాజాగా డీఎంకే నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి దురై మురుగన్ పిలుపునిచ్చారు. ఆ పార్టీ అధ్యక్షుడు స్టాలిన్ ఆదేశాలతో బుధవారం ఉదయం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి. ఆయా జిల్లాలో జిల్లాల కార్యదర్శులు, నగర, కార్పొరేషన్లలో అక్కడి నేతల నేతృత్వంలో నిరసనలు జరిగాయి. స్థానికం ఉన్న డీఎంకే కూటమి నాయకుల,గ్రామీణ ప్రజలు, రైతు, రైతుల కూలీలు పెద్ద ఎత్తున నిరసనలో భాగస్వామ్య మయ్యారు. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలోనూ నిరసనలు హోరెత్తాయి. డీఎంకే ఎమ్మెల్యేల నేతృత్వంలో కారైక్కాల్ పరిసరాలలో ఆందోళనలు జరిగాయి. ఇక, చైన్నెలో భారీ నిరసన కార్యక్రమం జరిగింది. డీఎంకే సీనియర్ ఆర్‌ఎస్ భారతీ నేతృత్వంలో జరిగిన ఈ నిరసనకు ద్రావిడ కళగం నేత వీరమణి, వీసీకే నేత తిరుమావళవన్, ఎండీఎంకే నేత వైగో, మైనారిటీ నేతలు ఖాదర్ మొహిద్దీన్, జవహిరుల్లా, సీపీఎం, సీపీఐ , ఇతర కూటమి పార్టీల నేతలు, ప్రతినిధులు ఈ నిరసనలో భాగస్వామ్యమయ్యారు. గాంధీ పేరు తొలగిస్తూ కేంద్రం అనుసరించిన తీరును తీవ్రంగా కూటమి నేతలు ు దుయ్యబట్టాయి. మహాత్మాగాంధీ చిత్రపటాలను చేత బట్టి మళ్లీ ఆయన పేరు పెట్టాలని నినదించారు. ఇక సీఎం స్టాలిన్ ఎక్స్ పేజీలో స్పందిస్తూ, తమిళనాడు వ్యాప్తంగా మహాత్మాగాంధీ పేరు జ్వలించిందన్నారు. రైతకూలీలు, పేద గ్రామీణ ప్రజలు పెద్ద ఎత్తున నిరసనకు తరలివచ్చి తమ ఆగ్రహాన్ని కేంద్రానికి వ్యతిరేకంగా తెలియజేశారన్నారు. గాంధీపేరును పునరద్ధరించాలని గళాన్ని వినిపించారన్నారు. ఇకనైనా కేంద్రం స్పందించాలని హితవు పలికారు.


